Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధికి కేరాఫ్ గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు

-అభివృద్ధితో ఏదైనా సాధ్యమే నిరుద్యోగ భృతి ఇవ్వవచ్చు…
-మహిళల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే… అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది
-చంద్రబాబు చేస్తానంటున్నదే నిజమైన మహిళా సంక్షేమం
-అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచి, ఆ ఆదాయాన్ని ప్రజలకు పంచుతానంటున్న చంద్రబాబు
-అప్పు చేసి పప్పు కూడు తినే బ్యాచ్ మన పార్టీ ప్రభుత్వానిదైతే… అభివృద్ధి చేసి పప్పు కూడు తినే ప్రతిపక్షానిది
-టిడిపి ప్రవేశపెట్టిన నాలుగు కీలక అంశాలతో కూడిన మేనిఫెస్టో అమలు ముమ్మాటికి సాధ్యమే
-టిడిపి మేనిఫెస్టో ఆహ్వానించాల్సింది పోయి తిట్టిపోస్తే ప్రజల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది -జగన్మోహన్ రెడ్డి… తస్మాత్ జాగ్రత్త
-సంక్షేమం పేరు చెప్పి అభివృద్ధిని సంక నాకించిన జగన్ సర్కార్
-హైకోర్టు ఇంటరిమ్ స్టే పై సీబీఐ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలి
-ఇంట్రిమ్ స్టే ఇవ్వడం సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకమే
-సిబిఐ పై కేంద్ర హోం శాఖ మంత్రి కి ఫిర్యాదు చేసిన జగన్మోహన్ రెడ్డి…
-హవ్వ… కేంద్రంపై కేంద్రానికి ఫిర్యాదా?
-కౌంటర్ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి పేరు చేర్చిన సిబిఐ… అయినా ఈ నిశ్శబ్దం ఏమిటి?
-సజ్జల చేస్తున్న శబ్దానికి అంతం లేదు… అర్థము లేదు
-గతంలో ఓటుకు నోటు కేసు అభియోగ పత్రంలో చంద్రబాబు పేరు లేకపోయినప్పటికీ, రాజీనామాకు డిమాండ్ చేసిన జగన్
-మరి ఇప్పుడు కనీసం సంజాయిషీ అయినా ఇవ్వని ముఖ్యమంత్రి
-నన్ను చితకబాదిన వీడియో చూసి ఆనందించినట్లుగానే… వివేక హత్య ను కూడా వీడియోలో వీక్షించారా?
-అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి కేంద్ర నిధులు ఇచ్చే ప్రసక్తే లేదు… కేంద్రమంత్రిని కలిశాక నాకు స్పష్టత వచ్చింది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

అభివృద్ధికి కేరాఫ్ గా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారు. అభివృద్ధితో ఏదైనా సాధ్యమేనని చంద్రబాబు నాయుడు నిరూపించారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. నాలుగు కీలక అంశములతో మహానాడులో ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో ను చూసిన రాష్ట్రంలోని మహిళలు, యువతులు ముక్తకంఠంతో, ఒక్క ఓటు కూడా తప్పిపోకుండా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారనడంలో సందేహం లేదన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నది నిజమైన మహిళా సంక్షేమం. దారిద్ర రేఖ కు దిగువన ఉన్న 18 సంవత్సరాలు దాటిన పేద యువతులు, మహిళలను గుర్తించి ప్రతి నెల వారికి 1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం అత్యద్భుతం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ హామీని మహిళా లోకం విశ్వసించి గెలిపిస్తే, ఆయన తప్పకుండా అమలు చేసి చూపిస్తారన్న నమ్మకం ఉంది.

ఆసరా పేరిట తమ పార్టీ ప్రభుత్వం కూడా కొంతమందికి ఇస్తూ, మరి కొంతమందికి ఎగ్గొడుతున్నారు. పల్లెటూర్ల నుండి జిల్లా కేంద్రాలకు, పట్టణాలకు వెళ్లి చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలకు, యువతులకు ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన ఆహ్వానించాల్సిందే. అలాగే ప్రతి పేద కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు అందజేస్తామన్న హామీ అమలన్నది సాధ్యమే. ఒక్కొక్క కుటుంబానికి మూడు సిలిండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేది కేవలం 3600 మాత్రమేనని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది . తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రకటన అనంతరం మా పార్టీ నాయకత్వం కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి, విమర్శలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని మా పార్టీ తరఫున మాట్లాడిన కొందరు వ్యక్తులు పేర్కొనడం విడ్డూరం. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని జగనన్న చదివిస్తారని ముఖ్యమంత్రి సతీమణి భారతీ రెడ్డి చెప్పారు.

కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. జగనన్న తన సొంత డబ్బులతో పేదింటి పిల్లలను చదివిస్తున్నట్టుగా ఆమె భావించారు. మా పార్టీ ప్రభుత్వం ఏదైతే చెప్పి మోసం చేసిందో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొనడం స్వాగతించాల్సిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎగదొబ్బింది, చంద్రబాబు నాయుడు అమలు చేసి చూపిస్తామని అంటున్నారు.

కానీ ఆయన చేయలేరని మా పార్టీ నాయకులు పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తోంది. నిరుద్యోగ భృతి గతంలో 200 నుంచి 2000 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదే. 2000 రూపాయల నిరుద్యోగ భృతిని 2250 కి పెంచి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు వేసిన బాటలోనే గతం లో జగన్మోహన్ రెడ్డి పరుగెత్తారని గుర్తించాలన్నారు.

పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుండి తరిమికొట్టారు
టిడిపి మేనిఫెస్టో ప్రకటనపై విమర్శలు ఎందుకు?. సామాన్యుడికి సహాయం అందకూడదా?, ఏదైనా చేస్తే మనమే చేసినట్టు బిల్డప్ ఇవ్వాలా?? అంటూ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. సంక్షేమం పేరిట రాష్ట్రంలో అభివృద్ధిని మా పార్టీ ప్రభుత్వం సంకనాకించింది. పరిశ్రమలలో వాటాలు అడుగుతూ, పారిశ్రామికవేత్తలను ప్రభుత్వ పెద్దలు తరిమికొట్టారు. రాష్ట్రానికి రావలసిన ఆదాయాన్ని వాళ్లకు వీళ్ళకు విక్రయించి వ్యక్తిగతంగా సొమ్ము చేసుకున్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతానని చంద్రబాబు నాయుడు పేర్కొంటున్నారు. ఆ ఆదాయాన్ని పేదలకు పంచుతామని వెల్లడించారు. అప్పుచేసి పప్పు కూడు తినే బ్యాచ్ మా పార్టీ ప్రభుత్వానిదైతే, అభివృద్ధి చేసి పప్పు కూడు తినే బ్యాచ్ ప్రతిపక్షానిది. అభివృద్ధి చేస్తే రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్పుడు ఆటోమేటిగ్గా నిరుద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. నిరుద్యోగ భృతిని సులభంగా ఉన్న కొద్దిమందికి అందజేయవచ్చు.

ఇటువంటి ఐడియా పాలక పక్షమైన మనకు రానందుకు సిగ్గు పడుదాం. ప్రతిపక్ష పార్టీకి వచ్చినందుకు సంతోషిద్దాం. మిగిలి ఉన్న ఈ నాలుగైదు నెలలైనా మనము చేయగలిగింది చేద్దాం. లేకపోతే అన్నీ మూసుకు కూర్చుంటే మంచిది. లేకపోతే మన ప్రభుత్వంపై మరింత ప్రజాగ్రహం పెళ్లు బికుతుందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. అభివృద్ధి అంటూ చేస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఆచరణ సాధ్యమే. మనకు అభివృద్ధిపై ధ్యాసే లేదు. మన గురి అంతా ఎప్పుడు విధ్వంసం పైనేనని ఆయన విమర్శించారు.

మా పార్టీ ప్రభుత్వానికి మృత్యు ఘంటికలు మోగుతున్నాయి
రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఆ పార్టీ శ్రేణులు హాజరు కాకుండా మా పార్టీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను సృష్టించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయినా స్వచ్ఛందంగా లక్షలాదిమంది కార్యకర్తలు మహానాడుకు తరలి రావడం చూస్తే, మా పార్టీ ప్రభుత్వానికి మృత్యుగంటలు మోగుతున్నాయని స్పష్టమవుతోంది .

సభా ప్రాంగణంలో గాలి తుఫాను వచ్చినప్పటికీ, కార్యకర్తలు బెదరలేదు. అక్కడ నుంచి అడుగు కూడా ముందుకు కదలలేదు. ఎక్కడ కూర్చున్న వారు అక్కడే కూర్చుండి పోయారు. అంటే మా పార్టీ ప్రభుత్వంపై ప్రజాగ్రహము ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. ఈ ప్రభుత్వం నుండి ఊరట కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ తలకాయ నొప్పి వదిలిపోతుందా అని నిరీక్షిస్తున్నారు.

ముఖ్యమంత్రి సభలకు బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలు కంద కాలు తవ్వినా , గేట్లకు తాళాలు వేసిన గోడలు దూకి పారిపోవడం చూశాం . తెలుగుదేశం పార్టీ మహానాడుకు హాజరైన వారు ఏ ఒక్కరు కూడా పారిపోలేదు. అసాంతం శ్రద్ధగా సభ ముగిసే వరకు కూర్చున్న చోటే ఉండిపోయారు. అది తెలుగుదేశం పార్టీ పై వారికున్న అభిమానం కాబోలు. లేకపోతే మా పార్టీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం అయి ఉండవచ్చు. ఎన్నో మహానాడులు తెలుగుదేశం పార్టీ నిర్వహించినప్పటికీ, గత ఏడాది ఒంగోలులో, ఈ ఏడాది రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులకు హాజరైన ప్రజలను పరిశీలిస్తే, ఏ స్థాయిలో మా పార్టీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉన్నదో, మహానాడుకు హాజరైన ఆ జనమే సజీవ సాక్ష్యమని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ప్రధాని పట్టించుకోలేదు… కానీ పడరాని పాట్లు పడితే అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెత్తి కూడా చూడలేదు. ఆయన్ని కనీసం పట్టించుకోలేదు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం మా పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అవకాశమే లేదని నేను గతంలోనే స్పష్టం చేశాను. కాళ్ళ వేళ్ళ పడితే జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా తో అర్ధరాత్రి సమావేశమైన జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు అభియోగ పత్రంలో తన పేరును చేర్చిన సిబిఐ పై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ పైనే, కేంద్రానికి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది. అర్ధరాత్రి హోం శాఖామంత్రి తో సమావేశమై ప్రత్యేక హోదా, పోలవరం నిధులు అడిగామని చెప్పడం హాస్యాస్పదం. వినే వారికే విడ్డూరంగా ఉంది. అదే విషయాన్ని పదే పదే చెప్పే వారికి సిగ్గు లేదా?. అయినా పోలవరం నిధులతో హోం శాఖకు సంబంధం ఏమిటి?, విభజన సమస్యలపై చర్చించామంటే ఓ అర్థం ఉంది.

అమిత్ షాకు ఇతర పనులు ఏమీ లేవా?, కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వింటూ కూర్చుంటారా? అని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేక హత్య వెనక విస్తృత కుట్ర కుంభకోణం ఉందని సిబిఐ గతంలోనే పేర్కొంది. వైఎస్ వివేక హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసునని సిబిఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కేసు లో ఒక రహస్య సాక్షి ఉన్నారని, ఆయన వివరాలను వెల్లడించలేమని హైకోర్టుకు సిబిఐ స్పష్టం చేసింది.

దీనితో హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ చౌదరి చిత్రంలో ఎన్టీ రామారావు మాదిరిగా సంఘర్షణకు లోనైనట్లు ఉన్నారు . ఇది న్యాయ ప్రమాణాలకు వ్యతిరేకమని సిబిఐ ని ప్రశ్నించారు . హైకోర్టులో పిటీషన్ దారునికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా?, వద్దా?? అన్నదే ముఖ్యం. ఇది ముందస్తు బెయిల్ కోసం విచారణలా కనిపించడం లేదు. ట్రయల్ కోర్టు వ్యవహారంలా ఉందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రహస్య సాక్షి వివరాలు చెప్పకపోతే సంఘర్షణకు లోనై న్యాయమూర్తి మనోవ్యధ తో మరోసారి తీర్పును వాయిదా వేస్తే, సీబీఐ కండ్లప్పగించి చూడాల్సిందేనా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సిబిఐ తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. హైకోర్టు ఇచ్చిన ఇంట్రిమ్ స్టే పై కౌంటర్ దాఖలు చేయాలి. వైఎస్ వివేక హత్య కేసు విస్తృత కుట్ర కుంభకోణాన్ని వెలికి తీయాలంటే ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని, సుప్రీంకోర్టు విధించిన గడువు లోపు విచారణ పూర్తి చేయడానికి హైకోర్టు జోక్యం చేసుకోవద్దని గతంలోనే సిబిఐ కోరింది. ముందస్తు బెయిల్ ఇవ్వవద్దన్న సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా, హైకోర్టు
ఇంట్రిమ్ స్టే ఇచ్చింది. ఈ విషయాన్ని సిబిఐ , సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. సిబిఐ ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పనికిమాలిన సంస్థగా అభివర్ణించారు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి కే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిబిఐ తప్పకుండా, హై కోర్ట్ ఇంట్రిమ్ స్టే పై సుప్రీం కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తుందని భావిస్తున్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు.

పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకయినా జగన్మోహన్ రెడ్డి మౌనం వీడాలి
వైఎస్ వివేకా హత్య కేసు అభియోగ పత్రం దర్యాప్తు సంస్థ సిబిఐ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును చేర్చింది. జగన్మోహన్ రెడ్డి కి వైఎస్ వివేక హత్య ముందే తెలుసునని సిబిఐ పేర్కొన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి నిశ్శబ్దంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శబ్దం చేస్తున్నప్పటికీ, దానికి అంతం లేదు. అందులో అర్థమే లేదు.

ఓటుకు నోటు కేసు అభియోగ పత్రంలో చంద్రబాబు నాయుడు పేరు లేకపోయినప్పటికీ ఆయన్ని రాజీనామా చేయమని గతంలో ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ని రాజీనామా చేయమని కోరడం లేదు. కానీ అభియోగ పత్రంలో పేరు చేర్చిన తర్వాత ప్రజలకు కనీసం సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్టీకి ఎంతో నష్టం. పార్టీలోని తనలాంటి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు, నాయకులకు భరోసా ఇచ్చేందుకు అయినా జగన్మోహన్ రెడ్డి మౌనాన్ని వీడాల్సిందే. వైఎస్ వివేక హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసునని సిబిఐ పేర్కొంది.

అంటే హత్య గురించే ముందే తెలుసా? అని ప్రశ్నించారు. లేకపోతే గతంలో తనని సిఐడి పోలీసులు చితకబాదుతుంటే వీడియో చూసి ఆనందించినట్లుగానే, వైఎస్ వివేక హత్యను వీడియో ద్వారా వీక్షించారా??. తనని సిఐడి పోలీసులు చితకబాదిన విషయాన్ని పార్లమెంటుకు ఫిర్యాదు చేశాను. అయినా ఇప్పటివరకు సంబంధిత పోలీసు అధికారులను పిలిపించి విచారించలేదు. కానీ నాపై మా పార్టీ నాయకత్వం ఇచ్చిన అనర్హత పిటీషన్ పై నన్ను పిలిచి విచారించారు.

ఇక్కడ పార్లమెంటులోని సంఖ్యాబలం జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది. కానీ హత్యా నేరాభియోగ కేసులో నుంచి బయటపడడానికి సంఖ్యాబలం ఉపయోగపడదు. వైఎస్ వివేక హత్య సమాచారం నాకు ముందు తెలియదని సిబిఐ అభియోగాలు తప్పని నాలాంటి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకైనా జగన్మోహన్ రెడ్డి పెదవి విప్పాలి. లేకపోతే తన మాట సజ్జల రామకృష్ణారెడ్డి మాట ఒకటే నని అయినా చెప్పాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

కోర్టు తీర్పు వచ్చేవరకు అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి కేంద్ర నిధులు శూన్యమే
కోర్టు తీర్పు వచ్చేవరకు అమరావతిలో ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను విడుదల చేసే అవకాశాలు శూన్యమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా గతంలో హర్దీప్ సింగ్ పూరికి రాసిన లేఖ తో పాటు, అమరావతిపై న్యాయస్థానం తీర్పును వివరించారు.

అమరావతిలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకు క్లైమ్ చేసే అధికారాన్ని కల్పించవద్దని న్యాయస్థానం స్పష్టం చేసినట్టుగా వివరించారు. కోర్టు తీర్పు తేలకుండానే కేంద్ర ప్రభుత్వ నిధులను విడుదల చేయవద్దని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని రఘురామకృష్ణంరాజు కోరారు. కేంద్రమంత్రి సావధానంగా ఆలకించి, అన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, పూర్తిస్థాయి నివేదికను తెప్పించుకుంటానని రఘురామకృష్ణం రాజుకు తెలియజేశారు .

రైతుల వైపు న్యాయం ఉందని, అమరావతిలో పేదలకు ఇండ్ల స్థలాలను ఇవ్వడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు. గత ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఐదు శాతం ఇండ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించింది. పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించిన ప్రాంతంలో లబ్ధిదారులకు ప్లాట్లు ఇవ్వాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.

LEAVE A RESPONSE