Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభకు పట్టం ..శక్తి ‘సామర్థ్యా’నికి ఊతం ..!

  • రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కు దక్కిన అరుదైన గౌరవం
  • క్షిణాది రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలకు సీనియర్ సలహాదారుగా చంద్రశేఖరరెడ్డి
  • ఏపీఎస్ఈసీఎం మాజీ సీఈవో చంద్రశేఖరరెడ్డికి ప్రధాన బాధ్యలు
  • ఇంధ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి దక్కిన గౌరవం

విజ‌య‌వాడ‌, జులై 12: ఇంధనం.. ఈ పేరులోనే ధనం ఉంది. అలాంటి ఇంధనాన్ని పొదుపు చేస్తే.. రాష్ట్రానికి, దేశానికి ఎనలేని మేలు చేసినట్లే! ’ఇంధనం మూలం.. ఇదం జగత్’ అంటే అతిశయోక్తి కాదేమో! ఎందుకంటే ఇంధనం లేనిదే ఈ జగత్తు లేదు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్ఠాత్మకమైన రాష్ట్రపతి అవార్డు దక్కేలా చేశారు. ఇంధన సామర్థ్యంలో రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేశారు. ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో ఏపీని దేశానికే రోల్ మోడల్‌గా నిలిపేందుకు నిరంతరం శ్రమించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి ఇంధన సామర్థ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ సీఈవోగా పనిచేసిన సమయంలో తన అనుభవంతో, వినూత్న కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర కీర్తి ప్రతిష్ఠలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేశారు! ఆయనే ఎ.చంద్రశేఖర్‌రెడ్డి.

ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన చంద్రశేఖర్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత, సమర్థత, కార్యదక్షత, చిత్తశుద్ధిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ‘ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)’కు సీనియర్ సలహాదారుగా నియమించింది. ఈ ఏడాది మే 31న ఏపీఎస్ఈసీఎం సీఈవోగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు దశాబ్దాల పాటు విశేష సేవలందించారు.  చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి , డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి , రోశయ్య గారి హయాంలో దాదాపు 9 ఏళ్ళ పాటు చీఫ్ పీఆర్ఓ/ప్రెస్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించారు . తదనంతరం  పదేళ్ల పాటు  రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్  ఏపీఎస్ఈసిఎం సిఈ ఓ గా పనిచేసారు. ప్రథమ  స్థాయిలో 5 సార్లు జాతీయ స్థాయిలో ఇంధన పొదుపు అవార్డులను గెలుచుకున్నారు. ఇటీవలనే రాష్ట్ర ఇంధన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తో కలిసి రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు ను అందుకున్నారు.

ఇంధ‌న సామ‌ర్థ్య రంగంలో పదేళ్లకు పైగా ఆయ‌న చేసిన విశేష సేవలను గుర్తించిన ఈఈఎస్ఎల్.. దక్షిణ భారతదేశంలో వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ వ్యవహారాలకు సీనియర్ సలహాదారుగా నియ‌మించుకుంది. ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందించడంతోపాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో కేంద్ర ప్ర‌భుత్వ‌ ప్రతిష్ఠాత్మక అజెండాను స‌మ‌ర్థంగా రాష్ట్రంలో అమ‌లు చేయ‌డం ద్వారా చంద్రశేఖర్ రెడ్డి ‘ఆంధ్రా మోడల్’గా నిలిచారు.

ఏపీ విద్యుత్తు రంగంలో తన హయాంలో అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లకు  ఆయన ధన్యవాదాలు  తెలిపారు. అలాగే  ఏపీ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

దక్షిణ భారతంలో..
ఈఈఎస్ఎల్ హైద‌రాబాద్ కేంద్రంగా త‌న కార్య‌క‌లాపాలను నిర్వ‌హించ‌నుంది. ప్ర‌స్తుతం చంద్ర‌శేఖ‌రరెడ్డికి అప్ప‌గించిన బాధ్య‌త‌ల‌తో ఆయ‌న హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉంటూ ద‌క్షిణ భార‌తదేశంలో ఈఈఎస్ఎల్‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కార్య‌క్ర‌మాలు, వ్యాపారాల‌ను ప‌ర్య‌వేక్షిండంతోపాటు కొత్త వ్యాపారాలు చేసేందుకు అవకాశాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో కొత్త వ్యాపార అవకాశాల కోసం వ్యాపారాభివృద్ధి కార్యకలాపాలను నిర్వ‌హించ‌నున్నారు. అలాగే ల‌క్షద్వీప్‌, అండమాన్ & నికోబార్ దీవులు  వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈయ‌న ప‌రిధిలోకి రానున్నాయి. ఈఈఎస్ఎల్ ద‌క్షిణ భార‌త ప్ర‌తినిధిగా ఆయ‌న ఆయా రాష్ట్రాల్లోని వివిధ ప్ర‌భుత్వ శాఖ‌లు, ప‌ట్ట‌ణ‌, గ్రామీణ స్థానిక సంస్థ‌ల అధికారులు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌తో నిత్యం సంప్ర‌దింపులు జ‌రుపుతూ ఈఈఎస్ఎల్ వ్యాపార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేయ‌నున్నారు.

నాలుగేళ్లలో రూ.4 వేల కోట్ల ఆదా..
రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, కీలక శాఖల సహకారంతో ఏపీఎస్ఈసీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో చంద్రశేఖరరెడ్డి ఏపీలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగైదేళ్లలో వివిధ శాఖల సమన్వయంతో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను సమర్థంగా అమలు చేశారు. తద్వారా ఏపీ సుమారు రూ.4000 కోట్ల విలువైన 5600 మిలియన్ యూనిట్ల ఇంధనాన్ని ఆదా చేయ‌గ‌లిగింది. ఆయ‌న నేతృత్వంలో ఇంధన పొదుపును సాధించడంలో ఉత్తమ పనితీరుకు గాను ఏపీకి రాష్ట్రపతి నుంచి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు-2022’తో సహా ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.412 కోట్ల విలువైన‌ 30కి పైగా ఇంధన సామర్థ్య పెట్టుబడి ప్రాజెక్టులను గుర్తించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడానికి సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) 5 శాతం వడ్డీ రాయితీని అందించాలని చంద్రశేఖరరెడ్డి సూచించారు. అనేక సమావేశాల్లో ఆయన చేసిన ఈ సూచన మేరకు.. 5 శాతం వడ్డీ రాయితీని అందించే విషయాన్ని కేంద్ర విద్యుత్తు శాఖ, వ్యయ శాఖ, ఆర్థిక‌ శాఖలు తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఇది జరిగితే ఏపీ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల ఎంఎస్ఎంఈలు ఇంధన సామర్థ్య ప్రాజెక్ట్ అమలు కోసం రూ.2500 కోట్ల రాయితీని పొందే అవకాశం కలుగుతుంది. ఇక ఎనర్జీ కన్జర్వేషన్ సెల్‌ల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో ఇంధన పొదుపు, శక్తి సామర్థ్య కార్యక్రమాల విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారు. చంద్రశేఖరరెడ్డి చేసిన ఈ మంచి పనిని బీఈఈ మాజీ డీజీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ గుర్తించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ  (బీఈఈ) ఏర్పాటు చేసిన నేషనల్ మీడియా కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా ఎంపిక చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ఇంధన పరిరక్షణ మిషన్ కు దక్కిన అరుదైన గౌరవం
ఈఈఎస్ఎల్‌ దక్షిణ భారత వ్యవహారాలకు సీనియర్ సలహాదారుగా తనను నియమించడం ఎంతో సంతోషకరమని చంద్రశేఖరరెడ్డి అన్నారు. ఇది ఏపీఎస్ఈసిఎం దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.. ఈఈఎస్ఎల్‌తో కలిసి పనిచేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈఈఎస్ఎల్‌ సీఈవో విశాల్ కపూర్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంధన సామర్థ్య రంగంలోని అత్యుత్తమ సంస్థల్లో ఈఈఎస్ఎల్ ఒకట‌ని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ గొప్ప సంస్థలో పనిచేసే అవకాశం కలగడం తన అదృష్టమ‌ని చెప్పారు. ఇప్పటి వరకు భారతదేశం అంతటా ఈఈఎస్ఎల్‌ ద్వారా 36.86 కోట్ల ఎల్ఈడీ బల్బులు, 72.18 లక్షల ఎల్ఈడీ ట్యూబ్ లైట్లుతోపాటు 23.59 లక్షల ఇంధ‌న‌ సామర్థ్య ఫ్యాన్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఫలితంగా 9,789 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ను నివారించడంతోపాటు సంవత్సరానికి 48.42 బిలియన్ కిలోవాట్ల ఇంధన ఆదా అవుతుందని అంచనా చేసినట్లు చెప్పారు. ఏడాదికి 39.30 మిలియన్ టన్నుల కార్బ‌న్ డయాక్సైడ్‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌న్నారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల విద్యుత్తు బిల్లులు ఏటా రూ.19,333 కోట్ల మేర ఆదా అవ్వ‌నున్నట్లు తెలిపారు.

ఈఈఎస్ఎల్‌ ఆంధ్రప్రదేశ్‌లో అనేక ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తోందని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. వీధి దీపాల జాతీయ కార్యక్రమం, వ్యవసాయ పంపుసెట్ల కార్యక్రమం, గ్రామ ఉజాల కార్యక్రమాన్ని అమలు చేసినట్లు చెప్పారు. తెలంగాణలోనూ ఈఈఎస్ఎల్ పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జీహెచ్ఎంసీలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేసిందన్నారు.

LEAVE A RESPONSE