Suryaa.co.in

Andhra Pradesh

కోవిడ్ నిధుల ఖర్చుపై సీబీఐ దర్యాప్తు కావల్సిందే

– కోవిడ్ మరణాల్లో ఏపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడింది
– మృతులు నిజంగా 14,733మందే అయితే రూ.162.47కోట్లు అదనంగా ఎలా చెల్లిస్తారు?
-వాటిని మీ వైసీపీ కార్యకర్తలకు పంచేశారా?
– వైసీపీ నేతలు మాట్లాడరేం?
– మృతుల సంఖ్యను తారుమారు చేసి, నిధులను దుర్వినియోగం చేసింది
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేలు చెల్లించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది.దీంతో ఏపీ ప్రభుత్వం 47,228మందికి కరోనా మృతుల కుటుంబాలకు రూ.236.14కోట్లు నష్టపరిహారం చెల్లించినట్లు కేంద్రానికి నివేదించింది. కానీ ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, అసెంబ్లీ వేదికగా కరోనా మృతుల సంఖ్య కేవలం 14,733మంది అని, వారి కుటుంబాలకు రూ.73.66కోట్లు పరిహారం చెల్లించినట్లు చెప్పింది.

పార్లమెంటులో ఈనెల 26న టీడీపీ పార్లమెంటు సభ్యలు కింజారపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రి భారతిప్రవీణ్ కుమార్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దీనిద్వారా ఏపీలో పెద్ద కుంభకోణం జరిగినట్లు బయటపడింది. కోవిడ్ మరణాలను ఏపీ ప్రభుత్వం దాచిపెట్టినట్లు పార్లమెంటు వేదికగా తేటతెల్లమైంది. 14733మందికి రూ.50వేలు చొప్పున పరిహారం చెల్లించాల్సివస్తే, రూ.73.66కోట్లు చెల్లించాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తన లెక్కల్లో రూ.236.14కోట్లు నష్టపరిహారంగా చెల్లించినట్లు చూపింది. కోవిడ్ మృతులు నిజంగా 14,733మందే అయితే రూ.162.47కోట్లు అదనంగా చెల్లించినట్లు పార్లమెంటు వేదికగా బయటపడింది.. అదనంగా వచ్చిన 32,495మంది ఎక్కడినుండి వచ్చారు? వీళ్లు వైసీపీ కార్యకర్తలా?

అదనపు చెల్లింపులు ఎవరికి చేశారో ప్రభుత్వం తక్షణమే నిగ్గు తేల్చాలి.రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుంది? ఈ కుంభకోణం బయటపడదని వైసీపీ భావించిందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. కోవిడ్ మరణాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడింది.దొంగలెక్కలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాజేసింది.
కోవిడ్ అంటే ముఖ్యమంత్రికి కేవలం పారాసిట్మాల్ వేసుకుంటే, బ్లీచింగ్ పౌడర్ ఇంటి వద్ద చల్లుకుంటే తగ్గిపోతుందనే భావన ఉండేది.ఇటువంటి అవగాహనారాహిత్యంతో సీఎం కోవిడ్ ను నిర్లక్ష్యం చేసి, వేలాది ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు.దేశవ్యాప్తంగా7,91,353మంది కరోనాతో చనిపోతే 47,228మంది ఏపీలోనే చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం తానే ఒప్పుకుంది.

ఎక్కువ మంది చనిపోతే తక్కువమంది లెక్క రాసిన ఘనత కూడా వైసీపీకే దక్కుతుంది..
కరోనా రెండో వేవ్ లో దేశవ్యాప్తంగా 3,05,740మంది చనిపోతే..వారిలో 1,79,980మంది గ్రామీణ ప్రాంతాల వారే చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలకి పొంతన ఉండడంలేదని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.దేశవ్యాప్తంగా 50లక్షలు మంది, ఏపీలో 5లక్షల మంది చనిపోయారని విదేశాలకు సంబంధించిన దినపత్రిక చెప్పింది.శ్మశానాల్లో ఖాళీలు లేవని, కాల్చడానికి కట్టెలు కూడా దొరకని పరిస్థితుల్లో వైసీపీ నాయకులు కట్టెలను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు.

కోవిడ్ సమయంలో సరైన వైద్యం లేదు, క్వారంటైన్ కేంద్రాల్లో వసతులు సరిగా లేవు.ముఖ్యమంత్రి ఒక్క క్వారంటైన్ సెంటర్ ను కూడా సందర్శించలేదు. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదు. కోవిడ్ నిధులను దారి మళ్లించి ఇతర అవసరాలకు వాడిన విషయం వాస్తవం కాదా?కోవిడ్ నియంత్రణకు వినియోగించాల్సిన రూ.1,100కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించిందని సుప్రీం కోర్టు చెప్పింది. దారిమళ్లించిన రూ.1,100కోట్లను విపత్తుల నిర్వహణ నిధికి తిరిగి జమ చేయాలని సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది… ఇది సిగ్గు చేటు కాదా జగన్ రెడ్డి? కోవిడ్ సమయంలో ప్రజలు చనిపోయినా పట్టించుకోలేదు, ఆక్సిజన్ దొరక్క చనిపోయినవారి సంఖ్య అపరిమితం.

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారు 33మంది అయితే, ప్రభుత్వం కేవలం 11మంది మాత్రమేనని చెప్పి చేతులు దులుపుకున్నారు. వారి కుటుంబాలకు ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదు.ఏతా,వాతా కోవిడ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది..దీనితో పాటు నిధులు దుర్వినియోగం చేశారు. నష్టపరిహారం చెల్లింపుల్లోనూ దొంగలెక్కలు చూపారు.కేంద్రం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ కోరుతోంది. రెమిడెసివిస్ ఇంజక్షన్లను బ్లాక్ లో రూ.30వేలు నుండి రూ.40వేలకు అమ్ముకుని కోట్లు గడించింది వైసీపీ నాయకులే…పార్థసారథిరెడ్డి వందలకోట్లు కూడగట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, రక్తాన్ని జలగల్లా పట్టి పీల్చారు. ఆరోగ్యశ్రీ కార్డు చూపించినా ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు చికిత్సనందించలేదు. జగన్ రెడ్డి ఈ దొంగ లెక్కల మీద ఏం చెబుతావ్? కేంద్ర హోంశాఖకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఏపీలో జరిగిన కుంబకోణంపై నివేదించి సీబీఐ విచారణ జరిపించాలి.

LEAVE A RESPONSE