• డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి
• ఏడాది దాటిన ఇ.డి.లను సొంత శాఖలకు వెనక్కు పంపండి
• ఎస్సీ కార్పొరేషన్ సీఓపీ సమావేశంలో మేరుగు నాగార్జున ఆదేశాలు
అమరావతి, డిసెంబర్ 15: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల వాహనాలు సరఫరా చేయడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సులుగా తీసుకొని వాహనాలను సరఫరా చేయని డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటుగా ఈ విషయంగా సీబీ సిఐడి తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.
ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన 11వ కమిటీ ఆఫ్ పర్సన్స్ (సీఓపీ) సమావేశంలో నాగార్జున పలు అంశాలను సమీక్షించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇ-ఆటోలు, ట్రాక్టర్లు, మిషన్ డ్రెన్ క్లీనర్ల సరఫరా కోసం టెండర్లు పొంది ప్రభుత్వం నుంచి కోట్లాది రుపాయలు అడ్వాన్సుగా తీసుకున్న కెనటిక్ గ్రీన్ ఎనర్జీ పవర్ సొల్యూషన్స్ (పూణే), వెంకటేశ్వరా ట్రేడర్స్ (తాడేపల్లి), ఈగల్ అగ్రిఎక్విప్ మెంట్స్ (కావలి), ఎంట్రాన్స్ ఆటోమోబైల్స్ (పెద్ద తాడేపల్లి) సంస్థలకు చెందిన డీలర్ల వద్ద రూ.46 కోట్ల వరకూ మొత్తం ఉండిపోగా దానికి సంబంధించిన వాహనాలు సరఫరా చేయడంగానీ, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించడం గానీ జరగలేదని నాగార్జున చెప్పారు.
ఈ విషయంలో ఎస్సీ కార్పొరేషన్ సొమ్మును తిరిగిరాబట్టడానికి ఆయా డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సీబీ సిఐడికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కు సంబంధించిన బకాయిల వసూళ్లను కూడా ముమ్మరం చేయాలని కోరారు. ఎస్సీలకు చెందిన సొమ్ము ఒక్క రుపాయి దుర్వినియోగమైనా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతం కాకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి ఆదేశించారు. ఇతర శాఖల నుంచి డెప్యుటేషన్ పై వచ్చి వివిధ జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఇ.డి)లుగా పని చేస్తున్న వారిలో ఏడాది కాలం సర్వీసును పూర్తి చేసిన వారిని వారి సొంత శాఖలకు వెనక్కు పంపాలని కూడా ఆదేశాలు జారీ చేసారు.
కాగా గతంలో భూమి కొనుగోలు పథకం (ఎల్పీఎస్) ద్వారా ఎస్సీలకు కేటాయించిన 25% రుణ మొత్తాన్ని మాఫీ చేసే అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలనలో ఉందని ఈ విషయంగా సీఎం త్వరలోనే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని వెల్లడించారు. పీఎం అజయ్ పథకంలో భాగంగా 2021-22 సంవత్సరానికి సంబంధించి రూ.60 కోట్ల రుపాయలు మంజూరు కావడం జరిగిందని ఈ మొత్తానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రాబోయే జనవరి మాసాంతం లోపుగా అమలు చేస్తామని ప్రకటించారు. ఇదే పథకం క్రింద 2022-23 సంవత్సరంలో మరో రూ.130 కోట్ల మొత్తం మంజూరు కావడం జరిగిందని తెలిపారు. స్వచ్ఛత ఉద్యమై యోజన పథకం కింద రూ.120 కోట్లు డీ సెజ్లింగ్ యంత్రాల కొనుగోలు కోసం మంజూరు కాగా దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచల ప్రకారంగా ఎస్సీలకు మరింత మెరుగైన సేవలను అందించడానికి చర్యలు తీసుకోవాలని, అధికారులు ఎక్కడా అలసత్వం లేకుండా పని చేయాలని నాగార్జున కోరారు. ఈ సమావేశంలో రెల్లి కార్పొరేషన్ ఛైర్మెన్ మధుసూధన్ రావు, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కాటి హర్షవర్ధన్, ఎస్సీ కార్పొరేషన్ వీసీఎండీ చిన్న రాముడు, జీఎం సునీల్ రాజ్ కుమార్, లిడ్ క్యాప్ వీసీఎండీ డోలా శంకర్, ఫైనాన్స్ డీఎస్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ వాటర్, ఎపీఎస్ఐడీసి, హార్టికల్చర్, కోఆపరేషన్ తదితర శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరైయ్యారు.