-కోటంరెడ్డి బాటలోని మరికొందరు
-పార్టీ నుంచి బహిష్కరణనేది అధ్యక్షుడి ఇష్టం…
-తనని బహిష్కరిస్తే అధ్యక్షుడి ఆదేశాలు శిరసా వహిస్తా
-అమరావతి అభివృద్ధి కోసం దమ్మిడి ఖర్చు చేయని జగన్ సర్కార్
-రైతులతో అగ్రిమెంట్ చేసుకుని పారిపోతానంటే కుదరదు
-తింగరి అప్పుల కోసం ఇక కేంద్ర ప్రభుత్వ అనుమతులు కష్టమే
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
సీబీఐ అధికారులు, స్టీఫెన్ రవీంద్రను విచారించాలి. ఏకకాలంలో రెండు రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్నట్లుగా స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలి ఉంది. పార్టీలో ఎవరిని కొనసాగించాలి… ఎవరిని బహిష్కరించాలనిది పార్టీ అధ్యక్షుడిపైనే ఆధారపడి ఉంటుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పార్టీ తెలిపారు . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తనతో పాటు, పార్టీ శాసన సభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లను బహిష్కరించాలని కొంతమంది తమ పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి కోరినట్లు ఒక ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమయ్యిందన్నారు. పార్టీ నుంచి తనని బహిష్కరించాలని అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయిస్తే, ఆయన ఆదేశాలను శిరసా వహిస్తానని తెలిపారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాను , ఆనం రామనారాయణ రెడ్డిలు మంచి సూచనలే చేశామని పేర్కొన్నారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక రేటును అమాంతం పెంచడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇసుక ధరలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మాత్రమే తాను సూచించానని గుర్తు చేశారు . ఇంకా ఒకటి, అర మంచి సూచనలే చేస్తే పట్టించుకోకపోగా, తనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారన్నారు. గడపగడపకు కార్యక్రమానికి ప్రజల్లోకి వెళితే, ప్రజలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారని… ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీనియర్ శాసన సభ్యుడు ఆనం రాంనారాయణ రెడ్డి సూచించగా, నమ్మిన వారిని అనుమానించవద్దని మరో శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరారన్నారు. కోటంరెడ్డి బాటలోని మరోపై 30 నుంచి 40 మంది ఉన్నారన్నారు.
ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? సెక్యూరిటీ కంపెనీ నిర్వహిస్తున్నారా??
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?, లేకపోతే సెక్యూరిటీ కంపెనీ నిర్వహిస్తున్నారా?? అనే అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు.. తనకు ఎమ్మెల్యేలు నచ్చకపోతే వారి సెక్యూరిటీని తొలగించడం విడ్డూరం. నచ్చితే సెక్యూరిటీ ఇవ్వడం… నచ్చకపోతే సెక్యూరిటీని తొలగించడానికి జగన్ సెక్యూరిటీ కంపెనీ నిర్వహించడం లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి 2 + 2 సెక్యూరిటీని ఇవ్వగా, ఇద్దరు గన్ మెన్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీనితో, కోటంరెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మరో ఇద్దరు గన్మెన్లను కూడా వెనక్కి తిప్పి పంపారు. తమ పార్టీ అధిష్టానంతో అనధికారిక పొత్తు పెట్టుకున్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు, అంకుశం సినిమా స్ఫూర్తితో వీధుల్లో కొట్టుకుంటూ, బండికి కట్టుకుని తీసుకుపోతానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బాహాటంగానే బెదిరించారు. అటువంటి ఈ సమయంలో ఆయనకు సెక్యూరిటీ తగ్గించడం విడ్డూరంగా ఉంది. తాను ఎంతగానో పార్టీ అధ్యక్షుడిపై నమ్మకం పెట్టుకున్నానని అయినా ఆయన తన నమ్మకాన్ని వమ్ము చేస్తూ తన ఫోన్లను ట్యాప్ చేయడం వల్ల ఆత్మాభిమానం దెబ్బతిని పార్టీకి దూరం జరుగుతున్నట్లు పేర్కొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనలేదు. తనపై ఆరోపణలు చేసిన వారికి కూడా మర్యాదపూర్వకంగానే సమాధానాలు చెప్పారు. కోటంరెడ్డి బాటలోనే తమ పార్టీలో ఇంకా ఎంతోమంది ఉన్నారు. రాజకీయాలలో స్పష్టమైన ఆలోచనలు కలిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట ప్రజలు ఎప్పటికీ ఉంటారు. నెల్లూరు నగర మేయర్, పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు ఆయనతో కలిసి పార్టీ వీడడానికి సిద్ధమయ్యారంటే… తమ పార్టీ కి జరగనున్న నష్టాన్ని అంచనా వేయవచ్చునని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు.
ప్రశ్నించిన వారి ఇళ్లపై రాళ్లు రువ్వడం ఒక పద్ధతి… ప్రజా సమస్యలు సీఎం దృష్టికి తీసుకు వెళ్లడం మరొక పద్ధతి
ప్రజా సమస్యల గురించి ప్రశ్నించిన వారి ఇళ్లపై రాళ్లురువ్వడం ఒక పద్ధతి అయితే, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం మరొక పద్ధతి అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. గురజాల లో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో భాగంగా రోడ్లు బాగా లేవని ప్రశ్నించిన వ్యక్తి ఇంటిపై కొంతమంది రాళ్లు రువ్వినట్లు తెలిసింది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలను ప్రజలు ప్రస్తావిస్తూ, తనని ప్రశ్నించిన విషయాన్ని ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దానితో, ఆయన్ని పార్టీ నాయకత్వం దూరం పెట్టింది. తాను కూడా గతంలో వెంకటేశ్వర స్వామి భూములను అమ్మ వద్దని, అలాగే రాజ్యాంగాన్ని అనుసరించమని మాత్రమే సూచించాను… దానికి ఆగ్రహించి, తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి, పోలీస్ లాకప్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశారు. మంచి చెప్పేవారిని ఈ రకంగా వేధించడం తప్పు… ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. లోక్ సభ సభ్యునిగా తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను కోరగా, స్పీకర్ న్యాయబద్ధంగా నడుచుకున్నారు. అదే రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ముఖ్యమంత్రి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే టిడిపి నుంచి గెలుపొందిన ఐదు మంది శాసనసభ్యులను తమ పక్కన పెట్టుకుని, పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శించని శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తే, ప్రజలు తూ.. చ అంటారని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి లాంటి నాయకున్ని పోగొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి దూరదృష్టవంతుడని, జగన్మోహన్ రెడ్డి లాంటి అధినేతను కాదనుకున్న కోటంరెడ్డి అదృష్టవంతుడని వ్యాఖ్యానించారు.
మాయా మచ్చింద్ర కోసమే ఋషికొండకు గ్రీన్ మ్యాట్
ఋషికొండను గుండు కొట్టేసి, ఇప్పుడు గ్రాఫిక్స్ లో మాయా మశ్చీంద్ర చేయడానికి కొండపై గ్రీన్ మ్యాట్ పరిచారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. బాహుబలి చిత్రంలో దర్శకుడు రాజమౌళి, ఇదే తరహా గ్రీన్ మ్యాట్ ద్వారా లేని జలపాతాలను ఉన్నట్లుగా చూపించారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఋషికొండపై లేని చెట్లను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఋషికొండను కేంద్ర పర్యావరణ కమిటీ బృందం సందర్శించనుందో ఏమో కాబోలు… అందుకే ఈ ఏర్పాటు చేసి ఉంటారు. విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. తాను ఈ విషయాన్ని కోర్టుకు విన్నవిస్తే, రఘురామకృష్ణం రాజుకు తమ ప్రభుత్వం అంటే పడదని, అందుకే ఆయనపై గతంలో 124A కేసు కూడా నమోదు చేశామని పేర్కొనే అవకాశం లేకపోలేదన్నారు.
రాజధాని లోనే ఆర్.బి.ఐ రీజినల్ కార్యాలయం ఏర్పాటు
రాజధాని ప్రాంతంలోనే ఆర్బీఐ రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని, ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయరని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. అమరావతిలో ఆర్.బి.ఐ రీజినల్ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఆర్బిఐ రీజినల్ కార్యాలయాన్ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరడం విడ్డూరం. ఆర్బిఐ కార్యాలయ నిర్మాణానికి అమరావతిలో స్థలం కేటాయించిన తర్వాత, మార్చాలి అనుకోవడం హాస్యాస్పదం. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2050 కోట్ల రూపాయలను కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం దమ్మిడి కూడా ఖర్చు చేయలేదని తాను అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేయకపోవడం పరిశీలిస్తే, అమరావతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ విధానమేమిటో స్పష్టం అవుతుంది . అమరావతి నిర్మాణాని తీసుకువచ్చిన తరువాత మిగిలిన ఇసుక, కంకర, స్టీల్ తో పాటు ఏకంగా వేసిన రోడ్లను తవ్వి కంకర ను కొంతమంది విక్రయించగా, దానికి పోలీసులు మద్దతు పలకడం రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం అవుతుంది. రాజధానిపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని తమ అనుకూల మీడియా ఛానల్స్ ద్వారా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేయించుకున్నారు. అలాగే, రాజధాని వ్యవహారం అత్యవసర విషయమని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్ లో లిస్టింగ్ కాకపోయినప్పటికీ, మెన్షన్ చేయించారు. అయినా న్యాయస్థానం ఈనెల 23వ తేదీకి కేసు వాయిదా వేసింది.
విశాఖలో ముఖ్యమంత్రి గృహప్రవేశానికి మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, తమ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డిలు ఏర్పాటు చేస్తే, జగన్ భేషుగ్గా గృహప్రవేశం చేయవచ్చు. అంతేకానీ, విశాఖను రాజధాని అని మాత్రం ఎవరు అనరు. ఈ విషయంలో అమరావతి రైతులు కలత చెందకుండా, నిశ్చింతగా ఉండాలి. ఉగాది లోపు ఎన్నో పరిణామాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అమరావతియే రాష్ట్ర రాజధాని అని చట్టం చేయడమే కాకుండా, గత ప్రభుత్వం రైతులతో రాజధాని విషయములో అంగీకారాన్ని కుదుర్చుకుంది. రైతులతో అంగీకారం కుదుర్చుకొని ఇప్పుడు రాజధాని కాదు… పారిపోతామంటే కుదరదు. సుప్రీంకోర్టులో ప్రజాస్వామ్య బద్ధమైన తీర్పే వస్తుందని ఆశిస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మూడు రాజధానులే తమ విధానం అని ప్రభుత్వ పెద్దలు చెప్పడం ప్రజలను మభ్య పెట్టడానికే… విశాఖ వాసులు, విశాఖను రాజధానిగా కోరుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పటికే లుంగీ బ్యాచ్ వల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అతి ఘోరంగా తమ పార్టీ విశాఖపట్నంలో ఓడిపోనుందని రఘురామకృష్ణం రాజు అన్నారు.
కేంద్రం అప్పులిచ్చి ఆదుకుంటుందా?
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు కేవలం 20 నుంచి 25 శాతం మందికి మాత్రమే జీతాల అందినట్లు తెలుస్తోందని, సింహ భాగం ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక కష్టాలలో ఉంది. మనం అండగా ఉండాలి. జీతాలు 15 రోజులు ఆలస్యం అయినా భరించాలని ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట రామారెడ్డి పేర్కొనడం విస్మయాన్ని కలిగించింది. ఒక ఉద్యోగి తన ఖర్చుల నిమిత్తం అని విఆర్ఎస్ తీసుకునేందుకు రాజీనామా చేయగా, 2025 మార్చిలో బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ఉద్యోగులు దాచుకున్న… ఇవ్వాల్సిన సొమ్మును, ఇవ్వకపోతే ఇక ఉద్యోగులకు జీతభత్యాలేలా చెల్లిస్తారు. అసలే రాష్ట్ర ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్నది. ఇప్పటికే కేంద్రం విధించిన పరిమితులకు మించి అప్పు చేశారు. కేంద్ర బడ్జెట్ కూడా అంతంత మాత్రమే… అయినా రాష్ట్రాన్ని అప్పులు ఇచ్చి ఆదుకుంటాదా?. ఈ రెండు నెలల పాటు పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదని రఘురామకృష్ణం రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తింగరి అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం కష్టమే. ఇప్పటివరకు ప్రజా బహుల్యం లోకి ఈ సమస్యలు రాకపోయినప్పటికీ, ప్రజల హృదయాలలో ఉండి, రాబోయే రోజుల్లో ప్రళయంగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించారు.
సిబిఐ అప్పగించడం మంచిదే
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని దర్యాప్తు చేయడానికి సిబిఐకి అప్పగించడం శుభ పరిణామమేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని తనను, బి ఎల్ సంతోష్ లను ఇన్వాల్వ్ చేశారు. తెలంగాణ సిట్ పోలీసులు తనకు నోటీసు అందజేయక ముందే నోటీసు అందినట్లుగా సాక్షి దినపత్రికలో రాయడం జరిగింది. ఈ కేసులో నగదు దొరికిందని తొలుత పేర్కొన్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారన్నడానికి ఇదే నిదర్శనం. సీబీఐ అధికారులు, స్టీఫెన్ రవీంద్రను విచారించాలి. ఏకకాలంలో రెండు రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్నట్లుగా స్టీఫెన్ రవీంద్ర వ్యవహార శైలి ఉంది. వైఎస్ వివేక హత్య కేసులో ఇప్పటివరకు ఎవరు ఊహించని పేర్లు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇప్పటికీ, వైయస్ వివేకా కుటుంబ సభ్యులను అనుమానిస్తూ సాక్షి దినపత్రిక రాస్తున్న రాతలు ప్రజలకు రోతగా అనిపిస్తున్నాయి. సజ్జల ప్రేమించే వ్యక్తులకు, సాక్షి దినపత్రిక యాజమాన్యం ఏ తప్పు చేయకపోయి ఉంటే ఈ తరహా రాతలు ఎందుకు?. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి జగన్మోహన్ రెడ్డిని హరిచంద్రునితో పోల్చడం సబబే. హరిచంద్రుడు అప్పులు చేసి తన భార్యాబిడ్డలను అమ్ముకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన భార్యాబిడ్డలను కాకుండా రాష్ట్ర ప్రజలను అమ్మేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అప్పులను తగ్గించే, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.