పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. అనారోగ్యంతో ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణ ప్రసాద్ 58 సం.లు ను ఇంట్లోనే తగులబెట్టిన భార్య లలిత ఉదంతం బయటపడింది. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత నివాసముంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో మంచం పైనే భార్య లలిత పై ఆధారపడి కాలం గడుపుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
పెద్ద కొడుకు యూఎస్ఏ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా, చిన్న కొడుకు కర్నూల్లోనే ప్రభుత్వ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భర్తకు సపర్యలు చేయలేక విసుగు చెందిన భార్య భర్తను ఇంట్లోనే తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో నుండి కమురువాసనలు వస్తుండడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు. ప్పటికే శవం పూర్తిగా కాలి బూడిదైంది.
నిందితురాలుగా భావిస్తున్న భార్య లలితను పోలీసులు విచారించారు. తన భర్త అనారోగ్యంతో మృతి చెందాడని, బంధువులు లేకపోవడంతో తానే ఇంట్లోనే భర్తకు దహన సంస్కారాలు చేశానని పోలీసులకు పొంతన లేని సమాధానం చెబుతుంది. ఆమెకు మతిస్థిమితం సరిగా లేనందున ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని మురళి మోహన్ విలేకరులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. మృతుని పార్థివ దేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.