Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ నేతలు చెప్పే జే బ్రాండ్స్ కు లైసెన్స్ లు ఇచ్చిన నిష్ట దరిద్రుడు చంద్రబాబు

– 45 వేల బెల్ట్ షాపులను రద్దు చేసిన సీఎం జగన్
– దిగిపోయే ముందు బార్లను రెన్యువల్ చేశారు
– నేటికీ బార్లు నడవడానికి చంద్రబాబు కారణం
– చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ ముఖ్యమంత్రి బాబు
– పార్టీ మారండి, లేకుంటే నాయకుడిని మార్చుకోండి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, (అసెంబ్లీ), మార్చి 23: టీడీపీ నేతలు చెప్పే జే బ్రాండ్స్ కు లైసెన్స్ లు ఇచ్చిన నిష్ట దరిద్రుడు చంద్రబాబునాయుడు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడారు. టీడీపీ సభ్యులు చెబుతున్న బూమ్ బూమ్, ప్రెసిడెన్షియల్ మెడల్ వంటి 240 మద్యం బ్రాండ్లకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పారు. అయినప్పటికీ సీఎం జగన్మోహనరెడ్డి పర్మిషన్లు ఇచ్చి వాటిని తీసుకువచ్చినట్టుగా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు అల్జీమర్స్ తో బాధపడుతూ మర్చిపోయి ఉండవచ్చన్నారు. ఆ పార్టీ సభ్యులకు అయినా తల పనిచేస్తుంది కదా అని ఎద్దేవా చేశారు. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న 45 వేల బెల్ట్ షాపులను రద్దు చేశారన్నారు. వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూంలను కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. పాఠశాలలు, దేవాలయాల సమీపంలో ఉన్న దాదాపు 2 వేలకు పైగా వైన్ షాపులను తొలగించిన ఘనత సీఎం జగన్మోహనరెడ్డిదేనని చెప్పారు.

చంద్రబాబు పదవి నుండి దిగిపోయే ముందు 2018 లో బార్లను ఐదేళ్ళకు రెన్యువల్ చేశారని గుర్తుచేశారు. వీటి పర్మిషన్లను సీఎం జగన్ రద్దు చేస్తే కోర్టులకు వెళ్ళి అనుమతులు తెచ్చుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో నేటికీ బార్ లు నడవడానికి కారణం చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని విచ్చలవిడిగా ప్రవహింపజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీనే అని విమర్శించారు. దేశంలో చీప్ లిక్కర్ ను కనిపెట్టిన చీప్ ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారని చెప్పారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన దుర్మార్గుడు చంద్రబాబు మళ్ళీ మద్యాన్ని ప్రవేశపెట్టాడని చెప్పారు. చంద్రబాబుకు నీచమైన చరిత్ర ఉందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా పెట్టుకున్నారన్నారు. అసెంబ్లీలో ఇన్ని రోజులుగా మద్యపానం, కల్తీసారాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని సిగ్గు, శరం లేకుండా చెబుతున్నారన్నారు.

సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేసే అవకాశం లేకుండా పోయిందన్నారు. బుద్ధి లేని టీడీపీ చంద్రబాబు నాయకత్వంలో సారా, చీప్ లిక్కర్, వైన్ షాపులు, బెల్ట్ షాపులు, బార్ లను విచ్చలవిడిగా ప్రోత్సహించిన పనికిమాలిన పార్టీ వచ్చి ఇక్కడ చెబితే జనం నవ్వుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం లేదని చెప్పారు. గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం టీడీపీని డిఫాల్టర్ పార్టీగా తయారు చేశాడన్నారు. చంద్రబాబు వంటి సన్నాసిని పెట్టుకుని టీడీపీని నడిపితే ఆ పార్టీకి తెలంగాణాలో పట్టిన గతే ఆంధ్రప్రదేశ్లో కూడా పడుతుందన్న ఆలోచన కూడా చేయడం లేదన్నారు. చంద్రబాబు మీద ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదన్నారు. ఇతర పార్టీల నుండి ఎవరైనా వచ్చి మద్దతు ఇచ్చి గట్టెక్కిస్తారేమోనని ఎదురు చూస్తున్నారన్నారు. వీళ్ళను పట్టుకున్న వాళ్ళు కూడా కిందపడి సర్వనాశనం అవుతారని ఆరోపించారు. దయచేసి టీడీపీ సభ్యులు అయినా పార్టీ మారాలని, నాయకుడినైనా మార్చుకోవాలని సూచించారు. లేకుంటే అందరూ కట్టకట్టుకుని ఏట్లో కొట్టుకుపోతారని చెప్పారు. టీడీపీలో బెటర్ గా నలుగురైదుగురు ఉన్నారని, సభ నడవడానికి సహకరించాలని మంత్రి కొడాలి నాని కోరారు.

LEAVE A RESPONSE