ఎంపి విజయసాయిరెడ్డి
డిసెంబరు,9.: ఇతర దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ‘ప్రభావం’తో సొంత రాష్ట్రంలో ఏ.పీలో అధికారం తమకు అందివస్తుందనే భ్రమల్లో చంద్రబాబు అండ్ కంపెనీ ఉందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు..ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలుగా అధికారం దూరం కావడంతో తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పార్టీ నేతలకు, ఆయన కులపెద్దలకు మెదళ్లు పనిచేయడం పూర్తిగా మానివేసినట్టు కనిపిస్తున్నాయని అన్నారు. మొన్న జరిగిన పొరుగు తెలుగు రాష్ట్రం శాసనసభ ఎన్నికల్లో దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రాంతీయపక్షం ఓడిపోతే–దాని ‘ప్రభావం’తో ఏపీలో కూడా పాలక పార్టీ పరాజయం పాలవుతుందనే భ్రమల్లో తేలియాడుతున్నారని దుయ్యబట్టారు.
ఆ మేరకు పక్క రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఓడిపోవాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నారని చెప్పారు. 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బాబు గారి పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ద కాలంగా అధికారానికి దూరమైన జాతీయపక్షం తెలంగాణ ఎన్నికల్లో గెలవడానికి తమ వంతు కృషి చేసినట్టు నటించిందని అన్నారు. రాజస్తాన్లో మాదిరిగానే కర్ణాటకలో ప్రతి అయిదు సంవత్సరాలకూ పాలకపక్షాన్ని అధికారం నుంచి తొలగించే ఆనవాయితీ కన్నడిగులకు ఉందని గుర్తు చేశారు. దక్షిణాదిలో లేదా తూర్పు ప్రాంత సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు ఒకదానితో ఒకటి పొంతన ఉండవని ఆయన అన్నారు.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న పరిస్థితి ఉందన్నారు. మరి ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితం తెలంగాణపై పడిందని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం తోటి తెలుగు రాష్ట్రంలో ఐదు నెలలకు జరిగే శాసనసభ ఎన్నికలపై పడుతుందనే అసంబద్ధమైన, భ్రమాజనిత ఆశలతో కూడిన లోకంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం సహా ఆ పార్టీ నేతలందరూ విహరిస్తున్నారని మండిపడ్డారు.
బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించడం చేతకాని టీడీపీకి పక్కచూపులే దిక్కు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన ఆంధ్రప్రదేశ్లో 2019 మే 30 నుంచీ దిగ్విజయంగా సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన అందరికీ తెలిసిందెనాని చెప్పారు. ప్రజల్లో అసంతృప్తికి, ప్రభుత్వంలో అవినీతికి తావులేని ఏపీలో పాలకపక్షానికి సహకరించాల్సింది పోయి తెలుగుదేశం, దాని అగ్రనేత నిరంతరం విషప్రచారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. వందలాది కోట్ల అవినీతి కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచినప్పుడు ఆంధ్రా జనం విషయం అర్ధం చేసుకున్నారని చెప్పారు. పార్టీ సీనియర్ నేతలను పక్కనబెట్టి అగ్రనేత కుటుంబ సభ్యుల నాయకత్వాన టీడీపీ చోటామోటా నాయకులు, కార్యకర్తలు, కుల పెద్దలు ఎంత మొత్తుకున్నా ప్రజలు వారికి సంఘీభావం ప్రకటించలేదని గుర్తు చేశారు.
టీడీపీ అధ్యక్షుడికి సానుభూతి వ్యక్తం చేయనే లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన తెలంగాణ అసెంబ్లీ మూడో ఎన్నికల్లో– తమ అగ్రనేత కాపురముంటున్న హైదరాబాద్లోని టీడీపీ బృందాలు దుర్మార్గ ప్రచారానికి తెరలేపాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతి కుంభకోణంలోని విషయాలతో సంబంధం లేకుండా చంద్రబాబు అరెస్టుకు పక్క తెలుగు రాష్ట్రం ప్రాంతీయపక్షం అగ్రనేత ఒత్తిడి, ప్రోత్సాహంతోనే కుట్ర జరిగిందనే ప్రాపగాండా తెలంగాణలో టీడీపీ శ్రేణులు పోలింగ్ తేదీ వరకూ చేస్తూనే ఉన్నాయని మండిపడ్డారు. వారి లక్ష్యమంతా ఒక్కటే. ఒక తెలుగు రాష్ట్రంలోని పాలక ప్రాంతీపక్షం అంసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే, దాని ‘ప్రభావం’తో రెండో తెలుగు రాష్ట్రంలో పాలకపార్టీ పరాజయం చెందుతుందనే ఉన్మాదంతో కూడిన లెక్కలు టీడీపీ వారిని గత నెల రోజులుగా నడిపించాయని అన్నారు.
2014లో విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, పాలనా పరిస్థితులు ఒకే తీరున ఉండవని, ఎవరి సమస్యలు వారివనే మౌలిక సత్యాన్ని కూడా మరచి టీడీపీ తప్పుడు అంచనాలతో కలల్లో విహరిస్తోందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా అధికారం పోయిందనే దిగులుతో, ఉన్మాదంతో టీడీపీ అగ్రనేత నుంచి చిన్న చిన్న నాయకుల వరకూ వ్యవహరిస్తున్నారు. వారికి ఆలోచించి శక్తి నశించిపోయింది. కేవలం పాలకపక్షంపై తెలంగాణ ప్రజల్లో మార్పు వస్తే చాలు తమకు ఏపీలో అధికారం 2024 ఏప్రిల్–మే ఎన్నికల్లో సునాయాసంగా దక్కుతుందనే దారితప్పిన అంచనాతో చంద్రబాబు అండ్ కంపెనీ బతుకుతోందని చెప్పారు. ఇకనైనా పొరుగు దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి తమకు సానుకూలమైన భాష్యాలు చెప్పుకునే ధోరణి నుంచి చంద్రబాబు పార్టీ ఎంత తొందరగా బయటపడితే ఆయనకూ, ఆయన పార్టీకి అంత మంచిదని సలహా ఇచ్చారు..