-సెల్‌ఫోన్లు ఆపేస్తే సర్కారీ పనులెలా?
-ఏపీ ఉద్యోగుల ‘సెల్ డౌన్’ నిరసన
-రేపు ఒక్కరోజు సెల్‌ఫోన్ మాట్లాడకుండా సర్కారుకు నిరసన
-అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు పిలుపు
-సర్కారీ ఆదేశాలన్నీ సెల్‌పోన్లలోనే
-కలెక్టర్లు, జేసీ, ఆర్డీఓల టెలీకాన్ఫరెన్సు ఎలా?
-మరి సెల్ ఆఫ్ చేస్తే పనులు నిలిచిపోయే ప్రమాదం
(మార్తి సుబ్రహ్మణ్యం)
తమ న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణకు ఏపీ ఉద్యోగులు వినూత్న నిరసన ప్రకటించారు. రేపు ఒక్కరోజు సెల్‌ఫోన్లు వాడకుండా ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేయాలని అమరావతి ఏపీజేఏసీ పిలుపునిచ్చింది. ఇది సర్కారుకు పాలనాపరమైన ఇబ్బందేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయిలో తీసుకునే నిర్ణయాలు, ఆదేశాలు, సమీక్షలు, పనుల పురోగతి అంతా సెల్‌ఫోన్ల ద్వారానే జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఫోన్లు ఆఫ్ చేసి కూర్చుంటే, సమాచార వ్యవస్థ నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధానంగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు ప్రతిరోజూ సెల్‌ఫోన్ల ద్వారానే టెలీకాన్ఫరెన్సు నిర్సహిస్తుంటారు. ఈ టెలీ కాన్ఫరెన్సుల్లో, వీఆర్‌ఓ స్థాయి అధికారుల వరకూ హాజరవుతుంటారు. ఆ మేరకు తమ విధులు నిర్వహిస్తుంటారు. కానీ అమరావతి జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగులంతా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసే ప్రభుత్వం సమాచారం ఎలా చేరవేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సహజంగా ప్రతిరోజూ ఉదయం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలు తమ కింద స్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇది అరగంట నుంచి గంట వరకూ జరుగుతుంటుంది. మళ్లీ తర్వాత జేసీ, ఆర్డీఓల స్థాయిలో జరిగే టెలీకాన్ఫరెన్సులో ఎమ్మార్మో, వీఆర్‌ఓలు పాల్గొంటారు. ఎవరు ఎన్ని టెలీకాన్ఫరెన్సులు నిర్వహించినప్పటికీ, క్షేత్ర స్థాయిలో వాటిని అమలుచేయాల్సిన బాధ్యత మాత్రం వీఆర్‌ఓ, ఆర్డీఓ,ఎమ్మార్వో ఆపీసులో పనిచేసే ఉద్యోగులే. మరి వీరంతా సెల్‌ఫోన్లు ఆపివేసి కూర్చుంటే, పనులెట్లా జరుగుతాయన్నది అధికారుల ఆందోళన.
‘‘ఇది ప్రభుత్వానికి ఉద్యోగుల ఆవేదన తెలిపే ఒక నిరసన విధానం. రేపు ఉద్యోగులంతా విధిగా తమ సెల్‌ఫోన్లు ఆపివేయాలని కోరుతున్నాం. ఇప్పటికే స్పందన కార్యక్రమాల్లో పాల్గొని కలెక్టర్లకు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయ’ని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వలిశెట్టి దామోదర్‌రావు స్పష్టం చేశారు.