మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుకు సంబంధించిన ఫైలు నెల్లూరు కోర్టులో చోరీకి గురికావడం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ గత నవంబరులో హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు నేడు విచారించారు. దాదాపు గంటకు పైగా ఆయనను ప్రశ్నించారు.
విచారణ అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉపహార్ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా చేశారని అన్నారు. నాలుగు దేశాల్లో మాకు రూ.1000 కోట్ల ఆస్తులున్నట్టు ఆరోపణలు చేశారని వెల్లడించారు. న్యాయస్థానాల్లోనే సాక్ష్యాలు పోతే న్యాయం కోసం ఎక్కడికి పోవాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను ఎవరు కాపాడారు? అని ప్రశ్నించారు.
“పాత ఇనుప సామాన్లు కొట్టేసే దొంగలు కోర్టులోకి వెళ్లారంట! ఒకే కోర్టులోకి వెళ్లి, ఒకే బీరువా పగులగొట్టి, ఒకే ఫైలు ఎత్తుకెళ్లారంట! కాకాణి నిందితుడుగా ఉన్న కేసు ఫైలే చోరీకి గురైంది. న్యాయస్థానాల ప్రతిష్ఠకు సంబంధించిన కేసు ఇది. సీబీఐ న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది” అని సోమిరెడ్డి స్పష్టం చేశారు.