– పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
• ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్ (విజయవాడ చాప్టర్)లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు
• ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
• ఉగాది సందర్భంగా డా. యల్లాప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ ఫార్మా మాన్యుఫాక్చరింగ్ స్కిల్స్ ప్రారంభోత్సవం
ఆత్కూర్ (విజయవాడ): పండుగను నిర్వహించుకోవడం అంటే మన భాష, సంస్కృతులను కాపాడుకోవడమే అని భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్, విజయవాడ చాప్టర్ లో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డా. యల్లాప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ ఫార్మా మాన్యుఫాక్చరింగ్ స్కిల్స్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, బాలశౌరి, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపావెంకట్ సహా ఇతర ట్రస్ట్ సభ్యులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గరికిపాటి నరసింహారావు ఉగాది ప్రాశస్త్య ప్రవచనం ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి.
దేశవ్యాప్తంగా ఉగాదిని పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుచుకుంటారన్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఏ విధంగా నిర్వహించుకున్నా ఈ పండుగ పరమార్థం కాలాన్ని గౌరవించడం అని పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కష్టసుఖాలను సమానంగా స్వీకరించడం, నలుగురితో మన ఆనందాన్ని పంచుకోవడమనే పరమార్థాలను ఉగాది అందిస్తుందన్న ఆయన, ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఉగాది పచ్చడిని మన పెద్దలు సంప్రదాయంగా పెట్టారని పేర్కొన్నారు. ఆరు రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలోని ఒక్కో రుచి ఒక్కో విధమైన సందేసాన్ని అందిస్తూ…. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటికీ సమపాళ్ళలో ఆస్వాదించాలని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
స్వర్ణభారత్ ట్రస్ట్ లో డా. యల్లాప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ ఫార్మా మాన్యుఫాక్చరింగ్ స్కిల్స్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందందాయకమన్న ఆయన యువత నూతన నైపుణ్యాలను అందిపుచ్చుకుని జీవితంలో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డా. ఎల్లాప్రగడ సుబ్బారావు స్మృతికి నివాళులు అర్పించిన ఆయన, సుబ్బారావు గారి దేశభక్తిని, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.