1975లో వచ్చిన జేబుదొంగ సినిమాలోని పాట “నీలాల నింగిలో మేఘాల తేరులో…”
చక్రవర్తి వర్ధంతి ఇవాళ.
చక్రవర్తి కొన్ని సొంపైన పాటలు చేశారు. చక్రవర్తి చేసిన వెలుగు నీడలు సినిమాలోని “చీకటి వెలుగుల కౌగిలో…” పాట తెలుగు సినిమాల్లో వచ్చిన మంచి పాటల్లో ఒకటి. ఆ పాట చక్రవర్తే చేశారా? పలువురు నమ్మరు. ఈ పాట అరేన్జ్ మంట్ గుణసింగ్ చేశారని బాలు ఒక పాడుతా తియ్యగా కార్యక్రమంలో చెప్పారు. మరి ఆ పాట బాణి చక్రవర్తే చేశారా? చెయ్యలేదని ఎందుకు అనుకోవాలి? చెప్పలేం.
“శారదా నను చేరరా…” నుంచి కొన్ని మంచి పాటలు చేసిన చక్రవర్తి మల్లెపువ్వు సినిమాలో గొప్ప పాటలు చేశారు. ప్రేమాభిషేకం పాటలు, బలిపీఠం పాటలు ఇలా కొన్ని చెప్పుకోతగ్గ పాటలు చేశారు చక్రవర్తి.
చక్రవర్తి వీర మాస్ పాటలు చేశారు. పల్లెటూళ్లలో ట్రాక్టర్లపై, పొలాల్లో, బస్సుల్లో చక్రవర్తి పాటలు మోగుతూ, మారుమోగుతూ తెలుగు నాట 80వ దశకం ఊగిపోయింది.
చక్రవర్తి కచ్చితంగా గొప్ప సంగీత దర్శకుడు కారు. సంగీతజ్ఞత, సృజనాత్మకత, ప్రజ్ఞ, ప్రతిభ పరంగా దేశంలో వచ్చిన ఏ గొప్ప సంగీత దర్శకుడి పక్కన చక్రవర్తికి చోటు ఉండదు; లేదు.
చక్రవర్తి పక్తు తెలుగు స్థాయి కమర్షియల్ సంగీత దర్శకుడు మాత్రమే. సినిమా హాళ్ల ముందు చక్రాలు, పునుగులు, మిరప బజ్జీలు, చగోడీలు విచ్చలవిడిగా అమ్ముడయినట్టుగా తెలుగు సినిమాల్లో చక్రవర్తి పాటలు సాగిపోయాయి.
చక్రవర్తి చేసిన సొంపైన పాటల్లో ఒకటి ఈ “నీలాల నింగిలో మేఘాల తేరులో…” పాట.
చక్రవర్తి చాల చక్కగా చేశారు ఈ పాటను.
ఆత్రేయ మంచి సాహిత్యాన్ని ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుశీల పాడారు.
– రోచిష్మాన్
9444012279