షోడా బండి వద్ద షోడా తాగిన చంద్రబాబు నాయుడు
పల్నాడు జిల్లా:- సత్తెనపల్లి మండలంలోని కంటెపూడి గ్రామంలో దళిత కాలనీ లోని పేద మహిళలతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముచ్చటించారు. తాడికొండ నియోజకవర్గంలో పర్యటనకు వెళుతూ గ్రామంలో ఉన్న మహిళలతో వివిధ అంశాలపై మాట్లాడారు. వారి రోజు వారీ ఆదాయం, ప్రభుత్వ పథకాలు, ఇంట్లో ఖర్చులు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు.
ఈ సందర్భంగా మహిళలు పెరిగిన ఖర్చుల గురించి చంద్రబాబుకు వివరించారు. అక్కడే ఉన్న విభిన్న ప్రతిభావంతురాలు నాగలక్ష్మి తో చంద్రబాబు మాట్లాడారు. అమె కష్టాలు తెలుసుకుని లక్ష రూపాయల ఆర్థిక సాయం, ట్రై సైకిల్ ఇస్తామని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడి వారు ఏం చదువుతున్నారో టీడీపీ అధినేత తెలుసుకున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా చదువు నిలిపివేసిన లావణ్య అనే బాలికతో మాట్లాడారు. లావణ్యను చదవించే బాధ్యత తాను తీసుకుంటానని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.
పెరిగిన మద్యం ధరలు తమ ఇళ్లలో ఎలాంటి ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నాయి….కరెంట్ బిల్లులు ఎలా భారంగా మారాయి అనేది మహిళలు వివరించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన కారణంగా ఆదాయం సరిపోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
పేదరిక నిర్మూలన కోసం తాను ఏం చెయ్యబోతున్నాను అనే అంశంపై తన ఆలోచనలను చంద్రబాబు వారికి వివరించారు.
గ్రామం నుంచి వెళుతూ ఆ పక్కనే ఉన్న షోడా బండి వద్ద చంద్రబాబు షోడా తాగారు. షోడా బాగుంది అంటూ బండి యజమాని అయిన మహిళను అభినందించారు.