Suryaa.co.in

National

పంచాయితీలపై రాష్ట్రాల పెత్తనానికి తెర

– పంచాయతీలకే నేరుగా నిధులు
– ఆర్థిక సంఘం నిధులే దిక్కు
– ఇక డైరెక్ట్
– ఈజీఎస్ ఫండ్స్ మళ్లింపు
– కేంద్రం కీలక నిర్ణయం

కేంద్రం తమకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దిగమింగుతున్నాయంటూ సర్పంచులు చేసే ఆరోపణలు ఇక వినిపించవు. ఎందుకంటే నేరుగా పంచాయితీలకే ఇకపై కేంద్రం నిధులు ఇవ్వనుంది. దీనితో పంచాయితీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనానికి తెరపడనుంది. పంచాయితీలకు నిధులు విడుదల చేయాలంటూ భిక్షాటన చేసే అవసరం ఇక సర్పంచులకు ఎంత మాత్రం అవసరం లేదు.
ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్రానికి పెత్తనం లేకుండా పోతోంది. వచ్చేనెల నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోనే జమ కానున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసుకునే అవకాశం లేకుండా కేంద్రం బ్రేక్ వేసింది. ఇప్పటికే ఉపాధి హామీ నిధులను నేరుగా ఇస్తున్నారు.

మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ రాయితీని కూడా డైరెక్ట్ గా విడుదల చేస్తున్నారు. తాజాగా పంచాయతీ నిధులపై ఆంక్షలు మొదలయ్యాయి. మొత్తం 12వేల గ్రామ పంచాయతీలు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో కొత్త ఖాతాలు తెరిచారు. ప్రతినెలా వచ్చే దాదాపు రూ. 300 కోట్లకుపైగా ఫండ్స్పై రాష్ట్రానికి అధికారం లేకుండా పోయింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులే దిక్కవుతున్నాయి. జనాభా ఆధారంగా ఏడాదికి ఒక్కో మనిషికి రూ. 1760 చొప్పున ఈ ఫండ్స్ వస్తున్నాయి. ఈ లెక్కన 500 జనాభా ఉండే గ్రామ పంచాయతీకి ఏడాదికి రూ. 8 లక్షలకుపైగా వస్తున్నాయి. ప్రతి నెలా అన్ని గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నారు.

వాటికి కొంత కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉండగా.. పెండింగ్ పెడుతోంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజింగ్ చేస్తోంది. వాటిని ఇతర పథకాలకు మళ్లిస్తోంది. దాదాపు ఏడెనిమిది నెలలు వాడుకుంటోంది. దీంతో గ్రామాలకు వేల కోట్లు పెండింగ్ పడుతున్నాయి. చిన్న చిన్న పనులకు కూడా చిల్లిగవ్వ లేకపోవడంతో పంచాయతీల్లో ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చెక్కులు రెడీ చేసి ట్రెజరీలకు పంపిస్తే.. అవి తిరిగి వస్తున్నాయి.

రాష్ట్ర సర్కారు పల్లె ప్రగతి లాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా లక్షలకు లక్షలు బయట అప్పులు తేవాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల్లో ఫండ్స్ లేకపోవడం వల్ల గ్రామస్తులు అడిగే చిన్నచిన్న పనులు కూడా చేయించలేక తలదించుకోవాల్సి వస్తోందంటున్నారు.

చాలా గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలకు నీళ్లు పోయడానికి రూ. 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టర్‌, రూ.1.88 లక్షలు పెట్టి ట్రాక్టర్‌ ట్రాలీ, రూ.1.83 లక్షలు పెట్టి ట్యాంకర్‌ కొనుగోలు చేశారు. ఇప్పుడీ ట్రాక్టర్లు ఆయా గ్రామపంచాయతీలకు గుదిబండగా మారాయి. ట్రాక్టర్‌ నడిపే డ్రైవర్‌ జీతం, రోజూ డీజిల్‌ ఖర్చులు కూడా సర్దుబాటు కావడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి, ఇతర పథకాలకు వాడుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువవుతన్నాయి.

ఇప్పటికే పలు పథకాల్లో రాష్ట్ర పెత్తనాలను తగ్గించారు. జవహర్ రోజ్ గారి యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా నేరుగా కేంద్రం పంచాయతీలకు ఇస్తోంది. ఉపాధి హామీలో రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు అధికారాలిచ్చే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

పంచాయతీల్లో అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేసేలా నిధులను డైరెక్ట్ గా పంపిస్తోంది. దీంతో గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండదని భావిస్తోంది. వచ్చేనెల నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు సమకూరనున్నాయి. దీనికోసం పంచాయతీలకు కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ విధానంతో సర్పంచులకు ఊరట లభించనున్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమ చేసే విధంగా జీవో నంబర్‌ 18 విడుదలైంది.

గ్రామ సభలో తీర్మానించిన పనుల బిల్లులను వెంటనే తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు అందేవి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా నిధులను అందజేయనున్నది.

వాస్తవానికి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులతో మంజూరైన నిధులను పంచాయతీల ఖాతాల్లోకి చేరేందుకు రెండు, మూడు నెలల సమయం పట్టేది. ఈ కారణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు, పైపులైన్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టినా.. బిల్లుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇది పంచాయతీలకు భారంగా మారింది. వచ్చే నిధులను వాడుకుంటున్న రాష్ట్రం.. ఎస్‌టీవోల్లో పంచాయతీల ఖాతాలను ఫ్రీజింగ్‌ చేస్తోంది. సకాలంలో పనులు చేసినా.., పంచాయతీ ఖాతాల్లో నిధులు ఉన్నా.. సర్పంచులు బిల్లులు తీసుకోలేని దుస్థితి ఉండేది.

కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు నేరుగా ఇచ్చే ఈజీఎస్‌ ఫండ్స్‌ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన లేబర్‌ వర్క్‌ ఆధారంగా 60:40 రేషియోలో ఫండ్స్ రిలీజ్చేయాలి. లక్ష్యానికి తగ్గట్టుగా లేబర్తో కష్టపడి పనులు చేయించుకున్న పంచాయతీలకు మెటీరియల్ వర్క్ కింద 40 శాతం నిధులను నేరుగా ఖర్చు చేసుకునే అవకాశం ఉండేది. కానీ..ఈ 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి మళ్లించుకుంది.

తమ ఊరికి వచ్చిన నిధులపై గ్రామ సభలు పెట్టుకొని పనులు గుర్తించడంతో పాటు, అవసరమైన సీసీ రోడ్లు, పొలాలకు మట్టిరోడ్లు, మెటల్‌ రోడ్లు, చెరువులకు తూములు, మత్తళ్లు, పంట కాల్వల రిపేర్లు, ఇతరత్రా చిన్న, చిన్న సిమెంట్‌ వర్కులు చేసుకునే అధికారాన్ని కూడా పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గుంజుకున్నది. గడిచిన ఏడేండ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.15,738 కోట్ల ఉపాధి నిధులు రాగా, ఇందులో మెటీరియల్వర్క్ కు సంబంధించి సుమారు రూ. 6 వేల కోట్లను గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి.

కానీ వాటిని స్టేట్ గవర్నమెంట్ తన ఖాతాకు మళ్లించుకొని తనకు ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెడుతోంది. తన వాటాగా ఈజీఎస్ కింద పంచాయతీలకు ఇవ్వాల్సిన సుమారు రూ. 1500 కోట్లను కూడా తన దగ్గరే పెట్టుకున్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం కీలక మార్పులు తీసుకువచ్చింది.

LEAVE A RESPONSE