– భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరుకు బాటలు వేసింది
– ఆ పోరాటయోధురాలి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
– చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటానికి స్పూర్తినిచ్చిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఆమె వర్ధంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్డు లో గల రజక భవనం ఎదుట చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. “నిజాం నవాబులను ఎదురించి, రజాకార్లను తరిమికొట్టిన ధీశాలి.
వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించింది ఐలమ్మ అని మంత్రి కొనియాడారు.
ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచింది. ఆమె కొడవలి చేతబడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు. ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయింది. ఆమె తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చింది. నడీడులో గడీలను గడగడలాడించింది. ఎత్తిపట్టిన చేతిలో ఎర్రజెండా అయింది. ఆశయమే ఆశగా శ్వాసించింది. సాహసంతోనే సహవాసం చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరులో మమేకమైంది. భూమి లేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన బందగి దారిలో నడిచిందని” ఆమె ధీరత్వాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆమె గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసిందనీ,ఆమె ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి వెంట నివాళులు అర్పించిన వారిలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు రజక సంఘం నేతలు ఉన్నారు.