అమరావతి:- వైసిపి నేతల వేధింపులతో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ కుటుంబ సభ్యులతో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడారు. స్థానిక వైసిపి నేతల వేధింపుల కారణంగా నిన్న దళిత యువకుడు కరుణాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరుణాకర్ మృతితో రోడ్డున పడి, తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.
కరుణాకర్ భార్య, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కరుణాకర్ ప్రాణాలు పోవడానికి కారణం అయిన వారికి శిక్షపడేవరకు టిడిపి పోరాటం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా తాము ఒత్తిడి చేస్తామని చంద్రబాబు వారికి తెలిపారు. పిల్లల చదువుకు,బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన చావుకు కారకులు ఎవరో చెపుతూ కరుణాకర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలిపినా కనీసం ఇప్పటికీ నిందితులను అరెస్టు చెయ్యకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ఒక దళితుడి ప్రాణాలు తీసిన తన పార్టీ వారిని రక్షించేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.