Suryaa.co.in

Political News

గెలవడం తప్ప చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నయినా ఆప్షన్స్ ఉంటే ఉండవచ్చు గానీ ; తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఒకే ఒక్క ఆప్షన్ ఉంది.అదే – వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, అధికారం చేపట్టడం. ఇది ఆషామషి వ్యవహారం కాదు. ఆయన 45 ఏళ్ళ రాజకీయం అంతా ఒక ఎత్తు. రాబోయే ఎన్నికల్లో ఎదుర్కొనబోయే రాజకీయం ఒక ఎత్తు.

నిజానికి, గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు లభించిన తీరు చూసి, ఇక టీడీపీ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ, జగన్ మొదటి టర్మ్ లో కేవలం మొదటి మూడేళ్లలోనే చంద్రబాబు నాయుడు పూర్తి ఫార్మ్ లోకి వచ్చేశారు.’వచ్చేశారు’ అనే కంటే ; ఆయనను వైసీపీ వారు ఫార్మ్ లోకి ‘తెచ్చేశారు’ అనడం సబబుగా ఉంటుంది.ఇది దాదాపుగా అనూహ్యం. ‘ఎన్నికలు ఎప్పుడు జరిగినా మాకు 160 ఖాయం ‘ అంటూ టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించేంత స్థాయిలో టీడీపీకి ఆత్మవిశ్వాసం కలిగించారు . అధికారపక్షం ఇస్తున్న ఈ అవకాశాన్ని చంద్రబాబు అంది పుచ్చుకోవాలి. మరి, ఆయన అందిపుచ్చుకుంటారా?

అయితే, ఈ దిశగా చేసే ప్రయాణంలో చంద్రబాబు నాయుడు అనేక అవరోధాలను అధిగమించాల్సి ఉంది. 175 మీటర్ల హర్డిల్స్ రన్నింగ్ రేస్ అన్నమాట. జనసేనను కలుపుకోవడం. కలుపుకోవడమో… లేదో…. ఎన్నికల నాటి వరకూ నానేసి ఉంచడం వల్ల రెండు పార్టీలకు కలిసి వచ్చేదేమీ ఉండదు. ‘అవునో… కాదో…’ వీలైనంత తొందరలో తేల్చుకోవడం టీడీపీకి అవసరం. పవన్ కళ్యాణ్ ఇప్పటికే పొలిటికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టేశారు. ప్రజలతోనే పొత్తు అంటూనే, మరో పక్క పొత్తులపై ఇప్పుడేPawan-Kalyan-Chandrababu-Naidu-1మాట్లాడను అంటున్నారు.జనసేన కలిసి వచ్చినా…, రాకపోయినా టీడీపీకే లాభం. అందువల్ల, కలిసి వచ్చేదీ, లేనిదీ నిర్ణయించుకునే అవకాశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే వదిలేయడం ఉత్తమం అనే విషయాన్ని చంద్రబాబు గమనించాలి. జనసేన వారు కలిసి వస్తారో రారో తెలియకుండా 175 నియోజక వర్గాలలోనూ టీడీపీ అభ్యర్థులను రెడీ చేసుకుంటూ పోతే ; షరతులు వర్తిస్తాయి కనుక ; చివరిలో జనసేనకు కేటాయించ రావలసిన నియోజకవర్గాలలో టీడీపీ నేతలను చివరి నిముషంలో పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ పరిణామం- ఆయా నాయకులకు,టీడీపీకి ఇబ్బందికరం. ఈ అడ్డంకిని టీడీపీ అధినేత అధిగమించాల్సి ఉంటుంది. ‘ఆశకు మితం లేదు… గోచీకి గుడ్డ లేదు…’ వంటి పార్టీలు ఎన్నికల సమయానికి రెడీ అయిపోవడాన్ని మనం దేశ రాజకీయాల్లో చూస్తూనే ఉంటాం కదా!.ఎన్నికల సమయంలో అవి చెట్టు ఎక్కి కూర్చుంటాయి. సవర దీసిన కొద్దీ బిగసుకు పోతుంటాయి .హ్యాండిల్ చేయడం అంత సులభం కాదు. వాటిపై వృధా చేసుకునేంత సమయం టీడీపీకి లేదు.

మరో అడ్డంకి – టికెట్ల కేటాయింపు. 40% టికెట్లు యువతకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారు. ‘కాదు… అరవై శాతం అయినా ఇవ్వాలి…’ అనే వాదన కూడా టీడీపీ శ్రేయోభిలాషుల నుంచి బలంగా వినబడుతున్నది. 152 నియోజక వర్గాలలో ఇప్పుడు టీడీపీకి శాసన సభ్యులు లేరు కాబట్టి, పార్టీని యువ రక్తంతో నింపడానికి ఇంతకు మించిన మంచి సమయం మరొకటి ఉండదు. 175 మందిలోchandrababuకనీసం 80 నుంచి 100 మంది- కొత్త – (గతం లో శాసనసభకు పోటీ చేయని – పోలీస్ కేసులలో లేని – మంచి నడవడిక, మంచి కుటుంబ నేపథ్యం కలిగిన -40 సంవత్సరాలు లోపు) యువతను అభ్యర్థులుగా నిలపగలగాలి. జనరేషన్ మార్పుకు శ్రీకారం చుట్టడానికి ఇదే మంచి అవకాశం అవుతుంది. కొత్త జనరేషన్ కు నాయకత్వం అందించడానికి నారా లోకేష్ చేతికి ఆల్రెడీ అందివచ్చారు. ‘యువత’ అంటే -ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచీ పార్టీ లో ఉంటున్న వారి కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, కోడళ్ళు కాదు. వీరితో ‘చుట్టరికపు వాసన’ లు కూడా లేని వారు. పార్టీ కి అంకితమై ప్రజలలో పనిచేస్తున్న వారు. ప్రజలలో గుర్తింపు పొందిన వారు.

చంద్రబాబు నాయుడుకు ఉన్న మరో ముఖ్యమైన ప్రతిబంధకం -మొహమాటం. ‘ఆగ్రహించడం’,’హెచ్చరించడం’ తప్ప, ఎవరిపైనా చర్యలు తీసుకోలేని మెతకతనం. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనూ ఆగ్రహించడం… హెచ్చరించడమే తప్ప, చర్యలు తీసుకున్న సందర్భాలు గుర్తుకు రావడం లేదు. ‘ఎవరితో ఎప్పుడు పని బడుతుందో….; ఎందుకు దూరం చేసుకోవడం…!’ అనే దూర దృష్టి కావచ్చు గానీ ; ‘నాయకుడు ధృడం గా నిర్ణయాలు తీసుకోలేరు ‘ అనే భావం పార్టీ లో కలిగితే ; అసలుకే మోసం వస్తుంది. పార్టీ లో పాతుకు పోయిన ‘పొలిటికల్ లార్డ్స్’ ను ఉపేక్షించకుండా ఉండలేని నిస్సహాయ తనం. వీరి వల్ల, ప్రజలపై దాష్టికం చేసే వీరి సొంత ముఠాల వల్ల కొన్ని జిల్లాల్లో పార్టీ ప్రతిష్టకు నష్టం కలుగుతూ వస్తున్న విషయాన్ని చంద్రబాబు గమనించారో… లేదో తెలియదు. ఇటువంటి ఒక ‘పొలిటికల్ లార్డ్’ వల్ల, ఒక ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఇప్పటికే తుడిచిపెట్టుకుని పోయింది. నేల మట్టమై పోయింది.బాబుకు ఆ విషయం తెలిసినా, ఆ ‘పొలిటికల్ లార్డ్’ ను ఏమీ అనలేని నిస్సహాయత. అలాగే, కొన్ని ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ విజయావకాశలను ఈ ‘పొలిటికల్ లార్డ్స్’ తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. వారిని ‘మార్గదర్శక మండలి ‘ కి పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. మొహమాటానికి పోతే ఏదో అయిందన్న సామెత చందంగా చంద్రబాబు మెతకతనం వల్ల ఇబ్బందులు ఖాయం. వీరి నుంచి పార్టీని రక్షించుకోవడంలో ఆయనకు మొహమాటం ఎదురైతే, ఆ పని లోకేష్ కు అప్పగించాలి.

ఆయన అధిగమించాల్సిన మరో అవరోధం – ఎన్నికల హామీ పత్రం- మేనిఫెస్టో . ఏ వాగ్దానమూ ఇవ్వకపోవడమే ఈ సారి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చే వాగ్దానం కావాలి.2014 లో లాగా ఈ సారి ‘ఏదో’ కొత్త కొత్త వాగ్దానాలను తన నుంచి ఓటర్లు ఆశించడం లేదు అనే విషయాన్ని ఆయన గమనించాలి. తన నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో ఆయనకు ఈపాటికే తెలిసి ఉండాలి. అందుకు అనుగుణమైన భావం,భాష, కార్యాచరణ దీక్ష టీడీపీ గొంతుల్లో జనానికి బలంగా వినబడాలి. తన రాజకీయ జీవితంలో అత్యంత బలమైన ప్రత్యర్థిని మొదటి సారిగా ఎదుర్కొంటున్నాననే స్పృహతోనే చంద్రబాబు ప్రతిక్షణం వ్యవహరించాలి. ఆ వ్యవహరించే తీరులో ఓటర్లకు నిజాయతీ కనిపించాలి. మాటల్లో… నిజాయతీ, నిర్ణయాల్లో… నిజాయతీ , చేతల్లో….. నిజాయతీ, మేనిఫెస్టో లో…. నిజాయతీ, ప్రతి కదలికలోనూ నిజాయతీ కనిపించాలి. ఎందుకంటే – టీడీపీ పోరాడవలసిన – వైసీపీలో నాయకత్వ పటిమ స్ట్రాంగ్. అనుచర గణం స్ట్రాంగ్. వనరులు సూపర్ స్ట్రాంగ్. అధికార బలం స్ట్రాంగ్. ప్రచార సామర్ధ్యం స్ట్రాంగ్.
వైసీపీతో పోల్చుకుంటే – వైసీపీకి లేనిదీ, టీడీపీకి ఉన్నదీ కార్యకర్తల బలం. దీనికి -టీడీపీ నాయకత్వChandrababu-Naidu-crowd-facebook పటిమ తోడుకావాలి. ఇందుకు, ప్రతి విషయంలోనూ నిజాయతీగా వ్యవహరించడం మినహా షార్ట్ కట్ లేదు. ఓడిపోతుంది అని అనుకున్న క్రికెట్ టీమ్ కూడా ఆఖరి ఓవర్ లో సిక్స్ లు కొట్టి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. పత్రికా గోష్ఠులు, పంచ్ డైలాగులు, రాబిన్ శర్మలు, సవాళ్లకు ప్రతి సవాళ్లు తెలుగు దేశంను ఎన్నికల వైతరిణి తీరం దాటించలేవు.

అందుకే, అనేక ప్రతి బంధకాలను అధిగమించుకుంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల రణ క్షేత్రం దిశగా కదలాలి. చంద్రబాబుకు ఇవే చివరి సార్వత్రిక ఎన్నికలు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నపటికీ ; మరో మూడు ఎన్నికల వరకు ఏం డోకా లేదు. ఆయన విశ్రాంతి తీసుకోవడం అన్నది 2034 ఎన్నికల తరువాతి సంగతి.కానీ, ఎన్ని ఎన్నికల వరకు యాక్టివ్ గా ఉండగలగడం అనేది ముఖ్యం కాదు కదా! ఎన్నికలలో గెలుపు ఓటములే ముఖ్యం. అసెంబ్లీలో 100 స్థానాలు ఉన్నాయనుకుంటే ; 51 స్థానాలు గెలిచిన పార్టీ 100 స్థానాలు గెలిచినట్టు; మిగిలిన ఆ 49 స్థానాలు గెలిచిన పార్టీ – జీరో(0) స్థానాలు గెలిచినట్టు. ప్రభుత్వ నిర్వహణలో వీరికి నామ మాత్ర పాత్ర కూడా ఉండదు . ఈ విషయాన్ని ప్రతి క్షణమూ అనుభవిస్తున్న టీడీపీ పెద్దలు; ముందుగా తమ బలహీనతలు ఏమిటో గుర్తించి – తరువాత, ఎన్నికల సమర శంఖం పూరించాలి.

– భోగాది వేంకట రాయుడు
@venkata _rayudu

LEAVE A RESPONSE