– క్రెడిట్ చోరీలో బ్రాండ్ అంబాసిడర్ జగన్
రాజకీయాల్లో మాటలు చెప్పడం వేరు, పనులు చేసి చూపించడం వేరు. శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు విషయంలో కూటమి ప్రభుత్వం ఇదే నిరూపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితమై, భూసేకరణను గాలికి వదిలేస్తే, చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన 20 నెలల్లోనే పోర్టు ముఖచిత్రాన్ని మార్చేశారు.
వైసీపీ హయాంలో కేవలం 25% ఉన్న పనులను, నేడు 70%కి చేర్చడం ఒక అద్భుతం. అభివృద్ధికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే, ఇతరులు చేసిన పనికి రంగులు పూసుకుని క్రెడిట్ చోరీ చేయడంలో జగన్ మోహన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అని మూలపేట పోర్టు పనుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గణాంకాల సాక్షిగా వైసీపీ వైఫల్యాలు :
2023 ఏప్రిల్‌లో కేవలం రాజకీయ ఆర్భాటం కోసం, ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా జగన్ ప్రభుత్వం మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో భూసేకరణ, ఉప్పు భూముల సమస్య, ఆర్అండ్ఆర్ (R&R) ప్యాకేజీల వంటి కీలక అంశాలను గాలికి వదిలేశారు.
జగన్ పాలన ముగిసే నాటికి వెచ్చించిన నిధులు కేవలం రూ. 718 కోట్లు కాగా, ప్రాజెక్టు భౌతిక పురోగతి కేవలం 25% మాత్రమే. ఇలా నాలుగో వంతు పనులు కూడా పూర్తి చేయని వైసీపీ, నేడు 70% పనులు మేమే చేశామంటూ ‘క్రెడిట్ చోరీ’కి దిగడం హాస్యాస్పదం. ఒకవేళ నిజంగానే అభివృద్ధి చేసి ఉంటే, 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి ‘గుండు సున్నా’ ఎందుకు చుడతారో జగన్ గారు ఆలోచించుకోవాలి.
కూటమి ప్రభుత్వ హయాంలో పోర్టు పనుల్లో జరిగిన పురోగతి
2024లో బాధ్యతలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూలపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. కేవలం 20 నెలల స్వల్ప వ్యవధిలోనే రూ .1,117 కోట్లు వెచ్చించి, అదనంగా 44% పైగా పనులను పూర్తి చేయడం ఒక రికార్డు. నేడు పోర్టు పనులు మొత్తంగా 70% కి చేరాయి.
బ్రేక్‌వాటర్ పనులు 88.82%కి, బెర్త్ నిర్మాణాలు 76.55%కి చేరాయంటే అది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వం పట్టించుకోని ఉప్పు భూముల సేకరణను కేంద్రం ద్వారా పరిష్కరించి, విష్ణుచక్రం గ్రామ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన ఘనత చంద్రబాబుదే.
2026 డిసెంబర్ నాటికి మూలపేట పోర్టును జాతికి అంకితం చేస్తామన్న కూటమి ప్రభుత్వ సంకల్పం, ఉత్తరాంధ్రను మౌలిక సదుపాయాల హబ్‌గా మార్చనుంది. కుటిల రాజకీయాలతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వైసీపీ నేతలకు, శరవేగంగా జరుగుతున్న ఈ నిర్మాణాలే అసలైన సమాధానం