భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపం, అలాగని భిన్నత్వాన్ని చెరపేసి ఏకత్వానికే పట్టం కట్టాలని ఆధునిక భారత నిర్మాతలు ఎన్నడూ తలపోయలేదు. ఒకే జాతి చట్రంలోనే భిన్నత్వాన్ని పరిరక్షించే విధంగా రాజ్యాంగాన్ని రూపుదిద్దారు. అందువల్లనే భారత్‌లో వైవిధ్యం వికసిస్తోంది. జాతి నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. భారత్ వంటి సువిశాల దేశంలో గ్రామస్థాయి వరకు రాజకీయ, ఆర్థిక అధికారాలను సంక్రమింపజేయడం ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడతామనే భరోసా కల్పించాలి.
కానీ,ఇటీవల ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. రాష్ట్రాలకు, వ్యక్తులకు, సంస్థలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, అధికారాలను క్రమంగా కేంద్ర ప్రభుత్వం లాగేసుకొంటోంది. మిగతావాళ్లకన్నా తామే అధికులమని, దేశానికి ఏది మంచిదో తమకు మాత్రమే తెలుసునని కొంతమంది భావిస్తున్నందువల్ల ఈ అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 2014 నుంచి ఇది మరీ శ్రుతిమించింది.
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తిరుపతిలో హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రదర్శిస్తున్న వివక్షపై ముఖ్యమంత్రులు హోంమంత్రిని గట్టిగా నిలదీయాలి. ఆదాయం ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వస్తుంటే నిధుల కేటాయింపు మాత్రం సింహభాగం ఉత్తరాదికే దక్కుతున్నాయి. ఈ వివక్షపై దక్షిణాది ముఖ్యమంత్రులందరూ ఒకతాటిపైకి వచ్చి కేంద్రంపై పోరాటం చేయాలి. నిధుల కేటాయింపులో కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరిని ఎండగట్టాలి.
పూర్వ ఆర్థిక సంఘాలకు భిన్నంగా 15వ ఆర్థిక సంఘం మొదటి నుంచే దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంది. పూర్వ సంఘాలు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 15వ ఆర్థిక సంఘం 2011 జన గణను లెక్కలోకి తీసుకుంటానంటోంది. కేంద్రమే దాన్ని ఈ విధంగా పురమాయించింది. పూర్వ ఆర్థిక సంఘాలు అనేక ఇతర గణాంకాలను పరిశీలించినా చివరకు తమ సిఫార్సులకు 1971 జనగణనను ప్రాతిపదికగా తీసుకునేవి. నిర్బంధ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఆ తరువాతే అమలులోకి వచ్చినందువల్ల పూర్వ సంఘాలు 1971 జనగణనను ఆధారంగా తీసుకున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
అదీకాకుండా 1971 నాటి సమాచారం ఆధారంగా లోక్‌సభా నియోజకవర్గాలను విభజించి 2026 సంవత్సరం వరకు అవి అమలులో ఉంటాయన్నారు. లోక్‌సభ సీట్లలో మార్పుచేర్పులు జరిగేది తిరిగి 2026లోనే. కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడటం కోసమే ఈ నియమం పాటించారు. 15వ ఆర్థిక సంఘ సిఫార్సులకు 2011 జనగణననే లెక్కలోకి తీసుకుంటామనడం చోద్యంగా ఉంది.
దీని వల్ల దక్షిణాదికి నిధుల కేటాయింపు తగ్గిపోవడం మాత్రమే కాదు. 2026లో దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు పార్లమెంటు ఉభయ సభల్లో సీట్ల సంఖ్యా కోసుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది.
అటు నిధులు, ఇటు పార్లమెంటు ప్రాతినిధ్యం తగ్గిపోతే దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం శ్రుతిమించడం ఖాయం. ఉదాహరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)ని తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలంటున్న ఎన్‌హెచ్‌ఏఐ, అదే గుజరాత్‌లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టలేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి దక్షిణాదిలో అసంతృప్తి పెంచుతోంది. అలాగే ప్రత్యేక హోదా కోసం, మరిన్ని గ్రాంట్ల కోసం ఆంధ్రప్రదేశ్ చేస్తున్న డిమాండును పెడచెవిన పెడుతోంది.
దక్షిణాది రాష్ట్రాలు తమ అభివృద్ధికి కావలసిన నిధులను అప్పు తెచ్చుకొంటే, ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంట్లు పొందుతాయన్నమాట. చేసిన అప్పులను తిరిగి తీర్చాల్సిందే. అదే కేంద్ర గ్రాంటులైతే తిరిగి చెల్లించనక్కర్లేదు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చేయగల అప్పుల మీద కేంద్రం పరిమితి విధించడంతో ఆ వసతీ లేకుండా పోతోంది. దక్షిణాదిపై విచక్షణ చూపడమంటే – సామర్థ్యం, కష్టించే తత్వం, పొదుపు, చదువుపై పెట్టుబడులు పెట్టే సంస్కృతిని శిక్షించడమన్నమాట. ఉత్తరాదికి ఎక్కువ నిధులివ్వడమంటే- అసమర్థత, అవినీతి, బద్ధకం, కులమతపరమైన ఘర్షణలను సత్కరించడమన్నమాట.
మంత్రివర్గంలో చిన్నచూపు
కేంద్ర మంత్రివర్గంలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగింది. ఏపీ, తమిళనాడుకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారు. తెలంగాణ, కేరళ నుంచి కంటితుడుపు చర్యగా ఒక్కొక్క మంత్రి పదవే ఇచ్చారు. కర్నాటక నుంచి ముగ్గురికి మంత్రి పదవులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి మంత్రిపదవిలో స్థానం దక్కలేదు. తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్కరికి మాత్రమే కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు. గతంలో కూడా దతాత్త్రేయకు సహాయమంత్రి పదవే తప్ప కేబినెట్ హోదా ఉన్న మంత్రి పదవిని ఇవ్వలేదు. అదీ పూర్తికాలం కొనసాగించకుండా మధ్యలోనే పదవి నుంచి తొలగించి వేశారు.
ఈ విధంగా ఒక ప్రాంతానికి దీర్ఘకాలంపాటు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వేర్పాటు వాదనలు ఏర్పడతాయి. సినీనటుడు కమలహాసన్, డిఎంకె నాయకుడు స్టాలిన్, ద్రవిడనాడు ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాలు కలిసివస్తే తాను స్వాగతిస్తానని అన్నారు. పవన్ కల్యాణ్ సైతం యునైటెడ్ స్టేట్స్‌ఆఫ్ సదరన్ ఇండియా ఆలోచనకు మద్దతు పలికారు. తెలుగుదేశం నాయకులు మురళీమోహన్ సైతం తాము విచక్షణకు గురవుతున్నామని, దక్షిణాది రాష్ట్రాలు భావిస్తున్నాయని అన్నారు.
1962లో రాజ్యసభలో మాట్లాడిన అన్నాదురై మొదట వేర్పాటు వాదాన్ని వినిపించారు. ద్రవిడులకు స్వయం నిర్ణయాధికారం కావాలని ఆయన గట్టిగా కోరారు. గతంలో ఎన్‌టిఆర్ సైతం రాష్ట్రాలపై కేంద్రం అనుసరిస్తున్న సవతితల్లి ప్రేమపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్‌ల వ్యవస్థను రాష్ట్రాలపై పెత్తనం సాగించడం కోసం కేంద్రం వినియోగించడాన్ని ఆయన నిరసించారు. కేంద్రం మిధ్య అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని ఆయన ఆకాంక్షించారు. కానీ నేడు కేంద్రం రాష్ట్రాలను బలహీనపరిచి అధికారాలన్నీ తమ గుప్పెట్లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కీలుబొమ్మలను చేసి ఆడిస్తోంది. నిధులు ఇవ్వకుండా దక్షిణాది రాష్ట్రాలను వేధిస్తోంది. ఎక్కువగా మాట్లాడితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఉసిగొలిపి మీ సంగతి చూస్తామంటూ బెదిరిస్తోంది.
పన్నుల వాటాలో అన్యాయం
14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32శాతం నుంచి 42 శాతానికి పెంచింది. ఇందులో సైతం ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రయోజనం చేకూర్చింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అత్యధిక నిధులను కేంద్రం నుంచి దక్కించుకున్నాయి. భారత సమాఖ్య ఏర్పడి 70 సంవత్సరాలైనా ఇప్పటికీ రాష్ట్రాలు చిన్న చిన్న అవసరాల కోసం కేంద్రంపై ఆధారపడాల్సిన దుస్థితి ఉంది. రాష్ట్రాల ఆదాయ వనరులు తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మనదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశంపై ఆ రాష్ట్ర విధాన సభ అభిప్రాయాన్ని సైతం పక్కన పెట్టే అధికారం కేంద్రానికి ఉంది. మరో పక్క గవర్నర్ల వ్యవస్థ సైతం కేంద్రం, రాష్ట్రాలపై గుత్తాధిపత్యం సాధించటానికి పెట్టిన వ్యవస్థలా పనిచేస్తోంది.
15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల మేరకు 1971వ జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని కాకుండా 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలకు నిధులు కేటాయింపులు జరపాలని సిఫారసు చేయటంతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను గరిష్టంగా అమలు చేశాయి. దీని ద్వారా ఇక్కడ జనాభా గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిపోయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు 5 సంవత్సరాల కాలంలో రూ.20వేల కోట్లు నష్టపోతాయి.
జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు – దక్షిణాదికి అన్యాయం
దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ఎక్కువ! కానీ కేంద్రం వాటికి కేటాయించే నిధులు తక్కువ! ఉత్తరాది రాష్ట్రాల ఆదాయం తక్కువ! కానీ కేంద్రం వాటికి కేటాయించే నిధులు ఎక్కువ! పన్నుల రూపంలో తెలుగు రాష్ట్రాలు కేంద్రానికిచ్చే ప్రతీ రూపాయిలో కేవలం 67 పైసలే వెనక్కివస్తుంటే.. యూపీకి రూపాయికి 2 రూపాయలు, బీహార్‌కు రూపాయికి రూపాయి చొప్పున ఇస్తోంది కేంద్రం. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న ఈ అన్యాయం మున్ముందు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
దీనికి కారణం.. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య పెరిగిపోతున్న జనాభా అంతరం. ఉత్తర భారత రాష్ట్రాల్లో టీఎఫ్‌ఆర్ (టోలర్ ఫెర్టిలిటీ రేటు.. అంటే సగటున ఒక మహిళకు జన్మించే పిల్లల సంఖ్య) ఎక్కువగా ఉండగా.. గత ఐదు థాబ్దాల్లో దక్షిణాపథంలో అది తక్కువ అవుతూ వచ్చినట్లు జాతీయ ఆరోగ్య సర్వే వెల్లడించిది. ఉత్తరప్రదేశ్, బీహార్ (దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న) రాష్ట్రాల్లో ఫెర్టిలిటీ రేటు వరుసగా 2.74, 3.41గా ఉంది. మధ్యప్రదేశ్‌లో ఆ రేటు 2.8గా ఉంది. అదే సమయంలో.. కేరళ 1.56, ఏపీ, తెలంగాణల్లో 1.8గా ఉన్నది.
ఉత్తరాది సీట్లు పెరిగిపోతాయ్!
మన దేశంలో అమెరికా పద్దతుల్ని ప్రామాణికంగా తీసుకుని… జనాభా ప్రాతిపదికన పార్లమెంటరీ ప్రాతినిధ్యాన్ని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో 1971 జనాభా లెక్కల ప్రకారం లోక్‌సభ సీట్ల సంఖ్యను నిర్ధారించారు. 1976లో ఎమర్జెన్సీ సందర్భంగా పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి లోక్‌సభ నియోజకవర్గాలను నిర్ణయించింది. 2000 వరకు నియోజకవర్గాల సంఖ్య పెరగరాదని చట్టం ఆదేశించింది. 2001లో జనాభా గణన గడువు ముగియగా 2026 వరకు పొడిగించారు. దాంతో యాభై ఏళ్లపాటు నియోజకవర్గం, జనాభా నిష్పత్తికి సంబంధం లేకపోయింది. యూపీలో ఎంపీకి 25 లక్షల మంది ఓటర్లు ఉంటే, బీహార్‌లో 26 లక్షల మంది, బెంగాల్లో 22 లక్షల మంది, తమిళనాడులో 18 లక్షల మంది, కేరళో 17 లక్షల మంది చొప్పున ఓటర్లున్నారు.
2026 తర్వాత కొత్త జనాభా లెక్కల ప్రకారం మార్పుచేర్పులు చేస్తే.. తక్కువ జనాభా రేటున్న దక్షిణ భారత రాష్ట్రాలు సీట్ల పరంగా నష్టపోతాయి.
2014 ఎన్నికలే తీసుకుందాం.. బీజేపీకి వచ్చిన సీట్లలో 51 శాతం.. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి వచ్చినవే. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం సీట్ల పునర్విభజన జరిపితే ఈ రాష్ట్రాలకు మరిన్ని సీట్లు వస్తాయి. రాజ్యసభలో సీట్లను కూడా జనాభా ఆధారంగా పునర్వ్యవస్థీకరిస్తే.. అక్కడా హిందీ బెల్ట్ రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. ఇది ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యానికి, దక్షిణాది రాష్ట్రాలు బలహీనపడడానికి దారితీస్తుంది. ఇది మరింత అసమతుల్యతకు, అభివృద్ధి నిరోధానికి దారి తీస్తుంది.
ఉదాహరణకు జీఎస్టీ బిల్లే తీసుకుంటే… దాని వల్ల తమ రాష్ట్రానికి చేటు అని, దాన్ని ఆమోదించబోమని తమిళనాడు మాజీ సీఎం జయలలిత గట్టిగా వాదించారు. కానీ ఆమె మాట నెగ్గలేదు. ఉత్తరాది ఆధిపత్యం కింద దక్షిణాది రాష్ట్రాలు నలిగిపోయాయని ప్రముఖ విశ్లేషకులు అనేక మంది వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థను ఇది దెబ్బ తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు 37%… ఇప్పుడు 317%
1951లో తమిళనాడు జనాభా బీహార్ కంటే ఎక్కువ. కానీ ఇప్పుడు బీహార్ జనాభా తమిళనాడు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మధ్యప్రదేశ్ జనాభా ఒకప్పుడు కేరళ కంటే 37% ఎక్కువ. ఇప్పుడేమో 317 % ఎక్కువ.
పన్నులపై కేంద్ర పెత్తనం
కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత పన్ను విధింపు అధికారాలు ఉన్నాయి. అనేక రంగాలపై పన్నులు విధించే అధికారాన్ని కేంద్రం తన గుప్పిట్లో ఉంచుకుంది. కొన్ని పన్ను అధికారాలను, పన్నుల ద్వారా లభించే ఆదాయాన్నీ రాష్ట్రాలతో పంచుకోవడానికి రాజ్యాంగ నిర్మాతలు 270 నుంచి 282వ అధికరణల్లో తగు ఏర్పాట్లు చేశారు.
గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక అధికారాల్లోకి, స్వయం ప్రతిపత్తిలోకి చొరబడిరది. అనేక రకాలుగా ఒత్తిడి పెంచింది. జీఎస్టీ చట్టం, జీఎస్టీ మండలి నిర్మాణం రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరంగా రూపుదిద్దుకున్నాయి. అంతరాష్ట్ర వ్యాపారంపై పన్ను వసూళ్లు ఇదివరకటిలా భారత సంఘటిత నిధిలో జమకావని, ఈ వసూళ్లను రాష్ట్రాలకు ఎలా పంచాలో తేల్చేది జీఎస్టీ మండలేనని పేర్కొనడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
నిధుల బదిలీలో చిక్కులు
ఈ వసూళ్లపై భావి ఆర్థిక సంఘాలకూ అధికారాలు ఉండవు. వాటిని ఎలా పంచాలో నిర్ణయించే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి దఖలుపడటం రాష్ట్రాల ప్రయోజనాలకు హాని చేస్తుంది. రాష్ట్రాలు కూడా పన్నులు విధించడానికి తమకున్న అధికారాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జీఎస్టీ మండలికి అప్పగించడం శోచనీయం. ఈ విధంగా రాష్ట్రాలు తమ పౌరుల హక్కులను రక్షించడంలో విఫలమయ్యాయి. పన్ను వసూళ్ల పంపకానికి సంబంధించిన నిర్ణయాలన్నీ జీఎస్టీ మండలి సమావేశానికి హాజరయ్యే సభ్యుల్లో నాలుగింట మూడు వంతులు ఓటు వేసి తీసుకోవలసి ఉంటుంది.
ఇక్కడ మెలిక ఏమంటే, మండలిలో మూడోవంతు సభ్యులను కేంద్రం నియమిస్తే, రాష్ట్రాలన్నీ కలిసి మిగిలి సభ్యులను నియమిస్తాయి. వీరి నిర్ణయాలను వీటో చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రాలన్నీ ఏకమై ఏమైనా మార్పులు సూచించినా వాటిని కేంద్రం తోసిపుచ్చితే అవి చేయగలిగిందేమీ లేదు. జీఎస్టీ మండలిలో వచ్చిన ప్రతిపాదన ప్రకారం రాష్ట్రాల వాటా పెంచడానికి కేంద్రం ఒప్పుకోకపోతే, రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి పార్లమెంట్ కొత్తగా మరొక చట్టం చేయవలసిందే. భవిష్యత్తులో వచ్చే ఫైనాన్స్ కమిషన్లు సైతం రాష్ట్రాలకు నిధులు పెంచలేవు. ఇటీవలి భారీ వరదల వల్ల దెబ్బతిన్న కేరళ పునరావాస నిధుల కోసం పన్నులు పెంచాలనుకున్నా మారిన పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. మొత్తం జీఎస్టీ వసూళ్లలో 50శాతం అంతర్రాష్ట్ర వ్యాపారంపై పన్నుల రూపేణా లభించేవే.
14వ ఫైనాన్స్ కమిషన్ 42శాతం ఆదాయాన్ని బదిలీ చేసింది. దీనికి కారణం అప్పటివరకు కేంద్ర పథకాలుగా అమలైన కొన్నింటిని రాష్ట్రాలకు అప్పగించడం వల్ల వాటి అమలుకు సంబంధించిన నిధులు కూడా రాష్ట్రాలకు దక్కాయి. అంటే నిధులతోపాటు రాష్ట్రాలపై ఆర్థిక భారమూ పెరిగిందన్నమాట. అనేక సెస్సులను జీఎస్టీలో కలిపేసినా కేంద్రం ఇప్పటికీ ఆరు రకాల సెస్సులు వసూలు చేస్తోంది. 2017-18 చివరివరకు మొత్తం రూ.86,440కోట్ల సెస్సులు వసూలైతే, అందులో రూ.30,000 కోట్లను మాత్రమే రాష్ట్రాలకు బదిలీ చేశారని ఇటీవల ఒక పార్లమెంటరీ బృందం వెల్లడించింది.
అవార్డులు ఇవ్వటంలో సైతం కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది. పద్మా అవార్డులు చాలా తక్కువగా దక్షిణాదికి చెందినవారికి దక్కుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే అత్యధిక ఆదాయం ఆర్జిస్తుంటే, రైల్వే బడ్జెట్‌లో అధికమొత్తం ఉత్తరాదికి ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తూతూ మంత్రంగా ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు ఎగనామం పెట్టారు. ఖాజేపేట రైల్వేకోచ్, ఉక్కు కర్మాగారం, పసుపు బోర్డు ఏర్పాటు, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్కు వంటివి తెలంగాణ ఎన్నిసార్లు కోరినా ఏర్పాటు చేయలేదు.
ఈ విధంగా కేంద్రం దక్షిణాది రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్షతను ప్రదర్శిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశంలో భాగం కాదని కేంద్రం భావిస్తున్నట్లుంది. అడుగడుగునా దక్షిణాదిపై వివక్షతను ప్రదర్శిస్తోంది. ఇటువంటి కారణాల వల్లనే ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి. వీటి కారణంగానే రాష్ట్రాల విభజనకు డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇది చివరకు దేశాన్ని విభజించమనే డిమాండ్ల వంటివి రాకుండా కేంద్రం దేశం మొత్తాన్ని సమదృష్టితో చూడాలి.