* కర్నాటక ఎన్నికలకు తెలుగు నేతలు
*బీజేపీ స్టార్‌క్యాంపెయినర్‌గా డికె అరుణ
* తెలంగాణ నేతలనే మోహరించిన బీజేపీ
* కాంగ్రెస్ తరఫున రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ, ఉత్తమ్
* బెంగళూరు కాంగ్రెస్ ఇన్చార్జిగా రఘువీరారెడ్డి
* ఇంకా ఖరారు కాని బీఆర్‌ఎస్ నేతల పర్యటన
* 30 నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం
* బెంగుళూరు, మైసూరు ఐటి కంపెనీల్లో ఎక్కువమంది తెలుగువారే
* మెడికల్ కాలేజీలు, రియల్‌ఎస్టేట్, కూలీలలో తెలుగువారే ఎక్కువమంది
* రెడ్డి, బలిజ, కమ్మ వర్గాల అధిపత్యం ఎక్కువే
* బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ సత్తాకు సవాల్
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీకి చావోరేవోగా మారిన కర్నాటక ఎన్నికలు బీజేపీ-కాంగ్రెస్ పార్టీలకు సవాలుగా పరిణమించాయి. ప్రధాని మోదీ-కేంద్రహోం మంత్రి అమిత్‌షా కర్నాటక ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించడంతో, దేశంలోని కమలదళాలు కర్నాటక ప్రచారపర్వంలో దిగాయి. దేశంలోని పలు రాష్ర్టాల నుంచి బీజేపీ శ్రేణులు కర్నాటక ప్రచారబరిలో పనిచేస్తున్నాయి. ఇక బీజేపీకి మార్గదర్శి అయిన ఆర్‌ఎస్‌ఎస్ దళాలు, గత మూడునెలల నుంచే క్షేత్రస్థాయి ప్రచారంలో దిగాయి. బీజేపీలో కీలకమైన పాత్ర పోషిస్తున్న జాతీయ సంఘటనా మంత్రి, బీఎల్ సంతోష్ సొంత రాష్ట్రం కూడా కావడంతో.. ఆయన కూడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోవడం ఇప్పుడు ఆయనకు సవాలుగా మారింది.
ఈ నేపథ్యంలో తెలుగువారి సంఖ్య, ప్రభావం ఉన్న కర్నాటకలో తెలుగువారి ఓట్లపై బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు కన్నేశాయి. బోంబే కర్నాటకగా పిలుచుకునే పూర్వ తెలంగాణ సంస్ధానంలోని జిల్లాల్లో, తెలుగువారి ప్రభావం ఎక్కువ. తెలంగాణ-ఆంధ్రా ప్రాంతాల నుంచి వలస వెళ్లిన వారే, ఇక్కడ ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. వ్యాపార-వ్యవసాయ రంగాల్లో వీరిదే హవా. హోటల్ రంగంతోపాటు.. రియల్ ఎస్టేట్, మెడికల్ కాలేజీ రంగాల్లో తెలుగు ప్రముఖులే ముందున్నారు. డికె ఆదికేశవులు నాయుడు, ఎంఎస్ రామయ్య, దొరస్వామినాయుడు వంటి ప్రముఖులకు మెడికల్ కాలేజీలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా సైతం తెలుగువారు రాణిస్తున్నారు. మాజీ ఎంపి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ మంత్రి, దివంగత గాలి ముద్దుకృష్ణమనాయుడు బంధు వర్గాలు, కర్నాటక రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వారు మంత్రులుగా కూడా పనిచేశారు. ఇక బెంగళూరు-మైసూరులోని భవన నిర్మాణ రంగంలోనూ, తెలుగువారే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆంధ్రా-తెలంగాణ ప్రాంతాల నుంచి కూలీలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నారు.
ప్రధానంగా కర్నాటకలోని దాదాపు 30 నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని అనంతపురం, తిరుపతి, మదనపల్లి; తెలంగాణలోని జహీరాబాద్ వైపు వెళ్లే.. బీదర్,బళ్లారి, కొప్పల్, రాయచూరు, యాద్గిర్, కలగురిగి వైపు ఉన్న ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య అధికం. బళ్లారి, రాయచూరు, గుల్బర్గా, చిత్రదుర్గ్, సింధనూరు, హుబ్లి, ధార్వాడ్, చిక్‌పేట, చింతామణి, కోలార్, రాయల్పాడు, బాగేపల్లి వంటి ప్రాంతాలన్నీ తెలుగువారికి పట్టున్నవే.
వీరిలో ఆంధ్రా-తెలంగాణ నుంచి వలస వెళ్లిన, బలిజ-రెడ్డి-కమ్మ వర్గాల ప్రభావం ఆయా ప్రాంతాల్లో ఎక్కువ. కమ్మవర్గం రియల్‌ఎస్టేట్- వ్యవసాయం-హోటల్ రంగంలో ఉంది. రియల్‌ఎస్టేట్, భవననిర్మాణరంగంలో రెడ్డివర్గం ఉంది. ఇక రియల్‌ఎస్టేట్‌తోపాటు, స్థానిక రాజకీయాల్లో బలిజలు ప్రముఖపాత్ర పోషిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగువారి ఓట్ల సాధన కోసం జాతీయ పార్టీలయిన బీజేపీ-కాంగ్రెస్, తెలుగు నేతలనే ప్రచారబరిలోకి దింపాయి. కులాల వారీగా, జిల్లాల వారీగా ఎంపిక చేసుకున్న ప్రాంతాలకు వారిని నియమిస్తున్నాయి. కన్నడ నేతల కంటే, తెలుగునేతల ప్రచారం వల్లనే ఎక్కువ ఫలితం ఉంటుందన్న ముందుచూపే దానికి కారణం.
ఇక కర్నాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ నుంచి బీజేపీ అగ్రనేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించే అంశంపైనే, తెలంగాణలో పార్టీ భవితవ్యం ఆధారపడి ఉందని ఆ పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. కర్నాటలో బీజేపీ విజయం సాధిస్తే, దాని ప్రభావం తెలంగాణలో సానుకూలంగా ఉంటుందని, అదే ఓడిపోతే కాంగ్రెస్‌లో జోష్ పెరుగుతుందన్న అంచనా, బీజేపీ నాయకత్వంలో లేకపోలేదు.
దానితో తెలంగాణ బీజేపీ నేతలను, ఎన్నికల రణరంగంలో ఎక్కువగా వినియోగిస్తోంది. అందులో భాగంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణను, స్టార్‌క్యాంపెయినర్‌గా నియమించింది. తెలుగువారు ఎక్కువగా ఉండే బీదర్‌లో, ఇటీవల హోంమంత్రి అమిత్‌షా బహిరంగసభ నిర్వహించారు. దానికి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపి వివేక్ హాజరయ్యారు. కాగా ప్రస్తుతం రాజ్యసభసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాథ్యక్షురాలు డికె అరుణ కర్నాటక ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఇక జాతీయ కార్యవర్గసభ్యుడు-మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, ఎంపి అర్వింద్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపి జితేందర్‌రెడ్డి, వివేక్, మాజీ మేయర్ బండ కార్తీక్‌రెడ్డి, ఎస్,కుమార్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలుగువారున్న ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. వీరిని బెంగళూరు సిటీతోపాటు, తెలంగాణ సంస్థానంలోని ప్రాంతాల్లో ప్రచారానికి వినియోగించుకోనున్నారు. అటు ఏపీ నుంచి దేవానంద్, రఘు, నిర్మలా కిశోర్, మాలతీరాణిని ఎన్నికల ప్రచారానికి పంపించారు. అయితే ఏపీలో బీజేపీ నుంచి ప్రముఖులెవరూ, పెద్దగా ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు లేవు. తెలంగాణ నేతలకే నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చింది.
ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కర్నాటక ఎన్నికల ప్రచారానికి, తెలుగు నేతలను వినియోగించుకుంటోంది. ఇప్పటివరకూ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న, పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హటాత్తుగా తెరపైకొచ్చారు. ఆయనను బెంగళూరు నగర ఇన్చార్జిగా కాంగ్రెస్ నియమించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపి మధుయాష్కీ, ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కర్నాటక ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రజలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో, రేవంత్‌రెడ్డి బహిరంగసభ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. అక్కడ రేవంత్‌రెడ్డికి ఎక్కువ ఇమేజ్ ఉన్నందున, ఆయన ప్రచారం పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కర్నాటక పీసీసీ చీఫ్ డికె శివకుమార్‌కు రేవంత్ సన్నిహితుడు కావడంతో, రేవంత్‌రెడ్డి కర్నాటక ఎన్నికల ప్రచారంపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు.
ఇక కర్నాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించిన బీఆర్‌ఎస్, ఇప్పుడు పోటీకి దూరంగా ఉంది. అయితే జెడిఎస్‌కు.. అన్ని రంగాల్లో మద్దతునిచ్చేందుకు సిద్ధమవుతున్న బీఆర్ ఎస్ తరఫున, ఎవరు ప్రచారానికి వెళతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. జెడిఎస్‌కు మద్దతునిస్తామని మాత్రం మంత్రులు చెబుతున్నారు.