Suryaa.co.in

Andhra Pradesh

ఉత్త‌రాంధ్ర‌ను కించపరిచే యాత్ర‌ అది..

– ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల సెంటిమెంట్ మీకు పట్టదా బాబూ?
– అమరావతి యాత్ర పేరుతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టిస్తారా బాబూ?
– 26 జిల్లాల ప్ర‌జ‌లు త్యాగాలు చేసి, 29 గ్రామాలను అభివృద్ది చేయాలా?
– దేశంలో మహా న‌గ‌రాల‌ను త‌ల‌ద‌న్నే స‌త్తా ఒక్క విశాఖ‌కే ఉంది
– అందుకే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం
– ఇందులో జగన్ గారికి ఏ స్వార్థం లేదు.. ఉండిఉంటే రాయలసీమకు తీసుకువెళ్ళేవారు కదా?
– మీ యాత్ర‌ల‌న్నీ వృథా యాత్ర‌లే.. ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ త‌థ్యం
– కుప్పంను మున్సిపాల్టీ చేయలేని బాబు.. హైదరాబాద్ ను కట్టాడా!?
– వైయ‌స్ఆర్సీపీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి

వ‌రుదు క‌ల్యాణి మాట్లాడుతూ.. ఏమ‌న్నారంటే. రాజధాని రైతుల పేరుతో అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లికి చేస్తున్న ఈ యాత్ర.. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ యాత్ర కాదు.. అది ఉత్త‌రాంధ్ర‌ ప్రజలను ప‌రిహసించే యాత్ర‌. పాద‌యాత్ర పేరుతో వ‌చ్చి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆక‌లిని, అస్థిత్వాన్ని వెక్కిరిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర ప్రజ‌లు అంటే, అమాయ‌కులుగా మీకు క‌నిపిస్తున్నారా? ఉత్త‌రాంధ్ర ఉద్య‌మాల పురిటిగ‌డ్డ. ఎన్నో సాయుధ పోరాటాలు, రైతాంగ పోరాటాలు జ‌రిగిన గ‌డ్డ ఇది, అల్లూరు సీతారామ‌రాజు వంటి పోరాట యోధులు పుట్టిన గడ్డ. అలాంటి ఉత్త‌రాంధ్ర గ‌డ్డ మీద ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డానికి ఇలాంటి పాద‌యాత్రలు చేస్తే సహించం. ప్రజలు తిరగబడి తీరుతారు.

అది చంద్ర‌బాబు డైరెక్షన్ లో చేయిస్తున్న ప‌చ్చ‌ దండు యాత్ర‌.. ఉత్తరాంధ్రపై చేస్తున్న దండ‌యాత్ర‌..
విశాఖకు పరిపాలనా రాజధాని వద్దని చాటి, ఏ మొఖం పెట్టుకుని ఉత్త‌రాంధ్ర‌లో అడుగుపెడతారు..? మా మనోభావాలు గౌరవించని మీకు, పాదయాత్ర చేసే అర్హ‌త ఎక్కడిది? ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల సెంటిమెంట్ ను మీరు గౌర‌వించ‌రా.? పాద‌యాత్ర పేరుతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి, శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య తేవాలనే చంద్రబాబు కుట్ర. దానిని తిప్పి కొడతాం.

ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లంతా ముక్త కంఠంతో.. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేయాల‌ని కోరుకుంటున్నారు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాల‌ని చూస్తే.. క‌చ్చితంగా నిప్పు రాజేసినట్టేనని హెచ్చ‌రిస్తున్నాము. పాద‌యాత్ర పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టడమే చంద్ర‌బాబు ఉద్దేశం. ఉత్తరాంధ్రలోని అర‌స‌వ‌ల్లి సూర్య‌నారాయ‌ణ‌స్వామి దగ్గరకు వచ్చి మీరు ఏమ‌ని కోరుకుంటారు. సూర్య‌నారాయ‌ణ‌స్వామి కొలువైన ఉత్త‌రాంధ్ర ప్రాంతం ఏమైపోయినా ప‌ర్లేదు.. అమ‌రావ‌తి మాత్రం అభివృద్ది చెందితే చాల‌ని కోరుకుంటారా?. వెనుకబడిన ఉత్త‌రాంధ్రలో పేద ప్ర‌జ‌లు క‌ట్టిన ప‌న్నుల‌తో, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మీ బినామీల ఆస్తులు, మీ హెరిటేజ్ ఆస్తులు అభివృద్ది చెందితే చాల‌ని కోరుకుంటారా?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద‌ ప్ర‌జ‌ల‌కు.. ఆ 29 గ్రామాల్లో సెంటు స్థ‌లం కూడా ఇవ్వ‌ం.. మీ చుట్టూ ఉన్న కొద్దిమంది భూ స్వాములు మాత్రమే కోట్లు సంపాదించాల‌ని కోరుకుంటారా? ద‌శాబ్దాలుగా వెనుక‌బ‌డిన ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్రా.. ఆ వెనుక‌బాటుత‌నంలోనే ఇంకా కొన‌సాగించాల‌ని కోరుకుంటారా? టీడీపీతో అంటకాగుతున్న కొన్ని రాజకీయపార్టీలు చంద్రబాబుతో చేతులు కలిపి ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడుస్తున్నారు. వీరంద‌రూ ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆగ్ర‌హ‌వేశాల‌ను చవిచూస్తారు.. హైద‌రాబాద్ లాంటి మహా నగరాన్ని కోల్పోయిన విభజిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో, భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రాంతీయ విభేదాలు రాకూడ‌దని, అస‌మాన‌త‌లు త‌లెత్త‌కూడ‌ద‌ని ప‌రిపాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు, మూడు రాజధానులకు శ్రీ‌కారం చుట్టారు. ఇలాంటి గొప్ప నిర్ణయాన్ని అడ్డుకోవాలని చూసే మీ పార్టీలను ఏమనాలి..?

చంద్రబాబు అండ్ కో… అమరావతిలోని కేవలం 29 గ్రామాలు అభివృద్ది చెందాల‌ని కోరుకుంటుంటే.. ముఖ్యమంత్రి జ‌గ‌న్ , రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ది చెందాల‌ని, మూడు ప్రాంతాలకూ గుర్తింపు తీసుకురావాలని కృషి చేస్తున్నారు, తద్వారా రాష్ట్ర స‌ర్వ‌తోముఖాభివృద్దికి ఎంత‌గానో ప‌రిత‌పిస్తున్నారు. 26 జిల్లాల ప్ర‌జ‌లు త్యాగాలు చేస్తే.. వాటి ఫ‌లాలతో 29 గ్రామాలు మాత్ర‌మే అభివృద్ది చెందాల‌ని చంద్ర‌బాబు అండ్ కో ఆరాటంగా కనిపిస్తోంది. చంద్ర‌బాబుకు అమ‌రావ‌తి మీద కూడా ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ అంటూ ఉంటే.. అది అక్కడ చేసిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మీదే.

క్యాపిటల్ అనేది కామ‌న్ మ్యాన్ నివ‌సించ‌డానికి అనువుగా ఉండాలి త‌ప్పితే.. క్యాపిటలిస్ట్ ల కోసం కాదు.. చంద్ర‌బాబు ఐదేళ్లు సీఎంగా ఉండి అమరావతిని భ్ర‌మ‌రావ‌తిగా గ్రాఫిక్స్ సినిమాలా చూపించారు, ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టారు. లక్ష కోట్లు దోచుకోవ‌డానికి ప్ర‌ణాళిక ర‌చించారు. హైద‌రాబాద్ ను నేనే క‌ట్టాన‌నే చంద్ర‌బాబు.. అక్కడ ఏం కట్టారంటే.. రూ.200కోట్ల‌తో ఇంద్రభవనం లాంటి సొంత ఇల్లు క‌ట్టుకున్నారే త‌ప్ప.. హైద‌రాబాద్ ను క‌ట్ట‌లేదు. 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉండి, 14 ఏళ్లు సీఎంగా ఉండి, క‌నీసం కుప్పాన్ని మున్సిపాలటీ కూడా చేయ‌లేని చంద్రబాబు.. హైద‌రాబాద్ ను నేనే క‌ట్టానంటే ప్ర‌జ‌లు న‌మ్ముతారా? హైద‌రాబాద్ ను మీరే క‌డితే ఎందుకు మీరు క‌నీసం ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు.. ఎందుకు హైద‌రాబాద్ లో మీ పార్టీ స‌మాధి అయిపోయింది?

విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధాని అయితే ఉత్త‌రాంధ్ర అన్నివిధాలా అభివృద్ది చెందుతుంది. పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుంది, మౌలిక వ‌స‌తులు అభివృద్ది చెందుతాయి, పేదరికం తగ్గుతుంది. ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ , ఎంతో ముందు చూపుతో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేద్దామ‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా, అమ‌రావ‌తిని శాస‌న రాజ‌ధానిగా, క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో జ‌గ‌న్ కి ఏమాత్రం స్వార్థం లేదు.. స్వార్థం ఉంటే తాను పుట్టిన రాయ‌ల‌సీమ‌కే ప‌రిపాల‌న రాజ‌ధాని తీసుకెళ్లేవారు.. ఆయ‌న ఆశ‌యాలు, ఆకాంక్ష‌లు వేరు..

మ‌న పొరుగునున్న రాష్ట్రాల‌ను చూస్తే.. త‌మిళ‌నాడుకు చెన్నై, తెలంగాణ‌కు హైద‌రాబాద్, మ‌హారాష్ట్ర‌కు ముంబై, క‌ర్ణాట‌క‌కు బెంగుళూరు, ప‌శ్చిమ‌బెంగాల్ కు క‌ల‌క‌త్తా.. నగరాలు ఉన్నాయి. వీట‌న్నింటినీ త‌ల‌ద‌న్నె స‌త్తా ఒక్క విశాఖ‌ప‌ట్నానికే ఉందని జ‌గ‌న్ గుర్తించారు. అందుకే విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేయాలని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. మూడు ర‌కాల ర‌వాణా మార్గాలు.. అంటే రోడ్డు, వాయు, జ‌ల ర‌వాణా సౌకార్య‌ల‌కు అనువైన, ఆహ్లాదాక‌ర‌మైన‌ న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం. రూ.2ల‌క్ష‌ల కోట్లు పెట్టి అమ‌రావ‌తిని అభివృద్ది చేసే బ‌దులు.. అన్నింటికీ ఎంతో అనువైన‌ వాతావరణం ఉన్న విశాఖ‌ను త‌క్కువ ఖ‌ర్చుతో ఎందుకు అభివృద్ది చేయ‌కూడ‌దు..?. దీని వ‌ల్ల హైద‌రాబాద్ ను మించిన మ‌హాన‌గ‌రంగా, ఏపీకి ఒక మణిహారంగా విశాఖ ఉండబోతుంది.

విశాఖ‌ప‌ట్నంలో అన్ని ర‌కాల స‌హ‌జ‌వ‌న‌రులు ఉన్నాయి, వాణిజ్య రంగం, పారిశ్రామిక రంగం, ఉపాధి రంగం అన్నివిధాలా అభివృద్ది చెంద‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. మ‌న‌దేశంలో టాప్ టెన్ న‌గ‌రాల్లో విశాఖ ఒక‌టి. ప‌రిపాల‌న రాజ‌ధానికి కావాల్సిన అన్ని అర్హతలు, వ‌స‌తులు, అవ‌కాశాలు, ప్ర‌భుత్వ భూములు విశాఖ‌లోనే ఉన్నాయి అని శివ‌రామ‌కృష్ణ క‌మిటీ కూడా చెప్పింది. విశాఖ రాజ‌ధాని అయితే ఒక్క ఉత్త‌రాంధ్రకకు, విశాఖకే మేలు జరగదు, మొత్తం రాష్ట్రానికే ఎంతో ప్రయోజనం.

ప‌రిపాల‌న రాజ‌ధానిగా విశాఖ‌ను మించిన న‌గ‌రం మ‌న రాష్ట్రంలో మరొకటి లేదు.పెట్టుబ‌డులు ఆక‌ర్షించ‌డానికి ఉన్న ఏకైక న‌గ‌రం విశాఖ‌ప‌ట్నం. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డుల సమ్మిట్లు కూడా విశాఖ‌లోనే పెట్టారు.. మరి, అమ‌రావ‌తిలో పెట్ట‌కుండా విశాఖ‌లో ఎందుకు పెట్టారు.. ? దేశానికే ఆర్థిక రాజ‌ధాని అయ్యే గొప్ప న‌గ‌రం విశాఖ అని నాడు చెప్పిన చంద్ర‌బాబు.. ఈనాడు క‌నీసం ప‌రిపాల‌నా రాజ‌ధానిగా, మూడు రాజధానుల్లో ఒకటయ్యే అర్హ‌త కూడా లేద‌ని చంద్రబాబు చెబుతున్నాడు. క‌చ్ఛితంగా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఉసురు చంద్ర‌బాబుకు త‌గులుతుంది.

ల‌క్షల కోట్ల నిధులన్నీ ఒక్క అమ‌రావ‌తికే వెచ్చిస్తే.. రాష్ట్రంలో అమలవుతున్న అమ్మ ఒడి, ఆరోగ్య‌శ్రీ, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్, 31 లక్షల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు చేయూత, భరోసా.. ఈ పథకాన్నీ ఎలా ఇవ్వ‌గ‌లం..? అని ప్రశ్నిస్తున్నాం. డ‌బ్బుల‌న్నీ ఒక్క అమ‌రావ‌తికే వెచ్చిస్తే మిగ‌తా జిల్లాలు ఎలా అభివృద్ది చెందుతాయి..? ఉత్త‌రాంధ్రకు ముఖ‌ద్వారం అయిన విశాఖను ప‌రిపాల‌న రాజ‌ధాని కావాల‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు బ‌లంగా కోర‌కుంటున్నారు. విశాఖ‌తోపాటు అమ‌రావ‌తి, క‌ర్నూలును కూడా అభివృద్ది చేయాల‌ని ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ యాత్ర పేరుతో ఎన్ని యాత్రలు చేసినా.. పొర్లు దండాలు పెట్టినా.. క‌చ్ఛితంగా విశాఖ ప‌రిపాల‌న రాజ‌ధానిగా ఏర్పాటై తీరుతుంది, మీ యాత్ర‌లన్నీ వృథా యాత్ర‌లే.. ఇలాంటి వృథా యాత్ర‌లు చేయ‌కుండా ఆంధ్ర రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌నులు చేయండి అని చంద్ర‌బాబు అండ్ కో.. కు హితవు పలుకుతున్నాం… అని వరదు కల్యాణి అన్నారు.

LEAVE A RESPONSE