Suryaa.co.in

Andhra Pradesh

పవన్ కల్యాణ్ పై కేసులు పెట్టటం జగన్ అరాచకాలకు పరాకాష్ట

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

వాలంటీర్స్ ని అవమానించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రభుత్వం డిఫమేషన్ సూట్ వేయడం కక్షసాధింపేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ప్రశ్నించే గొంతుకను ఈ ప్రభుత్వం నొక్కుతుండటం చాలా దుర్మార్గం.ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించే హక్కు పవన్ కల్యాణ్ కు ఉంది. ఆయనపై కేసు ప్రభుత్వ దుందుడుకు చర్యే. వాలంటీర్స్ అనవసరమైన డేటా సేకరిస్తున్నారు. ఆ డేటా ఎవరికి పంపుతున్నారు?

ఎక్కడ నిక్షిప్తం చేస్తున్నారని పవన్ కల్యాణ్ అడగడం తప్పా? వాలంటీర్స్ సేకరిస్తున్న డేటా.. చౌర్యానికి గురవుతోందని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే ఆయన గొంతు నొక్కుతారా? నానకరామ్ గూడలోని ఎఫ్ఓఏ ప్రైవేట్ కంపెనీ లో 700 మంది పనిచేస్తున్నారు. అక్కడకు ఈ డేటా సమాచారం చేరుతోందంటే, ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిపోయి, పవన్ కల్యాణ్ పైనే కేసులు పెట్టడం ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి నిదర్శనం. మీ బూతుల మంతి కొడాలి నాని, అవగాహనలేని మంత్రి జోగి రమేష్, మహిళా మంత్రి రోజా చంద్రబాబుపై అనేకసార్లు అవమానకరంగా మాట్లాడితే వారిపై డీఫేమేషన్ కేసు ఎందుకు పెట్టలేదు?

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలే అని వారిని అవమానించిన మంత్రి ధర్మానపై అజయ్ జైన్ ఎందుకు కేసు పెట్టరు? హోంమంత్రి తానేటి వనిత కూడా ‘‘వాలంటీర్లంటే మా పార్టీ కార్యకర్తలే’’ అని వారిని అవమానపరిస్తే, అజయ్ జైన్ ఎందుకు ఆమెపై 199 సీఆర్ పీసీ ప్రకారం కేసు పెట్టలేదు? ఏ-2 విజయసాయిరెడ్డి పలుదఫాలు వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెబితే ఆయనపై కేసేదీ? అక్రమ సంబంధాలు, కులాంతర వివాహాలు, ఆస్తి పాస్తుల వవరాలు లాంటి అనవసరమైన డేటా, సేకరించమని వాలంటీర్లకు అజయ్ జైన్ గారే నిర్దేశించారా?

వాలంటీర్ల వ్యవస్థను రిక్రూట్ చేసింది అజయ్ జైనే కదా! మరి వైసీపీ కార్యకర్తలని తెలుసుకుని ఆయన నియమించారా? హైదరాబాద్ నానకరామ్ గూడ లోని ఎఫ్ఓఏ కంపెనీలో పనిచేసే 700 మంది ఉద్యోగస్థులను అజయ్ జైన్ గారే నియమించారా? నానకరామ్ గూడ లోని ఎఫ్ఓఏ కంపెనీకి రాష్ట్ర వాలంటీర్లు సేకరించిన ప్రజల వ్యక్తిగత వివరాల డేటా చేరుతున్న విషయం నిజంకాదా? విలువైన ప్రజల వ్యక్తిగత సమాచారం.. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి దుర్వినియోగానికి గురైతే అజయ్ జైన్ ఎందుకు మౌనంగా వున్నారు?

అసలు ఐఏఎస్ అజయ్ జైన్ ప్రజాస్వామ్యబద్ధులా? లేక వైసీపీబద్దులో అర్థం కావటంలేదు. పవన్ కల్యాణ్ వాలంటీర్స్ ను అవమానకరంగా మాట్లాడారని ఆయనపై డీఫేమేషన్ కేసు వేయడం సమంజసం కాదు. పవన్ కల్యాణ్ ను ప్రాసిక్యూట్ చేయమని ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ జైన్ కోరడంలో అర్థంలేదు. ప్రశ్నించే గొంతుకలను ఎన్నాళ్లని నొక్కుతారు? వారి గొంతులు ఎందుకు పిసుకుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలనుకునే ప్రభుత్వ ఆలోచనలకు స్వస్తి పలకాలి.

ప్రశ్నించే వ్యక్తులపై కేసులు పెట్టి వేధించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని చెప్పకనే చెబుతోంది. వాలంటీర్లు అనవసరపు డేటా కలెక్ట్ చేయడాన్ని ప్రశ్నించడం తప్పా?వాలంటీర్లు కలెక్ట్ చేసే డేటా ఎక్కడికి వెళ్తోందని అనుమానం వ్యక్తం చేస్తే కేసు పెడతారా? రాష్ట్ర వాలంటీర్లు కలెక్ట్ట్ చేసిన డేటా హైదరాబాద్ లోని నానాక్రమ్ గూడ లో 700 మందితో నడిచే ఎఫ్ఓఏ అనే ఆర్గనైజేషన్ కుచేరి.. వారి వద్ద నుండి ఎవరి వద్దకు వెళ్తుందో తెలియాలి. రాష్ట్రంలో అనేకమంది అమ్మాయిలు, మహిళలు మిస్ అవుతున్నా వదిలేయాలా? పట్టించుకోకూడదా?

వాలంటీర్స్ కార్యకర్తలందరూ మావారే అని స్వయంగా వైసీపీ నాయకులే ప్రకటిస్తున్నారు. ఇంతకన్నా నిదర్శనం ఏంకావాలి?కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నానిలు చంద్రబాబును తిడితే వారిపై చర్యలు లేవుగానీ.. వాలంటీర్లను ఏదో అన్నారని పవన్ పై చర్యలా?వాలంటీర్స్ ని అపాయింట్ చేసుకున్నది వైసీపీ ప్రభుత్వంకాదా? ఎవరెవెరికి ఎంత జీతం? ఎవరికి ఎంత ఆస్తి ఉంది?ఎవరెవరికి అక్రమ సంబంధాలున్నాయి? ఇదా వాలంటీర్లు సేకరించాల్సింది?

వాలంటీర్ ఉద్యోగాలిచ్చింది మన పార్టీవారికే అని హోంమంత్రి అనడం సిగ్గుచేటు. ధర్మాన ప్రసాదరావు, హోంమంత్రి తానేటి వనితపై ఎందుకు డిఫ మేషన్ సూట్ వేయరు? అరాచక, అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేక పరిపాలన గురించి జగన్ రెడ్డి భాగోతం అంతా అందరికీ తెలిసిపోయింది. విసిగి వేసారిన ప్రజలు మీ అరాచక పరిపాలనను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జగన్ దుష్ట పాలనకు త్వరలోనే తెలుగుదేశం పార్టీ ముగింపు పలుకుతుందని ‘వర్ల’ తెలిపారు.

LEAVE A RESPONSE