– ఏపి డిజిపిపై టిడిపి అధినేత చంద్రబాబు ఫైర్
– హైదరాబాద్ ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రికి తరలించిన గాంధీకి చంద్రబాబు పరామర్శ
– చెన్నుపాటి కుటుంబానికి టిడిపి అండగా ఉంటుందని భరోసా
వైకాపా నేతల దాడిలో తీవ్రంగా గాయపడి అత్యున్నత చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించిన విజయవాడ మాజీ కార్పోరేటర్, నగర టిడిపి నేత చెన్నుపాటి గాంధీని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ” విజయవాడలో టిడిపి మాజీ కార్పోరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి చాలా దారుణం, దుర్మార్గ చర్య. ఇలాంటి ఉన్మాదాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. నీతి నిజాయితీగా పనిచేసే వ్యక్తి, కాబట్టే గాంధీ మూడుసార్లు కార్పొరేటర్గాద ఎన్నికయ్యారు, ఇప్పుడాయన భార్య కార్పోరేటర్ గా ఉన్నారు. దేశభక్తుల కుటుంబం కాబట్టే గాంధీ, బోస్ అని పేర్లు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నా.
పూరింట్లో ఉండి సేవ చేస్తూ ప్రజాదరణ పొందిన వ్యక్తి చెన్నుపాటి గాంధీ. అనారోగ్యంతో ఉన్న అశోక్ బాబును పరామర్శించడానికి ఆ ప్రాంతానికెళ్తే, అక్కడే ఉన్న గాంధీ ఇంటికి కూడా వెళ్లాను. నీతినిజాయితీగా ప్రజాసేవ చేస్తున్నారనేది వాళ్లిల్లు చూస్తేనే తెలుస్తుంది. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండికూడా ఒక చిన్న పూరింటిలో ఉండే కుటుంబాన్ని చూసి నేనే షాక్ అయ్యాను. అలాంటి వ్యక్తిపై దాడిచేయడాన్ని ఖండిస్తున్నాను.
ఒకప్పుడు గొడవలకు మారుపేరుగా ఉండే విజయవాడను, నేను ముఖ్యమంత్రి కాగానే ప్రశాంత నగరంగా తయారుచేశాం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మళ్లీ రౌడీ మూకలు పెట్రేగిపోతున్నాయి. మీరిలాగే తమాషా చూస్తుంటే, చాలా తీవ్ర పరిణామాలుంటాయి.
కమిషనర్ గారూ, మిమ్మల్ని కూడా ఎవరో కొట్టి కన్ను పోగొడితే, ఏదో ఎమోషనల్గాత కొట్టారని చెబుతారా..? మీ కుటుంబ సభ్యులకు ఇలా జరిగితే ఇదే ఉదాసీనంగా ఉంటారా…? ఒకపక్క హెవీ బ్లీడింగ్‌తో, గాంధీ కన్నుపోయి, రెటీనా పూర్తిగా దెబ్బతింటే, ఏదో ఎమోషనల్‌గా జరిగిందని నిందితులకు కొమ్ముకాస్తారా, వత్తాసు పల్కుతారా..? నిందితులపై అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టి, బెయిల్ రాకుండా చేయాల్సిన అధికారి, కనీసం కేసు పెట్టకుండా నిందితులకు కొమ్ముకాస్తున్నారు. దీనికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వత్తాసు ఉంది. వీళ్లంతా రౌడీయిజాన్ని నమ్ముకున్నారు.. రౌడీయిజాన్ని నమ్ముకున్నవాళ్లు ఎవరూ బాగుపడలేదు.. ఎవరైతే హత్యలు చేస్తారో, వాళ్లకు పోస్ట్ మార్టమ్ తప్పదని నేనెప్పుడూ చెబుతుంటా..హత్యా రాజకీయాలను టిడిపి ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యా రాజకీయాలు, బెదిరింపులు, వేధింపులు, దౌర్జన్యాలే. బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టడం, జైలుకు పంపడం దానికి పరాకాష్ట.. ఇలాంటిది మరొకటి జరిగితే సహించేది లేదు కబర్దార్.. ఎంతమందిని కొడతారు, ఎంతమంది కళ్లు పొడుస్తారు..? ఏదో ఎమోషనల్ గా పొడిచారని అంటారా..? జనం రాబట్టి పారిపోయారు, లేకపోతే ఇంకో కన్ను కూడా పొడిచేవారు. ఇంత ఘోరం జరిగితే, తిరిగి మళ్లీ గాంధీపైనే కేసు పెట్టాలని చూస్తారా..? దీని వెనకాల ఉండే వ్యక్తులకు ఒకటే చెబుతున్నా..మీకు, మీ కుటుంబానికి ఇలాంటిదే జరిగితే ఎలా ఉంటుంది..? ఈ రోజుంటుంది, రేపుంటుంది, ఎల్లుండి ఉంటుందని గుర్తుంచుకోండి.. ఇప్పటికే చాలాచోట్ల మహిళలే తిరగబడుతున్నారు. మీరు బజారులో తిరగలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజొకటి వస్తుంది..
గాంధీ కన్ను పొడవడం కక్షపూరిత చర్య, చాలా దుర్మార్గమైన చర్య. దోషుల్ని వదిలిపెట్టం. ఈ కేసును లాజికల్గా తీసుకెళ్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గాంధీ తిరిగితే దాడి చేశారు. ప్రభుత్వమే ఈ దాడులు చేయిస్తోంది. వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నా. ఈ కేసులో దోషులను ఎవరినీ వదిలి పెట్టం. గూండాయిజాన్ని నమ్ముకున్న వాళ్లెవరూ బాగుపడలేదు.
గతంలో విజయవాడలో పట్టాభి ఇంటిపై కూడా దాడి చేశారు, ఆ రోజే కఠిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు… ప్రజల కోసం మేం పోరాడుతున్నాం, మా నోరు మూయిస్తే ఇంకెవరూ నోరు తెరవరని అనుకోవడం పొరబాటు.. మీ దుర్మార్గాలకు టిడిపి అడ్డుగా ఉంది కాబట్టి, టిడిపి నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే వీళ్ల ఆటలు సాగవు. ప్రజలే ప్రతిఘటించే టైం వచ్చింది, ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వచ్చాయి. మొన్నటివరకు తప్పుడు కేసుల పరంపర, ఇప్పుడు దాడుల పరంపర కొనసాగిస్తున్నారు.
ఈ దాడులకు టిడిపి కార్యకర్తలెవరూ భయపడరు. ఎవరైతే గతంలో దాడులకు పాల్పడ్డారో వాళ్లను పతనావస్థకు తెచ్చిన పార్టీ తెలుగుదేశం. మీ దాడులకెవరూ ఇక్కడ భయపడరు..మీ అరాచకాలను అడ్డుకుంటాం. చెన్నుపాటి గాంధీ కుటుంబానికి టీడీపీ అన్నివిధాలా అండగా ఉంటుందని” చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట తెలంగాణ టిడిపి అధ్యకక్షులు బక్కని నర్సింహులు, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంథ్రేఖర రెడ్డి, టిడి జనార్ధన్, శాసన మండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.