రాష్ట్రపతి ఎన్నికలో వైసీపీ దారెటు?

– ఎన్డీఏ అభ్యర్ధికి షరతుల్లేకుండానే మద్దతిస్తుందా?
– హోదా, విభజన సమస్యల పరిష్కారం షరతు విధిస్తుందా?
– ఎన్డీఏకు మద్దతునిస్తే ఏపీలో మైనారిటీల మాటేమిటి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రానున్న రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారం ఏపీలో అధికార వైసీపీకి ప్రాణసంకటంగా మారింది. ఇప్పటికే బీజేపీ-వైసీపీ తెరచాటు రాజకీయాలు చేస్తున్నాయన్న విపక్షాల విమర్శల నేపథ్యంలో, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన రాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో వైసీపీ ఎటువైపు మొగ్గుచూపుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ఎన్డీఏ అభ్యర్ధికి బేషరుతుగా మద్దతునిస్తుందా? లేక అందివచ్చిన అవకాశాన్ని అదే రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకుని.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు, పోలవరం నిధులు, రాష్ర్టానికి రావలసిన పెండింగ్‌ నిధులు విడుదల చేయాలన్న షరతులు విధిస్తుందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఈపాటికే ఇలాంటి అంశాలనే తెరపైకి తెచ్చి, వైసీపీని ఆత్మరక్షణలో పడేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ షరతులు లేకుండా మద్దతునిస్తుందా? లేక షరతులతో కూడిన మద్దతునిస్తుందా అన్న అంశం ఆసక్తికలిగిస్తోంది.

నిజానికి ఈసారి రాష్ట్రపతి ఎన్నిక మునుపటికన్నా భిన్నం. ఎన్డీఏ అభ్యర్ధి విజయానికి 1.2 శాతం ఓట్లు అవసరం. ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 43,400. వ్యక్తిగతంగా ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 248. అందులో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలున్నా, అందులో ఐదుగురు వైసీపీలో చేరిన వారే. టీడీపీకి ఉన్న ఎంపీల సంఖ్య కూడా మూడే. కాబట్టి వైసీపీ ఓట్లే ఎన్డీఏ అభ్యర్ధికి ఆధారం. రాష్ట్రపతి ఎన్నికలో విప్‌ జారీ చేసే అధికారం లేదు కాబట్టి, ఎవరికి ఓటేసినా వారికొచ్చిన నష్టం లేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఏపీలో బీజేపీకి, వైసీపీనే దిక్కు.

అయితే బీజేపీకి కావలసిన ఆ 1.2 శాతం ఓట్లు.. అటు తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న అన్నాడిఎంకె, ఒడిషాలో మిత్రపక్షంగా ఉన్న అధికార బిజూ జనతాదళ్‌తో భర్తీ చేసుకునే అవకాశం లేకపోలేదు. ఏపీలో విపక్షమైన టీడీపీ కూడా ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతునివ్వడం అనివార్యంగా కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, శత్రుత్వం తెచ్చుకునే పరిస్థితిలో టీడీపీ లేదు. కానీ, వైసీపీ మద్దతు కూడగట్టేందుకు, ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ప్రయత్నించడం సహజం. ఆ సందర్భంలో వైసీపీ ఏమైనా షరతులు విధిస్తుందా లేక, బేషరుతుగా మద్దతునిస్తుందా అన్నదే అందరి ఆసక్తికి అసలు కారణం.

ఇప్పటికే జగన్‌ సర్కారుకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంది. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు రాకుండా, న్యాయస్థానాలు మినహాయింపు ఇస్తున్నాయి. జగన్‌ కేసులన్నీ వాయిదాల మీద నడుస్తున్నాయి. చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసు కూడా సీబీఐ, చాలా నిదానంగా విచారిస్తోందన్న విమర్శలున్నాయి. అమరావతి అంశంపై కూడా బీజేపీ మౌనంగానే ఉంది. బీజేపీలో ఒకవర్గం టీడీపీ, మరో వర్గం వైకాపాకు మద్దతునిస్తోంది.

ప్రధానంగా జగన్‌ ప్రభుత్వం కోరిందే తడువుగా, ఐఏఎస్‌ల పొడిగింపు వ్యవహారంలో కేంద్రం విశాలహృదయంతో వ్యవహరిస్తోంది. అసాధారణమైన రీతిలో సీఎస్‌ సమీర్‌శర్మకు ఆరునెలలు, టీటీడీcs-dharma జెఇఓ ధర్మారెడ్డికి ఏకంగా రెండేళ్లపాటు పొడిగింపు ఇవ్వడం ద్వారా, బీజేపీ-వైసీపీ ఒక అవగాహనతోనే అడుగులు వేస్తున్నాయని స్పష్టమవుతోంది. కేంద్రం తలచుకుంటే జగన్‌ శుక్రవారం కోర్టుకు రాకుండా ఉండలేరని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో రానున్న రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతునివ్వాలంటే, వైసీపీ రాష్ర్టానికి సంబంధించిన సమస్యలు పరిష్కారించాలన్న షరతు విధిస్తుందా? లేక కేంద్రంతో ఉన్న భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఎలాంటి షరతులు లేకుండా మద్దతునిస్తుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. జగన్‌ తొలిసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బీజేపీకి మన మద్దతు అవసరం లేదు. లేకపోతే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేవాళ్లం. వాళ్లకు ఇప్పుడు మన మద్దతు అవసరం లేదు. ప్లీజ్‌ సార్‌ అని బతిమిలాడుకోవడమే’’నని వ్యాఖ్యానించారు. మరిప్పుడు అదే బీజేపీ రాజకీయ అవసరాల్లో ఉన్నందున, అభ్యర్ధించాల్సిన వైసీపీ డిమాండ్‌ చేసి, కీలక సమయంలో పైచేయిగా ఉన్నందున.. ఆ అవకాశాన్ని జగన్‌, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుంటారా? లేదా? అన్నదే ఆ ఉత్కంఠకు కారణం.

ఒకవేళ వైసీపీ ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతునిస్తే.. ఇప్పటిదాకా వైసీపీకి బాసటగా నిలిచిన ముస్లిం, క్రైస్తవుల మనోభావాలేమిటన్నది మరో ఆసక్తికర అంశం. ఇటీవల ఇద్దరు బీజేపీ అగ్రనేతలు, ఇస్లాం దైవంపై తాజాగా చేసిన వ్యాఖ్యలు, అంతర్జాతీయంగా ముస్లిం సమాజంలో భారత్‌ను ముస్లిం వ్యకిరేకిగా నిలిపాయి. భారత్‌లో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింలు, శుక్రవారం నమాజు తర్వాత ఆందోళన నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ముస్లిములు వ్యతిరేకిస్తున్న బీజేపికి బాసటగా నిలిస్తే, వైసీపీ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిములను బుజ్జగించడం ఎలా అన్నది మరో ప్రశ్న. అటు మతమార్పిళ్లు అడ్డుకోవడంతోపాటు, క్రైస్తవ
MUSLIMS-Protests సంస్థలకు వచ్చే విదేశీ విరాళాలను నిలిపివేసిన బీజేపీకి వైసీపీ మద్దతునిస్తే, అటు క్రైస్తవులను ఎలా బుజ్జగించాలనేది మరో సమస్య. ఒకవేళ ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతునిస్తే.. తన ఓటు బ్యాంకుగా ఉన్న, ముస్లిం-క్రైస్తవులను బుజ్జగించడమే ఇప్పుడు వైసీపీ ముందున్న పెను సమస్య.

Leave a Reply