-కపట ప్రేమ నటిస్తూ దుష్ప్రచార కథనాలు
-ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు
-వాటిని తిప్పి కొడతాం. ప్రజలకన్నీ వివరిస్తాం
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటన
విశాఖపై అదే విషం:
విశాఖ గర్జన తర్వాత జరిగిన పరిణామాలు. అమరావతి టు అరసవెల్లి డ్రామా యాత్రకు తెర. కోర్టులో విచారణ. కోర్టు అనుమతి ఇచ్చినా, ముఖం చెల్లక యాత్రను తిరిగి కొనసాగించలేదు. అందుకు కారణం.. అది పాదయాత్ర కాదు. ఒక దండయాత్ర అని ఉత్తరాంధ్ర వాసులు తేల్చి చెప్పారు కాబట్టి.. వారు తమ యాత్ర తాత్కాలికంగా విరమించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మాభిమానం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న వారి నినాదం ముందు వారు తప్పకుండా తలవంచాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆ యాత్ర విఫలమైందని, ఒక పక్క పరిణామాలు చూసిన తర్వాత.. వారి ఆలోచన ఎలా ఉన్నప్పటికీ, చంద్రబాబుకు సంబంధించిన పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి దారుణంగా వార్తలు రాస్తున్నాయి. ఇవాళ ఈనాడు విశాఖ మీద విషం కక్కుతూ వార్త రాసింది. రుషికొండపై నిర్మాణాల గురించి దారుణంగా ఏవేవో రాశారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సీపీఐ నేత కె.నారాయణ స్వయంగా పర్యటించి, రుషికొండ సందర్శించి, అక్కడ కేవలం ప్రభుత్వ నిర్మాణాలు మాత్రమే సాగుతున్నాయని చెప్పారు. అయితే ఆయన మాటలు చంద్రబాబునాయుడికి, ఈనాడుకు నచ్చలేదు. దీంతో ఈ రాష్ట్రంలో వాళ్ళు తెలుగువాళ్ళు అయితే లాభం లేదని, ఎక్కడో రాజస్థాన్ లో ఉన్న రాజేంద్రసింగ్ అనే ఈనాడు వారి మిత్రుడ్ని పట్టుకువచ్చారు. రాజేంద్రసింగ్ అనే వ్యక్తి ఈనాడుకు, రామోజీరావుకు దాదాపు 20 ఏళ్లుగా చాలా సన్నిహితుడు. ఆయనను తీసుకొచ్చి, చూపించి, ఏదో మాట్లాడించారు.
అప్పుడెందుకు స్పందించలేదు?:
మరి ఇదే రాజేంద్రసింగ్.. అమరావతి ప్రాంతంలో రాజధాని పేరుతో ఏటా మూడు పంటలు పండే అత్యంత సారవంతమైన భూమిని వేలకు వేల ఎకరాలు సేకరించినప్పుడు ఎక్కడికి పోయారు? అప్పుడు రామోజీరావు ఎందుకు స్పందించలేదు? ఆయన ఎక్కడికి వెళ్లిపోయారు? ఎందుకు వచ్చి కన్నీరు కార్చలేదు?. అంటే ఈ ప్రాంతంలో ఏం జరిగినా ఫరవాలేదు. పర్యావరణానికి విఘాతం కలిగినా ఫరవాలేదు. వారికి కావాల్సిన భూమి సేకరించినా, ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు జరిగినా, ఏది చేసినా సరే, వారి కంటికి, ఆ పత్రికకు కనబడవు. అదే విశాఖలో నిర్మాణాలు జరిగినా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, రాష్ట్ర ప్రజలకు ఏమీ అనిపించదు కానీ.. బయటి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబునాయుడుకు, రామోజీరావుకు, పవన్‌కళ్యాణ్‌కు కన్నీళ్లు వస్తున్నాయి.
ప్రేమ ఉన్నట్లు డ్రామాలు:
రుషికొండపై జరుగుతున్నవన్నీ పర్యాటక శాఖకు చెందిన నిర్మాణాలే. కానీ గతంలో అక్కడ అలా ఏ నిర్మాణాలు జరగనట్లు, ఇప«్పుడు నిర్మాణాలతో అక్కడ నష్టం జరుగుతోందని, ఆ ప్రాంతం మీద వారికేదో ప్రేమ ఉన్నట్లు చేస్తున్న డ్రామా చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. రుషికొండలో నాలుగు నిర్మాణాలు జరిగితే, రాష్ట్రానికి, దేశానికి ఏదో నష్టం జరిగినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విశాఖలో సముద్రం చేరువలో, తీరంలో అనేక కొండలు ఉన్నాయి. వాటన్నింటిపై అనేక నిర్మాణాలు ఉన్నాయి. చివరకు రుషికొండ పక్కనే ఉన్న కొండపై టీటీడీ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఇంకో కొండపై రామానాయుడు స్టుడియో ఉంది.
రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా నిర్మించారు?:
చివరకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లే దారి కోసం రామోజీరావు ఎన్ని కొండలు పిండి చేశారు. ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం ఎన్ని గుట్టలు, కొండలు తవ్వలేదు? అక్కడ నిర్మాణాలు ఎలా చేశారాయన?
అదే వారి టార్గెట్:
విశాఖ వేదికగా ఏ నిర్మాణాలు జరగకూడదు. అక్కడ అభివృద్ధి పనులు ఉండొద్దు. ఆ ప్రాంతానికి పేరు రావొద్దు. అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావొద్దు. అదే వారి టార్గెట్. అందుకే ఎవరెవరినో తీసుకొస్తారు. అక్కడ నిలబెట్టి ఫోటో తీస్తారు. కావాల్సిన కవితలు రాస్తారు. మరి రాజేంద్రసింగ్‌కు ఇప్పుడు కన్నీళ్లు వస్తున్నాయంటున్నారు కదా? మరి అమరావతిలో పచ్చటి పంట పొలాలు నాశనం చేసినప్పుడు ఆయనకు కన్నీళ్లు ఎందుకు రాలేదు? అప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు? అంటే ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ విశాఖ మాత్రమే కాదు.. ప్రపంచంలో, దేశంలో చాలా చోట్ల సముద్ర తీరాల్లో నగరాలు ఉన్నాయి. వాటిలో నిర్మాణాలు కొండలమీదే జరిగాయి.
అక్కడ నిర్మాణాలు కొత్త కాదు:
నిజానికి రుషికొండపై నిర్మాణాలు కొత్తవి కావు. ఇప్పటికే అక్కడ పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్ట్ ఉంది. అది చాలా పాతది కావడంతో, అక్కడ పర్యాటక శాఖ కొత్తగా నిర్మాణం చేపట్టింది. దీంతో ఆ ప్రాంతం అతలాకుతలం అవుతోందని, దాని వల్ల రాష్ట్రానికి, దేశానికి ఏదో జరుగుతుందని రాస్తున్నారు. అంటే ఏదో విధంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏదో విధంగా దెబ్బ తీయాలని, తద్వారా అమరావాతిలో తాము కొన్న భూముల ధరలు కాపాడుకోవాలన్న తపన తప్ప, వారికి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు.
కనీసం ఒక్కటైనా చేశారా?:
ఉత్తరాంధ్రపై వారికి ఏనాడూ ప్రేమ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఉత్తరాంధ్రకు కానీ, విశాఖకు కానీ ఒక్కటంటే ఒక్క మంచి పని చేశాడేమో చెప్పమనండి. విశాఖ అభివృద్ధి చెందింది అంటే కేవలం వైయస్సార్ హయాంలోనే. ఐటీ కంపెనీలు వచ్చాయి. బీచ్ రోడ్ 4 లైన్లుగా మార్చారు. ఇప్పుడు దాన్ని 6 లైన్లుగా మారుస్తూ, భోగాపురం వరకు విస్తరిస్తున్నాం. చంద్రబాబు ఒక్కటంటే ఒక్క పని చేయలేదు. ఇవాళ అక్కడ అభివృద్ధి జరుగుతుంటే, ఒకటే ఏడుపు.
పరిశ్రమలపైనా దుష్ప్రచారాలు:
మరో స్టోరీ. పరిశ్రమలపై ఈనాడులో రాశారు. రాష్ట్రం నుంచి అమరరాజా కంపెనీ, కట్ డ్రాయర్ కంపెనీ పోయాయని ఏదేదో రాశారు. కానీ నిజానికి రాష్ట్రంలో ఏం జరుగుతోందని, ఏయే పరిశ్రమలు వస్తున్నాయనేది ప్రజలకు తెలుసు. ఇవాళే ఎస్‌ఐపీబీ మీటింగ్ జరిగింది. అందులో దాదాపు రూ.24 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రేపు క్యాబినెట్ మీటింగ్‌లో వాటిపై నిర్ణయం తీసుకోబోతున్నాం. కానీ చంద్రబాబు మాదిరిగా ఆర్భాట ప్రచారం చేసుకోవడం లేదు. రాష్ట్రానికి ఏకంగా రూ.16 లక్షలు, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి, మూడు పెద్ద పెద్ద సమావేశాలు పెట్టారు. కానీ చివరకు వచ్చిన పెట్టుబడి ఎంతంటే కేవలం రూ.34 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే. లెక్కలు స్పష్టంగా ఉన్నాయి.
వారు ప్రకటించకున్నా..:
అమరరాజా కంపెనీ గురించి ఇంతకు ముందే చెప్పాం. తిరుపతిలో ఉన్న కంపెనీ ప్రమాణాలు పాటించలేదు. దానిపై కోర్టు ఆదేశాలు ఇచ్చినా, అమలు చేయలేదు. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేయడం జరిగింది. తాము తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నామని అమరరాజా కంపెనీ ప్రకటించిందా?. లేదు కదా?. వారు మాట్లాడకుండా, చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారు?
మాకు ఆ ఉద్దేశం లేదు:
నిజానికి మేము వేధించాలంటే అమరరాజా కంపెనీపై ఎందుకు పడతాం? చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీపైనే పడతాం కదా? ఆయన ఇక్కడ చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు కదా? హెరిటేజ్ కంపెనీ మొన్నటి వరకు మా నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఉంటే, మూడు నెలల క్రితం వరకు పన్నులు చెల్లించలేదు. పరిశ్రమల విషయంలో రాజకీయాలు చేసే ప్రసక్తి లేదు. ఒక్క హెరిటేజ్ మాత్రమే కాదు.. ఈనాడు ప్రింటింగ్ ప్రెస్‌లు, ఆంధ్రజ్యోతి ప్రెస్‌లు లేవా ఇక్కడ? ప్రియా పచ్చళ్ల కంపెనీ కూడా ఆంధ్రలోనే ఉంది కదా?
మీ వల్లే నష్టం జరుగుతోంది:
జాకీ కంపెనీ కూడా టీడీపీ హయాంలోనే తరలి పోయింది. ప్రతిదీ ఆన్‌పేపర్‌లో ఉంది. అబద్దాలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మబోరు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరుగుతాయి. వాటి వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచన, చిత్తశుద్దితో ప్రభుత్వం పని చేస్తోంది. కానీ మీరు చేస్తున్న దుష్ప్రచారం, బ్రాండింగ్ వల్ల, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు చేస్తున్న విమర్శల వల్లనే నష్టం జరుగుతోంది. రాష్ట్రానికి వచ్చే ఏ పరిశ్రమకైనా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది.
మీ ప్రయత్నాలు తిప్పికొడతాం:
తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కాబట్టి, చంద్రబాబు సీఎంగా లేరు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఊర్కోబోము. అన్నీ తిప్పి కొడతాం. ప్రజలకు ప్రతి ఒక్కటి వివరిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక పురోగతి కోసం కృషి చేస్తాం. గతంలో చంద్రబాబు 1995 నుంచి 2004 మధ్య ఏకంగా 58 కంపెనీలు అమ్మేశారు. అవన్నీ మర్చిపోయి, ఇప్పుడు ఈ ప్రభుత్వంపై అర్ధం లేని విమర్శలు మానాలి.
మీకసలు రాష్ట్రంపై ప్రేమ ఉందా?:
ఇప్పటికైనా మీరంతా కలిసి, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం మానాలి. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, పవన్‌కళ్యాణ్.. వీరెవ్వరూ రాష్ట్రంలో ఉండరు. వారికి అసలు రాష్ట్రంపై ప్రేమ ఉందా? వారు తమ 5 ఏళ్ల పాలనలో తెచ్చిన పెట్టుబడుల కంటే, ఈ మూడేళ్లలో మేము తీసుకొచ్చిన పెట్టుబడులు ఎక్కువ. కోవిడ్‌తో ప్రపంచమే రెండేళ్లు అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
పవన్‌కళ్యాణ్ ప్రచార రథం వారాహికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది ఇక్కడికి వస్తే, ఇక్కడి నియమావళి ప్రకారం ఉందా అని చూస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుంది. ఇదే జరగబోయేది. చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిపోయింది. ఆయన ఎప్పుడు, ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదు. తనకు వచ్చేవే చివరి ఎన్నికలు అన్నాడు. మళ్లీ మాట మార్చి, ఆ ఎన్నికలు చివరి రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని అన్నాడు. ఎవరు సైకో అనేది ప్రజలకు తెలుసు. అన్నేళ్లు సీఎంగా పని చేసి, సొంత తమ్ముడిని ఛైన్లతో బంధించిన వ్యక్తిని సైకో అంటారా? లేక ఇంకా ఏమంటారు?