-ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమో?
– చంపిన వాళ్లను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?
– ఎంతమంది కలిసినా వైసీపీకి నష్టమేమీలేదు
– అందరినీ కలిపి ఒకేసారి ఓడిస్తాం
– జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరు
– టీడీపీ,జనసేన పొత్తుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ కలయిక అపవిత్రమైనదని వ్యాఖ్యానించారు. ఎంతమంది కలిసినా వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని, జగన్ అందరినీ కలిపి ఒకేసారి ఓడించే అవకాశం వస్తుందన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే… బాబు-పవన్ భేటీపై విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు, పవన్ కలయిక చారిత్రక అవసరం అని పేరు పెడుతున్నారు. చంద్రబాబు,పవన్ కలవడం అక్రమ సంబంధం. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. చంపిన వాళ్లను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబు ఇంటికి వెళ్లారు.
విశాఖలో మంత్రులపై జనసేన దాడి చేస్తే ఆ రోజు చంద్రబాబు.. పవన్‌ని పరామర్శించారు. చంద్రబాబు, పవన్ అక్రమ సంబంధాన్ని సక్రమం అని చెప్పడానికి కారణాలను సృష్టిస్తున్నారు. టీడీపీ, జనసేన కలవడం శుభ పరిణామం అని సీపీఐ రామకృష్ణ అంటున్నారు. రేపు సీపీఐ.. బీజేపీతో కలుస్తుందేమో?, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పగటి వేషాలు వేస్తున్నారు.
ఎరుపు, కాషాయం కలిసి పసుపు అవుతుందేమో?
ఎంత మంది కలిసినా మంచిదే.పంది కొక్కులు, ఎలుకలు, అన్నీ కలిస్తే ఎవరి విలువలు ఏంటో మరోసారి బయటపడుతుంది. అందరినీ కలిసి ఒకేసారి ఓడించే అవకాశం కూడా జగన్ కు వస్తుంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో లేరు. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ప్రకటనలు చేస్తున్నారు.’’ అని సజ్జల ఎద్దేవా చేశారు.