– పోలీసు వ్యవస్థ తన ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది
– అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని రాష్ట్రం కోడై కూస్తోంది
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన నాటి నుండి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. పోలీసు వ్యవస్థ తన ఉనికినే కోల్పోయింది. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా తయారవడం బాధాకరం. అనేకసార్లు పోలీసు అధికారులను హెచ్చరించాం. అయినా పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులేదు. అధికార పార్టీ వారి కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ పనిచేస్తోందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. స్పందించాల్సిన చోట పోలీసు వ్యవస్థ స్పందించకపోవడం బాధాకరం. ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మా నడవడిక బాగుందని చెప్పుకోవడంలేదు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ ని చంపి కారులో తీసుకొచ్చి మృతుడి ఇంటిముందర పడేసి వెళ్లాడంటే అతడికి ఎంత ధైర్యం? పోలీసు వ్యవస్థ గురించి కించిత్తు కూడా ఆలోచించకుండా పెళ్లిళ్లకు, పేరంటాలకు తిరుక్కుంటుంటే ఏమనాలి? పోలీసు వ్యవస్థ గురించి కించిత్తుకూడా భయంలేదు. పోలీసులు అతన్ని ఇంటరాగేట్ చేయాల్సింది. మా పోలీసేకదా, నన్నేం చేస్తారు అనే ధీమాతో అనంతబాబు వ్యవహరించాడు.ఈ రోజునుంచైనా మేం చట్టప్రకారం నడుస్తామని, . మా విద్యుక్త ధర్మాన్ని మేం చక్కగా నిర్వర్తిస్తామని చంద్రబాబునాయుడు, వర్లరామయ్యలకు తెలపాలి.
శిరీషను అలాగే చేస్తాం, అనంతబాబును ఇలాగే చేస్తామని చెప్పగలరా? ఎందుకింత దిగజారి వ్యవహరిస్తున్నారు? బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాం. హేళన చేయాలని మాట్లాడటంలేదు. మీ బాధ్యతలను మీకు గుర్తు చేయాలనేదే మా తపన. గంటపాటు ప్రెస్ మీట్ పెడితే మాట్లాడలేదు. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత డీజీపీకి ఉంది. అడిషనల్ డీఐజీ, సీఐడీకి ఉంది. ధైర్యాన్ని కోల్పోవడానికి కారణమేంటి? బాబాయి హత్య కేసు రోజు రోజుకి నీరుగారిపోతోంది. హత్య కేసులో ముద్దాయిలను వెలికితీయడానికి ఎందుకు జాప్యం జరగడానికి లోకల్ పోలీసులే కారణం.
సీబీఐకి సహాయ నిరాకరణ చేస్తున్నా రు. ముఖ్యమంత్రిని చంపిందెవరో పెద్దలకు తెలుసు. కడప జిల్లాతో పాటు యావత్ రాష్ట్రం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గగ్గోలు పెడుతోంది. అందుకే ఆలస్యమౌతోంది. నాడు పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలైన మొద్దుసీను, డాక్టర్ సాంబశివరావు, ఓంప్రకాశ్, పటోళ్ల గోవర్థన్ రెడ్డి చనిపోయినట్లే నేడు బాబాయి హత్య కేసులో శ్రీనివాసరెడ్డి, గంగిరెడ్డి, గోవర్థన్ రెడ్డి చనిపోవటం ఆశ్చర్యంగా ఉంది. పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిల మరణంలో ఉన్న అదృశ్య హస్తమే ఇప్పుడు బాబాయి హత్య కేసులో చనిపోయినవారిపై ఉందా? . ఈ మరణాలు చూస్తుంటే ఇదికూడా ఆ కేసులాగే అయిపోగలదు. ఆ కేసులో ముద్దాయిలను గుర్తించారు. ఇందులో ముద్దాయిలను గుర్తించే అవకాశం కూడా లేకుండా చేశారు. పరిటాల రవిని చంపిన వ్యక్తులే బాబాయిని చంపారా అనే అనుమానం కలుగుతోంది.
డీజీపీ తనకు పూర్తి బాధ్యతలు లేవంటున్నారు. పట్టంచుకోవడంలేదు. క్లిష్టమైన కేసు దర్యాప్తులు చేయాల్సిన సీఐడీ .. నిజానిజాలు బయటికి రాని కేసులను సీఐడీకి అందజేస్తారు. ప్రతిపక్షాల్ని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఉన్నట్లుగా సీఐడీ ఉన్నట్లు తోస్తోంది. అధికార పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చడం కోసం ఉన్నట్లుంది. సీఐడీ శాఖ జనాల్లో అభాసుపాలౌతోంది. పోలీసు అధికారులు మీ పోస్టింగుల కోసం రాజకీయ నాయకుల కాళ్లకింద పడొద్దు.ట్రాన్స్ ఫర్స్ వస్తాయని భయపడొద్దు. దళితులపై అత్యాచారాలు జరుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగాకూడా లేదు. దళితులమీదే ఎస్సీ, ఎస్టీ యాక్టు పెట్టిన ఘనత ఈరాష్ట్ర పోలీసులకే దక్కింది.
దళిత రైతులకు బేడీలు వేసి ఎస్సీ, ఎస్టీ యాక్టు పెట్టి పెరేడ్ చేయించిన ఘనత ఈ పోలీసు వ్యవస్థకు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. దళిత రైతులకు బేడీలు వేసిందెవరనే విషయాలను దర్యాప్తు చేయాల్సిన బాధ్యత సీఐడీపై ఉంది. పోలీసు స్టేషన్ లో ఓ దళితుడికి శిరోముండనం జరిగిన కేసును దర్యాప్తు చేయాలి. అసలు ముద్దాయిలను బయటికి తీయాల్సిందిపోయి ఏదో పోస్టింగులు పెట్టారని మాటి మాటికి నోటీసులిస్తూ ప్రత్యర్థుల్ని వేధించడం సరైన విధానం కాదు. పోలీసు వ్యవస్థ ఉనికిని పోగొట్టొద్దని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి, సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ ని కోరుతున్నాను. ఏపీ పోలీసు వ్యవస్థకు దేశంలోనేకాదు ప్రపంచ వ్యాప్తంగా స్కాట్ లాండ్ యాడ్ దృష్టిలోకూడా మంచి పేరుంది.
అధికార పార్టీలు శాశ్వతంకాదు. వ్యవస్థ గౌరవాన్ని పోగొట్టొద్దు. చిన్న చిన్న సౌలభ్యాల కోసం పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టకండి. ఏపీ పోలీసు మ్యాన్యువల్ వ్యవస్థ ముఖ్యం. పోలీసు వ్యవస్థ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలి. వారం రోజుల్లో అనేక ఫిర్యాదులు ఇచ్చాం. ఒక్క ఫిర్యాదును కూడా స్వీకరించినట్లుకానీ, వాటిపై చర్యలు తీసుకున్నట్లుగానీ ఇంతవరకు మాకు సమాచారం లేదు.ఇప్పటికైనా మేమిచ్చిన కంప్లైట్స్ ఏమయ్యాయని సీఐడీ ఛీఫ్ ను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. మేమిచ్చినవి ఒకవేళ తప్పుడు ఫిర్యాదులైతే తప్పుడు ఫిర్యాదులను కొట్టిపారేస్తున్నామని ధైర్యంగా చెప్పాలి. స్వయంగా 27 ఫిర్యాదులు ఇచ్చాను, చర్యలు లేకపోవడం మమ్మల్ని అవహేళన చేయడానికి నిదర్శనం. మీ చట్టం అందరికీ ఒకలా ఉండదా? సీఐడీకి సపరేట్ రాజ్యాంగమేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నాను.
బాబాయి కేసు మోద్దాయిలెవరో తేల్చాలి. ముఖ్యమంత్రే అడ్డుపడుతున్నారని రాష్ట్రమంతా అనుకుంటోంది. నేను అడ్డుపడటంలేదు. వీరే అసలు ముద్దాయిలు అని సీఎం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సీబీఐకి సహకరిస్తున్నామని చెప్పగలరా? సీబీఐనే బెదిరించడం హాస్యాస్పదం. జగన్ నేతృత్వంలో నడుస్తున్న రాష్ట్ర పోలీసు వ్యవస్థపై సీబీఐవారు హైకోర్టును ఆశ్రయించారు. డీఐజీ, ఇతర సీనియర్ అధికారులు గుండెపై చేయివేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవా లి. సీబీఐ డ్రైవర్ ని ‘‘ నువ్వు కనిపిస్తే బాంబులు వేస్తాం’’ అని బెదిరించడం ఎంతవరకు సమంజసం?
సీబీఐ దర్యాప్తు జరగకూడదనే ఆలోచన ముఖ్యమంత్రిదో? విజయసాయిరెడ్డిదో, డీజీపీదో అర్థం కావడంలేదు. సోషల్ మీడియా కేసుల దర్యాప్తుకే పరిమితమైన సీఐడీ మేం చేసే ఫిర్యాదులపై ఎందుకు స్పందించడంలేదు? వైసీపీ గూండాలకు భయపడి పల్నాడు జిల్లా ఆత్మకూరు నుంచి వలస వెళ్లిన మాదిగ కులస్థులు ఇంకా పూర్తిగా ఆ గ్రామానికి చేరుకోలేదు. డీజీపీగారూ… రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.