Suryaa.co.in

Andhra Pradesh

చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు చిల్లర వేషాలు

– ఏపీకి అంతర్జాతీయ పెట్టుబడులు
– సత్ఫలితాలిచ్చిన దుబాయ్,దావోస్,జర్మనీల్లో రోడ్ షోలు
-భారీ పరిశ్రమలకు కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా
– ట్విట్టర్ లో ఎంపి విజయసాయిరెడ్డి

అన్న క్యాంటీన్స్ పేరుతో పబ్లిక్ స్థలాలు ఆక్రమించి రచ్చ చేయడం, డ్రామాలు వేయడం ఏంటి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.పలు అంశాలపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలకు సేవ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్దె భవనాల్లో అన్న క్యాంటీన్స్ పెట్టుకోవాలని సూచించారు. రోడ్లు మీద మీ ఇష్టానికి ఎక్కడపడితే అక్కడ టెంట్లు వేస్తామంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు మీ చీప్ పబ్లిసిటీ కోసం చిల్లర వేషాలు వేయవద్దు ఆయన హెచ్చరించారు.

పెట్టుబడుల ఆకర్షణకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అంతర్జాతీయ రోడ్‌షోలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. దుబాయ్‌ ఎక్స్‌పో ద్వారా అమెరికాకు చెందిన మల్క్‌ హోల్డింగ్స్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిందని వెల్లడించారు. దావోస్‌ సదస్సులో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగిందని పేర్కొన్నారు. తాజాగా జర్మనీ హాన్‌ఓవర్‌ మెస్సే ట్రేడ్‌ ఫెయిర్‌లోనూ జర్మనీ, ఇజ్రాయిల్‌లకు చెందిన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు.

భారీ పరిశ్రమలకు శ్రీసత్యసాయి జిల్లా కేంద్ర బిందువుగా మారిందని చెప్పారు. ఇప్పటికే కియా కార్ల పరిశ్రమతోపాటు అనేక అనుబంధ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని ఆయన గుర్తు చేశారు. మరోవైపు సోమందేపల్లి మండలం గుడిపల్లిలో ఎలక్ట్రిక్‌ బస్సుల బాడీ తయారీ యూనిట్‌ నెలకొల్పేందుకు ‘వీర వాహన ఉద్యోగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. దాదాపు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE