Suryaa.co.in

Andhra Pradesh National

రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల..ఏపీకి ₹879 కోట్లు

దిల్లీ: ఆదాయ లోటుతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.7,183 కోట్లు విడుదల చేసినట్లు మంగళవారం తెలిపింది.పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ డెఫిసిట్‌ (PDRD) గ్రాంట్‌ ఆరో విడత నిధుల్లో భాగంగా ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఏపీకి రూ.879.08 కోట్లు నిధులు విడుదలయ్యాయి.ఏపీ సహా అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ, మణిపూర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు పీడీఆర్‌డీ కింద గ్రాంట్‌ రిలీజ్‌ చేయాలని 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. 2022-23 సంవత్సరానికి గానూ రూ.86,201 కోట్లు ఇవ్వాలని సూచించింది. ఈ మొత్తాన్ని 12 సమాన మొత్తాల్లో కేంద్రం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ నెలకు సంబంధించి ఆరో విడతగా రూ.7,183 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు 14 రాష్ట్రాలకు రూ.43,100.50 కోట్లు విడుదల చేసినట్లు తెలిపింది. ఏపీకి ఆరో విడతకు 879.08 కోట్లు విడుదలవ్వగా.. మొత్తంగా రూ.5,274.5 కోట్లు విడుదలయ్యాయి. 2020-21 నుంచి 2025-26 సంవత్సరం వరకు ఈ నిధులు అందనున్నాయి.

LEAVE A RESPONSE