Suryaa.co.in

Editorial

‘కిషన్‌రెడ్డి’తో ‘కమలం’ వికసిస్తుందా?

– ఆర్గనైజేషన్‌ను గాడిలో పెట్టడమే అసలు సవాలు
– అంతర్గత కలహాల నివారణే అసలు సమస్య
– సంజయ్‌ను మరిపిస్తేనే మనుగడ
– దూకుడుగా వెళితేనే ఫలితాలు
– సర్కారుపై సమరంపైనే కిషన్‌రెడ్డి భవిష్యత్తు
– మాటల కంటే చేతలకు ప్రాధాన్యం ఇస్తేనే నమ్మకం
– సీనియర్ల సహకారం ఉంటేనే సక్సెస్‌మంత్ర
– వలస నేతలకు విలువిస్తేనే పార్టీ పురోగతి
– బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదన్న సంకేతాలిస్తేనే ఫలితాలు
– పేపర్ టైగర్లను పక్కనబెడితేనే పార్టీకి ఉపయోగం
– ‘గ్రేటర్’పై మళ్లీ పట్టు సాధిస్తేనే పార్టీకి జీవం
– మెజారిటీ సీట్లు గెలిస్తేనే సొంత ప్రతిష్ఠ
– సెటిలర్లపై పార్టీ వైఖరి ఏమిటి?
– పాతవారికి పట్టం కడితేనే పాతకళ
– ‘రెడ్డి కార్పెట్’ముద్ర చెరిపితేనే నేతల్లో నమ్మకం
– బీసీలను ప్రోత్సహిస్తేనే కమలవికాసం
– హిందుత్వ కార్డు కంటే రాజకీయ వ్యూహాలే మేలు
– ‘కమలకిరిటీధారి’ కిషన్‌రెడ్డికి సమస్యలతో‘రణం’
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)

కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి నాలుగోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బీజేపీకి ఆయనే తొలి అధ్యక్షుడు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కిషన్‌రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా కూడా పనిచేసిన కిషన్‌రెడ్డి హయాంలో జరిగిన, ఏ ఎన్నికల్లోనూ పువ్వు పరిమళించింది లేదు. అన్నీ వైఫల్యాలే.

స్వయంగా ఆయనే ఎమ్మెల్యేగా ఓడిపోగా, మొత్తం మీద ఒక్క సీటుకే పరిమితమైన విషాదం. ఆ ఎన్నికల్లో నగరంలోని ఐదు స్థానాల్లో.. అప్పటి టీఆర్‌ఎస్‌తో బీజేపీ రహస్య అవగాహన చేసుకున్నా, ఆ ఐదు స్థానాల్లో టీఆర్‌ఎస్ నిలబెట్టిన బలహీన అభ్యర్ధులే గెలవడం మరో విషాదం. మళ్లీ ఇప్పుడు తెలంగాణ పార్టీ కమల దళపతిగా అవతరించనున్న కిషన్‌రెడ్డికి.. ఆర్గనైజేషన్ బలహీనతలు, రాజకీయ సవాళ్లు, పార్టీ అంతర్గత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల బలం మూడు. రాజాసింగ్ మాత్రమే తొలిసారి జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌తో అసెంబ్లీలో పార్టీ సంఖ్య మూడుకు చేరింది. వీరిద్దరూ బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి విజయం సాధించారు.

ఇక కిషన్‌రెడ్డితో కలిపి ఎంపీల సంఖ్య నాలుగు. డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా వేరే రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. టీడీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడే, గరికపాటి మోహన్‌రావు పార్టీలో చేరారు. సంజయ్ సారథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో , తొలిసారి 40కి పైచిలుకు స్థానాలు సాధించింది. అందులో అరడజనుకుపై మంది కార్పోరేటర్లు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదీ రాష్ట్రంలో బీజేపీ సాంకేతిక బలం. అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన చేరిన వారే తప్ప, స్వతహాగా పార్టీకి పెద్దగా బలం లేదని స్పష్టమవుతూనే ఉంది.

ఈ సంఖ్యను పెంచి, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఇప్పుడు కిషన్‌రెడ్డి ముందున్న అతిపెద్ద సవాలు. బీజేపీ పుట్టిన తర్వాత, కేవలం ఒకటి-రెండు స్థానాలున్న రాష్ట్రాల్లో కూడా, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది. కానీ ఉప రాష్ట్రపతులు, కేంద్రమంత్రులు, గవర్నర్లుగా చేసిన ఈ రాష్ట్రంలో మాత్రం, పార్టీ ఇప్పటికి పట్టుమని పదిహేను సీట్లు గెలుచుకున్న దాఖలాలు లేకపోవడమే, పార్టీ శ్రేణులను బాధించే అంశం.

అంటే దీన్నిబట్టి.. వారంతా పార్టీ వల్ల పదవులు- అధికారం- డబ్బు సంపాదించడమే తప్ప.. వారివల్ల పార్టీకి నయాపైసా లాభం లేదని స్పష్టమవుతూనే ఉందన్నది నేతల విమర్శ. ఈ క్రమంలో మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్‌రెడ్డి, పార్టీని అధికారంలోకి తీసుకువస్తారా? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న భావన క్యాడర్‌లో కనిపించేది. సంజయ్‌ది ఒంటరిపోరాటమే అయినా, ఆ ప్రభావం జిల్లాలపై కనిపించేది. అయితే ఢి ల్లీ లిక్కరు కేసులో.. సీఎం కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయకపోవడంతో, బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న భావన క్యాడర్‌తోపాటు, ప్రజల్లో కూడా బలంగా నాటుకుపోయింది.

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే బదులు, కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా ఉండేందుకే, పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నేతలకు రుచించడం లేదు. అదే కారణంతో ఇతర పార్టీల నుంచి, చేరికలు కూడా చతికిలపడ్డాయి. దానికితోడు కిషన్‌రెడ్డిని అధ్యక్షుడు, ప్రకాష్‌జవదేకర్‌ను ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత, ఇక తెలంగాణలో బీజేపీ పోరాటం ముగిసిందన్న భావన అన్ని వర్గాల్లో స్థిరపడింది. ఫలితంగా ఇప్పుడు యుద్ధభూమిలో, బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మాత్రమే నిలిచిన పరిస్థితి.

ఈ పరిస్థితిని మార్చి.. బీఆర్‌ఎస్ సర్కారుపై ‘ఫలితాలతో కూడి న చర్యలు’ తీసుకుంటేనే బీజేపీకి మనుగడ. కేవలం కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసి.. మీడియాలో నానినంత మాత్రాన, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన అనేక పోరాటాలు, ఆరోపణల్లో సర్కారు అవినీతికి సంబంధించిన ఆధారాలను, మీడియా ద్వారా ప్రజలకు చూపించేవారు. వాటిపై ప్రత్యక్షంగా పోరాడేవారు. దానితో ప్రజల కోసం సర్కారుపై ప్రత్యక్షంగా పోరాడుతున్నది, ఒక్క కాంగ్రెస్ మాత్రమేనన్న నమ్మకం జనంలో ఏర్పడింది.

ఇప్పుడు జనంలో బలంగా పాతుకుపోయిన, ఆ ‘కుమ్మక్కు రాజకీయాల’ భావనను తొలగిస్తేనే బీజేపీకి మనుగడ. అది కార్యాచరణ-చర్యల రూపంలో ఉంటేనే, ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా కేవలం పత్రికా ప్రకటనలు, ఉత్తుత్తి ధర్నాలు, పోలీసులను ప్రతిఘటించే క్రమంలో భాగంగా కంటితుడుపు అరెస్టులయితే, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.

కిషన్‌రెడ్డి అధ్యక్షుడయ్యాక తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన క్రమంలో, డబుల్‌బెడ్‌రూముల సంద ర్శన కార్యక్రమం రూపొందించారు. ఆ నేపథ్యంలో పోలీసులు ఆయనతోపాటు, పార్టీ నేతలను నిర్బంధించారు. కానీ ఈ నాలుగేళ్లలో బీజేపీ నేతలెవరూ, డబుల్ బెడ్‌రూముల కోసం పోరాటాలు చేసిన దాఖలాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించదు.

స్వయంగా కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న.. సికింద్రాబాద్ పార్లమెంటు పరిథిలోనే, అనేకచోట్ల డబుల్ బెడ్‌రూము నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటికోసం పేదల నుంచి డిమాండ్ ఉంది. అయినా కిషన్‌రెడ్డి ఎంపి హోదాలో.. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా వాటిని పరిశీలించి, పోరాడిన దాఖలాలు లేవు. అందుకే డబుల్‌బెడ్ రూములపై కిషన్‌రెడ్డి చేసిన పోరాటం అభాసుపాలయింది.

కేవలం మీడియాను ఆకర్షించేందుకే.. ఆ కార్యక్రమం రూపొందించినట్లుందని, సొంత పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం ప్రస్తావనార్హం. ఇలాంటి కంటితుడుపు కార్యక్రమాలు కాకుండా.. సర్కారు అవినీతిపై ఆధారాలతో కూడిన పోరాటాలు చేస్తేనే, ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీజేపీని కూడా నమ్మే అవకాశం ఉందన్నది, పార్టీ సీనియర్ల అభిప్రాయం.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, సరైన గౌరవం లేదన్నది ఒక విమర్శ అయితే, పాత వారిని పక్కపెట్టడంతో వారంతా నిస్తేజంగా ఉన్నారన్నది మరో విమర్శ. నాయకత్వ నిర్ణయాల వల్ల, చాలామంది సీనియర్లు స్తబ్దతగా ఉన్నారు. ఒకప్పుడు రాజధాని హైదరాబాద్‌లో పార్టీని, ముందుండి నడిపించిన పాతకాపులెవరూ ఇప్పుడు కనిపించడం లేదు. ఆవిధంగా పాత-కొత్త నేతలను సమన్వయం చేయడమే, ఇప్పుడు కిషన్‌రెడ్డి ముందున్న సవాలు.

ప్రధానంగా.. కొన్నేళ్ల నుంచి బీజేపీ ఆర్గనైజేషన్ పక్కదారిపట్టిందనన విమర్శ ఉంది. ఎన్నికలప్పుడు కొత్త వారిని తీసుకురావడం, ఖర్చు పెట్టుకునే వారికే టికెట్లు ఇచ్చే విధానంతో బీజేపీ సిద్ధాంతాలు అటకెక్కాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో, ఇప్పుడు ఎంతమంది పార్టీలో ఉన్నారు? వారికి ఏమైనా బాధ్యతలు అప్పగించారా అన్న ప్రశ్నలకు సమాధానం శూన్యం.

ప్రస్తుతం తెలంగాణలో 25 స్థానాలకు మించి పోటీ చేసే, బలమైన అభ్యర్ధులు లేరన్నది పార్టీ వర్గాల అంచనా. పార్టీ అగ్రనేతలు వచ్చినప్పుడు హడావిడి చేసే ‘ఫ్లెక్సీ లీడర్లే’ తప్ప, క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలెవరూ లేరన్నది ఒక విమర్శ. అయితే ఇప్పుడు బీజేపీ అన్ని దినపత్రికలు, చానెళ్లకు సొంత డబ్బుతో ప్రకటనలిచ్చే స్థాయికి ఎదిగింది. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో భూతద్దం వేసినా అభ్యర్ధులు దొరకని దుస్థితి. ఈ సమస్యను కిషన్‌రెడ్డి ఎలా అధిగమిస్తారో చూడాలి.

అసలు గ్రేటర్ హైదరాబాద్‌లోని 24 నియోజకవర్గాల్లో సరైన అసెంబ్లీ అభ్యర్ధులను తయారుచేసి, వారిని ప్రోత్సహించడంలో నాయకత్వం విఫలమైంది. రెండేళ్ల వరకూ జీహెచ్‌ఎంసీకి ఫ్లోర్ లీడర్‌ను ఎంపిక చేయలేని వైఫల్యం. ఆలస్యంగా నియమించినప్పటికీ, వారికి మార్గదర్శనం చేసేవారు కరువు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కుడా, రెవిన్యూ, హౌసింగ్ సమస్యలపై అవగాహన ఉన్న కార్పొరేటర్లు గానీ, వారికి ఆయా అంశాలపై మార్గదర్శకత్వం చేసే సీనియర్లు గానీ లేరు.

పోనీ వారంతట వారే ముందుకొచ్చి సమావేశాలు నిర్వహిస్తే, మిమ్మల్ని ఎవరు సమావేశం నిర్వహించమన్న ప్రశ్నలు. కీలకమైన అసెంబ్లీ ఫ్లోర్‌లీడర్‌ను ఎంపిక చేసుకోలేని అసమర్ధత. ఇదంతా ఆర్గనైజేషన్ మీద అవ గాహన-పట్టు ఉన్న నేతలెవరూ లేకపోవడమే దానికి కారణం. ఆర్గనైజేషన్‌ను గాడిలో పెట్టడమే కిషన్‌రెడ్డి ముందున్న ప్రధాన పరీక్ష.

ఇక కిషన్‌రెడ్డిపై పార్టీలో అంతర్గతంగా కులవాదం వినిపిస్తోంది. ఆయన రెడ్లను మాత్రమే ప్రోత్సహిస్తారన్న ప్రచారం ఉంది. ఈ ప్రచారానికి ఆయన ఏవిధంగా తెరదింపుతారో చూడాలి. నిజానికి ప్రస్తుతం తెలంగాణలో రెడ్లు, మెజారిటీ శాతం కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి.

అందువల్ల తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, గౌడ, పద్మశాలిలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నది, సీనియర్ల అభిప్రాయం. ఇక గ్రేటర్ పరిథిలోని 24 నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సెటిలర్లు.. ఎన్నికల్లో ప్రభావం చూపే కమ్మ వర్గంపై, కిషన్‌రెడ్డి వైఖరేమిటో చూడాల్సి ఉంది.

ప్రధానంగా.. ఓట్లు రాల్చని హిందూత్వ నినాదం-విధానం కంటే.. రాజకీయ అంశాలపై దృష్టిసారిస్తేనే, ఫలితాలు ఉంటాయన్నది సీనియర్ల వాదన. ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వీధిపోరాటాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇక ప్రభుత్వ అవినీతిని ఉత్తుత్తి ప్రకటనలు-మీడియా కోసం పోరాటాలు కాకుండా.. అవినీతికి సంబంధించిన ఆధారాలను ప్రజలకు చూపించి, పోరాడితేనే నమ్మకం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. దానికోసం ఫుట్‌వర్క్ చేసే, సీనియర్ల బృందాన్ని ఎంపిక చేసుకోవాలని సీనియర్ల సూచిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టిన కిషన్‌రెడ్డి.. ఈసారైనా ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేరిస్తేనే, భవిష్యత్తులో రాణించే అవకాశం ఉంది. పాత-కొత్త నేతలను సమన్వయం చేసుకోవడం, స్తబ్దతగా ఉన్న పాతనేతల ప్రతిభను గుర్తించి.. వారిని ఆర్గనైజేషన్ కోసం వాడుకోవడం, సర్కారుపై నిర్దిష్ట కార్యాచరణతో కూడిన పోరాటాలపైనే కిషన్‌రెడ్డి నాయకత్వ సామర్థ్యం ఆధారపడి ఉంది.

LEAVE A RESPONSE