Suryaa.co.in

Political News

కేసీఆర్ కు చంద్ర గండం ?

కొన్ని కొన్ని పదాలను విడి విడి గా కాకుండా…. జంటగా పలకడం తెలుగు వారికి ఒక అలవాటు. ఒక అన్నావాయితీ.ఉదాహరణకు…., ఆలు-మగలు, ఇల్లు – వాకిలి, ఈడు -జోడు, తాడు – బొంగరం, ఆకు – వక్క, ముద్దు – ముచ్చట, ఉలుకు – పలుకు, ముక్కూ – మొహం, కాళ్ళూ -చేతులూ, ఒడ్డూ -పొడుగూ, తల్లీ – పిల్లా….., మంచి – చెడు అని ఇలా అంటుంటాము కదా, ఆయా సందర్భాలను బట్టి!

అలాగే, తెలంగాణ -ఆంధ్ర అనేది కూడా జంట పదమే . తెలంగాణ, ఆంధ్ర అనే వాటి ఆస్థిత్వాలు ఒకదానిలో ఒకటి అంతర్భాగాలు. రెండూ కలిపితే – తెలుగు జాతి. నిండుగా వెలిగే జాతి. నిద్రలేచింది మొదలు, ఆంధ్ర వారికి తెలంగాణ కావాలి. తెలంగాణ కు ఆంధ్ర వారు కావాలి. ఈ రెండూ -ట్విన్ స్టేట్స్. జంట నగరాల లాటి, జంట రాష్ట్రాలు. రాజకీయం గా సైతం ఆంధ్ర పరిణామాలు తెలంగాణ రాజకీయ గమనాన్ని అమితంగా ప్రభావితం చేస్తుంటాయి.

హైదరాబాద్ జంతానగరాలు, రంగారెడ్డి జిల్లా, వాటి పరిసర ప్రాంతాలు, ఖ(క)మ్మం, నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాలలో ఆంధ్ర మూలాలు కలిగిన జనం లక్షల సంఖ్యలో నివసిస్తూ ఉండడమే ఇందుకు కారణం. దాదాపు 60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు, ఇతర తెలంగాణ జిల్లాలకు మొదలైన సీమాంధ్ర ప్రాంత వాసుల ‘వలస’, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఇక ముందూ ఉంటుంది కూడా. తెలంగాణ లోనే పుట్టి పెరిగి, చదువు ‘కొని’, పెళ్లిళ్లు చేసుకుని, పిల్లల్ని కని , ఉద్యోగాలు చేసి, రిటైర్ అయ్యి, అనాధ శరణాలయం లో చేరి, చనిపోయి, స్మశాన వాటికలకు చేరిన ఆంధ్రులకు లెక్కే లేదు. లక్షల్లో ఉంటారు.

హైదరాబాద్ ను తెలంగాణ వాసులతో పాటు ; ఆంధ్రులు కూడా ఒక ‘ల్యాండ్ అఫ్ ఆపర్చూనిటీస్’ గా మలుచుకోవడమే ఇందుకు కారణం. సీమాంధ్ర ప్రాంతపు ప్రజల డైనందిన జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ, అధికార, వ్యాపార, సామాజిక, పారిశ్రామిక వర్గాలవారు హైదరాబాద్ లో స్థిర నివాస భవనాలు, ఆస్తి పాస్తులు లేని వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. అక్కడ సర్వ మోసాలు, ఘోరాలు – నేరాలు, అరాచకాలు,అక్రమాలు, వ్యాపారాలు చేసేవారి ఆస్తిపాస్తులు ఇక్కడే గుట్టలు గుట్టలు గా పోగడి పోయి, తెలంగాణ ఆర్ధికాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి.

పది పన్నెండేళ్ల క్రితం పది, పన్నెండు లక్షలకు లభించే ఓ ఫ్లాట్ ధర ; ఈ అక్రమ ధన రాసుల కారణం గా రెండు కోట్లకు, మూడు కోట్లకు ఎగబాకింది. హైదరాబాద్ లో నగదు లావాదేవీల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. “డబ్బు” అనే పదానికి విలువ లేకుండా చేసింది. అందుకే, తెలంగాణ నిరంతర అభివృద్ధికి ఆంధ్ర కావాలి. కడుపు చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చే ఆంధ్రుల మనుగడకు తెలంగాణ కావాలి. ఈ బంధమే రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. ఇక ముందూ, చేస్తూనే ఉంటుంది. ఇదో శాశ్వత బంధం , ఎవరికి ఇష్టం ఉన్నా, లేకపోయినా!

ఈ నేపథ్యం లో – మరో నెలన్నర లో జరగవలసి ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో…. ముచ్చటగా మూడోసారి గెలిచి అధికారం లోకి రావాలని ఆశ పడుతున్న కేసీఆర్ కి ‘చంద్రబాబు గండం ‘ పొంచి ఉందా అనే అనుమానాలను పలువురు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయితే, బీఆర్ఎస్ నేతల నుంచి ‘ఉలుకు – పలుకు ‘ లేకపోవడం తో, తెలంగాణ ప్రభుత్వ పాలక పెద్దలు ఆయన అరెస్ట్ ను అంతర్గతం గా ఆనందించి ఉంటారనే భావం తెలంగాణ లోని ‘సీమాంధ్రుల ‘లోని అధికుల్లో కలిగింది అంటున్నారు.

హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధితో పాటు, తెలంగాణ లోని ఖ(క)మ్మం, నిజామాబాద్, నల్గొండ వంటి ప్రాంతాలలోని సీమాంధ్రులు దాదాపు 40 నియోజక వర్గాలలోని ఫలితాలను ప్రభావితం చేయగలిగిన సంఖ్యాబలం కలిగి ఉన్నారు. అసలు, (అసెంబ్లీ కి ఉన్నదే 119 సీట్లు.) వీరిలో…. ఓటు హక్కు కలిగి ఉన్న వారిలో అత్యధికులు ఈసారి బీఆర్ఎస్ కు తమ ఉనికి ప్రభావాన్ని గుర్తు చేయబోతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. అదే గనుక నిజమైతే, బీఆర్ఎస్ కు ‘చంద్రబాబు గండం’ ఎదురైనట్టే!

బీఆర్ఎస్ కు వారు ఎదురు తిరుగుతారు అనే అంచనాలు షికారు చేయడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. సీమాంద్ర ప్రాంతపు ఎన్నికల కంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాలుగైదు నెలలు ముందు గా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిస్తే , ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు కు వ్యతిరేకం గా కేసీఆర్ చేయగలిగినంతా చేస్తారనే భయం తెలంగాణ లోని సీమాంధ్రుల లోని అత్యధికుల్లో ఉన్నట్టు కనపడుతున్నది. అందువల్ల కూడా, బీఆర్ఎస్ పట్ల ‘తెలంగాణ ఆంధ్రుల’ సుముఖత అంతగా వ్యక్తం కావడం లేదు. దీనితో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా పనిచేస్తాయని భావిస్తున్న అనేక అంశాలలో ఇప్పుడు ‘ చంద్రబాబు గండం’ కూడా చేరిపోయింది .

అయితే, రాజకీయ మాయోపాయాలలో ఆరితేరిన కేసీఆర్ ; దీనిని ఎలా అధిగమిస్తారో చూడవలసి ఉంది. ఆయనకు ఇప్పటికే బీజేపీ తలపోటు,కాంగ్రెస్ తలపోటు కు ఇప్పుడు చంద్ర పోటు కూడా తోడైందనే చెప్పాలి . ‘చంద్ర హింస ‘ ఎపిసోడ్ లో బీజేపీ ఢిల్లీ పెద్దల భాగస్వామ్యం ఉండి ఉంటుందనే భావం సమాజం లో విస్తృతంగా వ్యాపించి ఉన్నందు వల్ల, తెలంగాణ ఆంధ్రుల ఓట్లలో అధిక శాతం బీజేపీ కి లభించే అవకాశమే లేదు. అందువల్ల, తెలంగాణ ఎన్నికల లో బీజేపీ విజయం సాధించే ప్రశ్నే లేదు. ఇప్పుడు, తెలంగాణ అసెంబ్లీ లో 1…,2…3… గా ఉన్న బీజేపీ సభ్యుల బలం – మహా అయితే రెండంకెల లోకి అడుగు పెట్టవచ్చు. రేపొద్దున్న – టీడీపీ తో బీజేపీ జత కట్టి తెలంగాణ లో పోటీ చేసినా బీజేపీ కి పెద్దగా సుఖం ఉండదు.

ఈ నేపథ్యం లో తెలంగాణ ఆంధ్రుల ఓట్లు కాంగ్రెస్ కు అధికంగా పోలయ్యే అవకాశాలను పరిశీలకులు కొట్టి పారేయడం లేదు. కారణం లేక పోలేదు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి -భౌతికంగా కాంగ్రెస్….., మానసికంగా కాంగ్రెస్ అనే భావం చాలా మందిలో ఉంది. తెలంగాణ లో టీడీపీ చెరువు ఎండిపోతున్నదనే దూరపు చూపుతో, కాంగ్రెస్ చెరువులోకి దూకేసిన తెలివైన చేప -రేవంత్ రెడ్డి అని రాజకీయ వర్గాల వారు చమత్కరిస్తుంటారు. అందువల్ల కాంగ్రెస్ తెలంగాణ లో గెలిస్తే; ఆ తరువాత నాలుగైడు నెలలకు జరగబోయే ఆంధ్ర ఎన్నికల్లో టీడీపీ కి శుభకర పరిణామం గా ఉంటుంది అనే భావన కూడా తెలంగాణ ఆంధ్రుల లో ఉంది. వీరిలో అత్యధికులకు కావలసింది కూడా అదే.

ఈ పరిస్థితుల్లో….; మొత్తం 119 స్థానాల్లో బీఆర్ఎస్ కు ఖచ్చితంగా 60…61 సీట్లు వస్తేనే – ప్రభుత్వం ఏర్పాటు చేయాల్లని కేసీఆర్ ను తెలంగాణ గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఏమాత్రం తగ్గినా, కొనుగోళ్ళ కు అవకాశం బీఆర్ఎస్ కు ఉండకపోగా ; బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన వారిలో కొందరికి రెక్కలొచ్చి ఎగిరిపోయే అవకాశాలు లేకపోలేదు. అలా కాకుండా ; బీజేపీ తోనో, కాంగ్రెస్ తోనో జత కట్టక తప్పని పరిస్థితి బీఆర్ఎస్ కు ఎదురైతే ; ముఖ్యమంత్రి పదవి ని కేసీఆర్ కు వదలరు. ఆ పదవిని – బీఆర్ఎస్ తో జత కట్టే పార్టీ ఎగరేసుకు పోతుంది.

ఈ సమీకరణాలను ఒకసారి సమీక్షించుకుంటే ; తెలంగాణ ఆంధ్రుల ఓటు ఎంత కీలకమో బీఆర్ఎస్ నేతలకు అర్ధం అవుతుంది. అందువల్లనే, ‘ చంద్ర గండం ‘ ను అధిగమించడానికి కేసీఆర్ ఏమి చేయబోతున్నారు అనేది ఆసక్తికరం గా మారింది. ‘మానిఫెస్టో’ రూపం లో తెలంగాణ పై ఓ సమ్మోహనాస్త్రాన్ని కేసీఆర్ సంధించారు. ‘మానిఫెస్టో’ లను ఎలా అమలు చేస్తారో నేతలు చెప్పరు. వాటి అమలుకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి, ఎలా సేకరిస్తారో చెప్పరు. మేనిఫెస్టో లకు చట్ట బద్ధత ఉండదు. జవాబుదారీ తనం ఉండదు. జనాన్ని బురిడీ కొట్టించగల తాయిలం ఆలోచన వస్తే ; ప్రకటించి వేయడమే.

తెలంగాణ లోని సీమంధ్రులు… కేసీఆర్ పట్ల గుర్రుగా ఉన్నదీ, లేనిదీ ఖ(క)మ్మం బరిలో గెలిచే వారిని బట్టి అంచనా వేయ వచ్చు. అక్కడ బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్ కుమార్ ; కాంగ్రెస్ తరఫున తుమ్మల నాగేశ్వర రావు బరిలోకి దిగుతున్నారు. అక్కడ బీజేపీ , ఇతర చిల్లర – మల్లర అభ్యర్థుల పేర్లు కూడా బ్యాలెట్ బాక్స్ పై ఉన్నప్పటికీ ; వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ అనడం లో సందేహం ఏమీ లేదు.
వీరిద్దరూ కమ్మ వర్గీయులే. ఖ (క)మ్మం లో పువ్వాడ అజయ్ గెలిస్తే, తెలంగాణ లోని సీమాంధ్రులలోని అత్యధికులు కేసీఆర్ పట్ల గుర్రుగా లేరనే భావనకు రావచ్చు.

కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు గెలిస్తే మాత్రం, కేసీఆర్…. ఒక్కసారి తన రాజకీయాన్ని పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ లో స్థిరపడిన ‘ సీమంధ్రులు’ తెలంగాణ కు ఒక “నెసెసరి ఈవిల్ “. వారు లేకుండా కుదరదు, వారి మనోభావాలను పరిగణన లోకి తీసుకోకుండానూ కుదరదు.

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

LEAVE A RESPONSE