Suryaa.co.in

Features

మొబైలాయనమహా.. సొమ్ములు స్వాహా..!

ఏ ఫోను లేనప్పుడు
ఎంత హాయి..
ఈ మొబైలొచ్చాక
సొమ్ములు పోయిపోయి..!

బేసిక్ అంటూ పలకరించింది..
చేసేమా..ఎత్తేమా..
గ్రీనా..రెడ్డా..
అందులో ఎసెమ్మెస్..
షార్ట్ మెసేజ్ సర్వీస్..
దాంట్లో ఓ మెమరీ కార్డు..
అందులోనే పాటల రికార్డు..
అక్కడితో సరి..
ఓ చిన్న రీఛార్జి తప్పని సరి!

పోను..పోను ఈ ఫోనులో
బుల్లి కెమెరా…
ఏదో మెగా పిక్సల్..
అదో లెవెలు..
సరిగ్గా కనబడని వీడియో..
వెనక్కి తిప్పి
తీసుకుంటేనే సెల్ఫీ…
అప్పటికదే గొప్ప..
ఆ బుల్లి ఫోనే ఒప్పులకుప్ప..!

ఇంటిల్లిపాదికీ ఒకటే ఫోను..
అదే ఉమ్మడికుటుంబం..
సంబరాల కదంబం..!

మొదట్లో ఫోనొత్తినా…
ఎత్తినా చార్జి..
ఏడున్నర..
ఊరు మారితే రోమింగు..
అప్పుడు మరీ భారంగా
ఇన్కమింగు..
ఇది పెద్దోడి వ్యవహారమేరా
అని నిట్టూర్పు..
మనకి మనమే ఓదార్పు..!

సరే..రాను రాను
పెరిగిన వినియోగం..
చేతిలో ఫోనుంటే
అదో రాజయోగం..
పది పెట్టి కార్డు కొని
గీకితే ఏడున్నర..
చేసుడుకు చార్జీ..
వచ్చుడు ఫ్రీ..
ఇన్కమింగు లైఫ్ టైము..
డబ్బులైపోతే మళ్లీ గీకుడు..!

ఈలోగా వచ్చింది
లిమిటెడ్ వాలిడిటీ చార్జింగు
జేబుకు చిరుగు..
సొమ్ములైపోయాక
ఔట్ గోయింగుకి
లేకపోయినా రామీ..
ఇన్కమింగు హామీ..!

ఇక్కడి వరకు అంతా ఓకే..
మొదలైంది
ఆండ్రాయిడ్ యుగం..
స్మార్ట్ ఫోను జగం..
వచ్చింది వాట్సాప్..
మొహం తెలియనోన్ని
దగ్గర చేసే ఫేస్బుక్కు..
మూగనోము వదిలిస్తూ
ఇన్ స్టాగ్రాము..
వీటన్నిటికీ స్వెట్టర్లా ట్విట్టర్..
ఫోనులోనే సినిమాలు..
టివి చానళ్లు..
గూగులు..
వంటిపై లేకుండా
నూలు పోగులు..
వీటన్నిటికీ నెట్టు..
అదే నీ పని పట్టు..
అదిగో..అక్కడితో
నీ పని మాడిపోయిన పెసరట్టు..
ఆ మత్తు నుంచి
నువ్వు బయటపడితే
మొబైల్ ఫోను మీదొట్టు..!

ఇప్పుడు కార్డు గీకుడు..
బుల్లి రీచార్జీలు గోవిందా..
బాదుడే బాదుడు..
అది కూడా 28 ఇంటూలే..
ముప్పై రోజులైతే
ఏడాదికి పన్నెండే..
అదే ఇరవై ఎనిమిదైతే
సాల్ కి తేరా..
తెలివంటే అదేరా..!
కార్పొరేట్ల గిమ్మిక్కు..
సర్కారు లాజిక్కు..
ఇక నీకెవరు దిక్కు!

మొత్తంగా లైఫ్ టైమని..
అదని..ఇదని..
బోణీ..బాణీ..
హోల్ మొత్తం అంబానీ..
ట్రాయ్ నిన్ను చేసింది టాయ్
నిన్ను ఫోనుకి బానిసను చేసి
అయ్యో అనుకునేలోగానే జియో మింగేసింది..
ఎయిర్ టెల్ మోగించింది
డేంజర్ బెల్..
ఒక ఐడియా నీ జీవితాన్నే
మార్చేసింది..
ఇప్పుడు ఇంటి బడ్జెట్లో
సింహభాగం
మొబైల్ రాగం..
రీఛార్జి రోగం..!
అన్నం లేకపోయినా పర్లేదు
ఫోను రీఛార్జి మస్టు..
అదే చీజ్ బడీ మస్తు మస్తు!!

ఫోను ముంచేసే వ్యసనమే..
అది లేకపోతే
బతుకు శీర్షాసనమే..
మనిషికో మొబైల్..
త్రీజి..ఫోర్ జీ..ఫైవ్ జీ..
ఇలా ఎక్కడికి పోతున్నావు
సర్ జీ…!

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE