-దేశమంతా కుప్పం వైపు చూస్తోందంటూ బ్రాంతి
-ఎంపి విజయసాయిరెడ్డి
తన కుమారుడు నారా లోకేశ్ తన నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టపగలే కలలు కంటున్నారని రాజ్యసభ సభ్యులు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ వేదికగా బుధవారం ఈ అంశంపై స్పందించారు. ఆయన స్వప్నాల సారాంశం ఏమిటో తన పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర సరిహద్దు పట్టణం వరకూ లోకేష్ తలపెట్టిన పాదయాత్రకు కొన్ని రోజులు ముందు టీడీపీ నేతలు, అనుచరులతో మాట్లాడుతూ, ‘రాష్ట్రంతోపాటు దేశమంతా కుప్పం వైపు చూస్తోంది,’ అంటూ మాజీ సీఎం చెప్పడం వింతగా ఉందని అన్నారు. దేశం మొత్తం ఏపీలోని మారుమూల ఊరు కుప్పం వైపు చూస్తోందని ఆయన అంటున్నారంటే ఆయన పగటి కలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు కుప్పం కీలకం కానప్పుడు భారతదేశం మొత్తం చంద్రబాబు నియోజకవర్గం వైపు ఎందుకు చూస్తోందో ఎవరికీ అర్ధంకాని విషయమని అన్నారు.
కుప్పమే కాదు ఏపీలోని ఏ ఊరు అయినా దేశ ప్రజలందరి దృష్టిని ఎందుకు ఆకర్షిస్తుందని అన్నారు. ఈ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు పాదయాత్రకు బయల్దేరడంపైన రాష్ట్ర ప్రజలకే ఆసక్తి లేనప్పుడు– పాదయాత్ర మొదలయ్యే కుప్పం వైపు దేశమంతా చూస్తోందనడం చంద్రబాబు అసాధారణ మానసికస్థితిని తెలియజేస్తోందని అన్నారు. తన ఏకైక కుమారుడి రాజకీయ భవితవ్యంపై నిరంతరం ఆందోళన చెందుతున్న చంద్రబాబు–ప్రతిపాదిత పాదయాత్రపై ఆశలు ఎక్కువ పెట్టుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. ఏడున్నర పదుల వయసుకు దగ్గరవుతున్న ఈ నేత ఇప్పుడు ఊహాజనిత లోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేసారు. తనకు ఆనందాన్ని ఇచ్చే రీతిలో పట్టపగలే కలలు కంటున్నారని అన్నారు. చంద్రబాబు తన కేడర్ తో మాట్లాడుతూ,‘కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీకి 66 వేల మంది సభ్యత్వం ఉందని వారిలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఆత్మవిశ్వాసంపై ప్రజలు ఆలోచించాల్సిందేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందైనా టీడీపీ అధ్యక్షుడు వాస్తవ లోకంలో జీవిస్తే మంచిదేమోనని విజయసాయిరెడ్డి అన్నారు