పోలవరం విలీన మండలాల పర్యటనకు చంద్రబాబు

-గురువారం రెండు మండ‌లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌
-రాత్రికి భ‌ద్రాచ‌లంలో బ‌స చేయ‌నున్న టీడీపీ అధినేత‌
-భ‌ద్రాద్రి రాములోరి ద‌ర్శ‌నంతో రెండో రోజు ప‌ర్య‌ట‌న ప్రారంభం
-రెండో రోజు 3 మండ‌లాల్లో ప‌ర్య‌టించ‌నున్న చంద్ర‌బాబు

ఇటీవ‌లి భారీ వర్షాల‌కు ఏపీలో వ‌ర‌ద పోటెత్తిన ప్రాంతాల‌ను టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప‌రిశీలించారు. తాజాగా ఆయ‌న పోల‌వ‌రం ముంపు ప్రాంతంలోని విలీన మండ‌లాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురు, శుక్ర‌వారాల్లో ఆయ‌న విలీన మండ‌లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ముంపు నేప‌థ్యంలో రాష్ట్ర విభజ‌న స‌మ‌యంలోనే 7 తెలంగాణ మండలాల‌ను ఏపీలో విలీనం చేసే దిశ‌గా చంద్ర‌బాబు చేసిన కృషి ఫ‌లించిన సంగ‌తి తెలిసిందే.

విలీన మండ‌లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న గురువారం ఉద‌యం 8 గంట‌ల నుంచే ప్రారంభం కానుంది. గురువారం ఉద‌యం 8 గంట‌ల‌కు త‌న ఇంటి నుంచి బ‌య‌లుదేర‌నున్న చంద్ర‌బాబు.. వేలేరుపాడు, కుక్కునూరు మండ‌లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మండలాల ప‌రిధిలోని శివ‌కాశిపురం, కుక్కునూరుల్లో వ‌ర‌ద బాధితుల‌ను ప‌రామ‌ర్శించ‌నున్న చంద్ర‌బాబు… అనంత‌రం తెలంగాణ‌లోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ప‌రిధిలో బూర్గం ప‌హాడ్‌లోనూ ప‌ర్య‌టించ‌నున్నారు.

గురువారం రాత్రి భ‌ద్రాచలంలోనే బ‌స చేయ‌నున్న చంద్ర‌బాబు.. శుక్ర‌వారం ఉద‌యం భ‌ద్రాద్రి రాములోరిని ద‌ర్శించుకోనున్నారు. అనంత‌రం ఆయ‌న రెండో రోజు ప‌ర్య‌ట‌న మొద‌లు కానుంది. రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏట‌పాక‌, కూన‌వ‌రం, వీఆర్ పురంల‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మండ‌లాల్లోని తోట‌ప‌ల్లి, కూన‌వ‌రం, కోతుల గుట్ట‌, రేఖ‌ప‌ల్లి గ్రామాల్లోని వ‌ర‌ద బాధితుల‌ను చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించ‌నున్నారు.

Leave a Reply