Suryaa.co.in

Features

చలం‌ – శ్రీరమణ మహర్షి

గొల్లపూడి మారుతీరావు, వారి స్వీయచరిత్రలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. 1965లో శ్రీమారుతీరావు చలం గారికి ఒక లేఖ రాసారు! మీరు రాసిన పుస్తకాలు గూర్చి మీ భావన ఏమిటి? అని. దీనికి చలంగారు “వాటిని బుద్ధిలేక రాశాను. అవన్నీ ఎందుకు రాశానా? అనుకుంటున్నాను” (పుట 120) అని స్ఫురింపచేసే మాటలతో సమాధానం రాశారు. చలంగారి సొంత అక్షరాలతో ఆయన లేఖా ప్రతికృతి మారుతీరావు స్వీయచరిత్రలో ప్రచురించారు. ఈమధ్య పిల్లుట్ల ఆంజనేయులు (వీరిది బాపట్ల) గారి స్వీయచరిత్రలో చలం ప్రబోధాలకు లోనై కష్టాలపాలైన ఒకరి జీవితోదంతం చదవవచ్చు. చాలామంది తెలుగు పాఠకులకు గుడపాటి వేంకట చలం, భగవాన్ రమణ మహర్షి ప్రభావితుడై గడిపిన జీవితం తెలియదు!

ఈమధ్య “శ్రీరమణ కరుణా విలాసం” అనే పుస్తకం చదివాను‌. ఈ పుస్తకం 295 పుటలో చలం అనుభవం ఒకటి ఉంది. చలం అరుణాచలం వచ్చేశాక పాత స్నేహితులైన శ్రీశ్రీ మొదలగు మిత్రులు “చలానికి స్కాచ్ విస్కీ త్రాగి ఉత్తరం రాస్తున్నాము” అని హేళనగా, వ్యంగ్య పూర్వకంగా ఉత్తరం రాశారు. వారికి చలం జవాబు ఇట్లా వ్రాశాడు “ఇక్కడ సాటిలేని దివ్యోన్మత్తతను ప్రసాదించే పానీయాన్ని కనుగొన్నాను! దీనిని ఒకసారి సేవిస్తే శాశ్వత ఆనందంలో నిలిచిపోతారు! అనంతర దుష్ఫలితాలు ఉండవు. ఇది స్వయంప్రకాశమానమైనది! మీరు కూడా ధైర్యం ఉంటే వచ్చి సేవించండి” అని వ్రాశాడు.

అసలు చలం ఎట్లా అరుణాచలం చేరగలిగాడు…. చింతా దీక్షితులు, చలం పరమమిత్రులు. ఇద్దరూ విద్యాశాఖలో ఉద్యోగులు. దీక్షితులు గారు ఎట్లానైనా ఒకసారి చలాన్ని అరుణాచలం దర్శింపచేయాలని తెగ ఆరాటపడేవారు! ఎన్నోసార్లు ప్రయత్నించాడు. ఒకరోజు చలం… తన ఇష్టం వచ్చినట్లు శ్రీరమణాశ్రమంలో ప్రవర్తించడానికి ఒప్పుకుంటే వస్తానన్నాడు. ఇద్దరూ అరుణాచలం చేరారు. ఒకరోజు రమణ మహర్షి అరుణాచలం కొండ దిగి వస్తుండగా, అందరూ భక్తితో ఆయనకు దారి ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. మన కథానాయకుడు చలం ఆయన వచ్చే దారికి అడ్డం నిలబడి నిర్లక్ష్యంగా సిగరెట్ పొగ వదులుతున్నాడు! చింతా దీక్షితులు ‘ఈ దుర్మార్గుడిని ఎందుకు తీసుకుని వచ్చాను?’ అని తల పట్టుకున్నాడు.

శ్రీరమణ మహర్షి చలం దగ్గరకు రాగానే, ముఖం మీద సిగరెట్ పొగ వదులుదామనుకున్నాడు! శ్రీరమణ మహర్షి ప్రక్కకు తప్పుకుని ఒక్క క్షణం సూటిగా చలం కళ్ళలోకి చూసారు. ఆ క్షణం ఏమి జరిగిందో తెలియదు!! చలం ఆయన కాళ్ళమీద పడి ఉన్నాడు!! ఏం జరిగిందో చలమే చెపుతున్నాడు.
“”ఆకాశాన్నంటే గంభీర శ్యామలాకృతి నాపై దృష్టి నిలిపింది! ఇనుమును చీల్చే విపరీతాగ్నికీల వలే, పాషాణాన్ని కరిగించే కేంద్రీకృత సూర్యరశ్మి వలే ఆ తేజోమయ వీక్షణం నా హృదయాంతరాళంలోకి దూకి భగ్గున మండింది. నేను లేను… నేను లేను… నేను భావించుకున్నది ఏదీ లేదు” అంటున్నాడు చలం!! ఆ క్షణం నుండి చలం జీవితం అరుణాచల రమణునికి అంకితం అయిపోయింది! అక్కడే తనువు చాలించాడు! అదృష్టవంతుడు.

శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణ మహర్షి, అరవింద యోగి, పరమహంస యోగానంద, కంచి పరమాచార్యులు వంటి దివ్యులు, ప్రాచీనకాలపు ఋషి సమానులు ఈనాటికీ ఈ హిందూ దేశంలో ఉండటంవలనే ఈదేశం అన్యమతాక్రాంతం కాలేదు. ఏనాటికీ కాదు…

– అక్కిరాజు రమాపతిరావు
(ఆంధ్రభూమి దిన పత్రికలో 16-7-2018 వ్యాసంలోని ముఖ్యాంశాలు)

LEAVE A RESPONSE