Suryaa.co.in

Crime News Editorial

పోలీసు కంట్రోల్‌ రూముకే కన్నమేశారోచ్‌

– హైటెక్‌ రాజధానిలో పోలీసులకు ఇదో హైదరా‘బాధ’
– పోలీసుల పరువుపోయింది
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరైనా తమ ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుస్టేషన్‌కు వెళతారు. తమ ఆఫీసులో వస్తువులు ఎవరో కొట్టేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసుల ఆస్తినే దొంగతనం చేస్తే, వాళ్లెవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటుంటుందా? కాకపోతే పద్ధతి పద్ధతే కాబట్టి, వాళ్లూ ఫిర్యాదు చేసి తీరాలి. హైటెక్‌ హంగులతో నిర్మిస్తున్న పోలీసుకంట్రోల్‌ రూముకు చెందిన వస్తువులనే కొల్లగొట్టడమంటే చిన్న సన్న యవ్వారమా? ఎంత నామర్దా? ఇజ్జత్‌కా సవాల్‌ కదూ? పోనీ ఇదెక్కడో కాకులు దూరని కారడవుల్లోనో, చీమలుదూరలు చిట్టడవుల్లోనో కాదు. హైదరాబాద్‌ అంతా పోలీసులు డేగ కళ్లేసుకునిచూసే, రాష్ట్ర రాజధాని నగర నగబొడ్డిన. పరువు పోలా మరి?

అది హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఉన్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని హైటెక్‌ హంగులతో నిర్మిస్తున్న పోలీసు వ్యవస్థ అది. అంటే.. హైదరాబాద్‌లో చీమ చిటుక్కుమన్నా, కాకుల కేరింతలు కొట్టినా, ఎక్కడ దొంగతనాలు జరిగినా సీసీ టీవీల సాయంతో, వాటిని వాయువేగంతో కనిపెట్టేస్తారన్నమాట. మరి అంత హంగులున్న కేంద్రానికి ఎంత రక్షణ ఉండాలి? ఎంతమంది పోలీసులు కాపలా ఉండాలి? అసలు ఎన్ని కెమెరా కళ్లు దానిమీద ప్రసరించాలి?
అబ్బే.. అదేమీ లేదు. అదే విచిత్రం మరి. అంతలావు నిఘా రక్షణ వ్యవస్థ కార్యాలయానికి చెందిన 38 కాపర్‌ బండిళ్లను కాకులెత్తుకుపోయాయట. దాని ఖరీదు అక్షరాలా 40 లక్షల రూపాయలట. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ నిఘా వ్యవస్థ భవనంలోని కాపర్‌బండిళ్లు, దొంగలెత్తుకెత్తుకెళ్లారని బిల్డింగ్‌ మేనేజర్‌ కనిపెట్టి, ఆ విషయాన్ని మళ్లీ పోలీసులకే పోలీసులకే ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్తాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే నగరంలో పబ్‌ల వివాదం, మైనర్‌ బాలికల కిడ్నాపులు, హత్యలు, అత్యాచారాలతో పోలీసుల ప్రతిష్ఠ సగం దెబ్బతింది. నిందితులను పట్టుకోలేకపోతున్నారన్న విపక్షాల వెక్కిరింపు నిందలు ఒకవైపు. రాజకీయ ఒత్తిళ్లు మరొక వైపు. మధ్యలో జరిగే ఇలాంటి పరువుతక్కువ సంఘటనలు పోలీసుల ఇమేజీని డామేజీ చేస్తున్నాయి. మొత్తంగా రాజధాని నగరంలో శాంతిభద్రతలు లేవంటూ.. ఇప్పటికే నానా యాగీ చేస్తున్న విపక్షాల విమర్శలకు, నిఘా వ్యవస్థ కార్యాలయంలో జరిగిన దొంగతనం యవ్వారం మరో అదనపు శిరోభారం. అలవాటు ప్రకారం.. బహుశా నేడో, రేపో ఎవరినో ఒకరిని పట్టుకుని.. పరువు ‘రికవరీ’ చేసుకుంటారేమో?!

LEAVE A RESPONSE