-రంగుమారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని నీ హయాంలో ఎప్పుడైనా కొనుగోలు చేశావా చంద్రబాబూ?
-చంద్రబాబు హయాంలో మిల్లర్లు, దళారీలదే రాజ్యం
-ధాన్యం కొనుగోళ్లలో వైయస్ జగన్ ఎన్నో సంస్కరణలు తెచ్చారు
-నిరంతరం రైతుకు వెన్నుదన్నుగా సీఎం నిలుస్తున్నారు
-రైతులకు మేలు జరగటంతో చంద్రబాబుకు కడుపుమంట
-వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో చంద్రబాబు తన స్థాయిని మర్చిపోయి వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్ మానుకోవటం మంచిది. ఈ పర్యటనలో చంద్రబాబుకు వ్యవసాయం, రైతులపై అభిమానం ఉన్నట్లు నటించారని రాజా ఎద్దేవా చేశారు. ఉభయ గోదావరి జిల్లాల రైతులు చంద్రబాబు తీరును చూసి నవ్వుకుంటున్నారు. గతంలో అసెంబ్లీలో, బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగాలు ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. చాలా సందర్భాల్లో.. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్న విషయాన్ని రాజా గుర్తు చేశారు. వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే.. తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని పలు సందర్భాల్లో చంద్రబాబు అన్నారు.
ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంకా ఏం మాట్లాడారంటే..
ధాన్యం కొనుగోళ్లకు చంద్రబాబు తెచ్చిన విధానం, వైయస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన పాలసీకి మధ్య ఎంతో తేడా ఉంది. ప్రత్యేకించి వైయస్ఆర్సీపీ తెచ్చిన పాలసీ ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులను అడిగితే ఈ ప్రభుత్వం వల్ల ఎలా మేలు జరుగుతోందో చెబుతారు.
రైతుల కోసం సీఎం కీలక నిర్ణయాలు
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేయమని అధికారులను ఆదేశించారు. తద్వారా రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే కాకుండా.. రైతులు ప్రకృతి విపత్తుల బారిన పడకుండా మొదటి సీజన్‌కు త్వరగా నీరు ఇవ్వటం జరిగింది. తద్వారా తొందరగా పంట చేతికి వచ్చి రైతులు నష్టపోరు. దీనివల్ల రెండో పంటకు కూడా ముందుగా వేయటం జరుగుతుంది. ప్రకృతి విపత్తుల బారిన పడకూడదనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా త్వరగా నీరు అందించిన ప్రభుత్వం ఇది.
బాబు హయాంతో పోలిస్తే వైయస్ జగన్ ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారు
రైతుకు అన్ని రకాలుగా మేలు చేకూర్చాలని సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, 72 గంటల్లోపు కొనుగోలు చేయాలని చంద్రబాబు అల్టిమేటం ఇవ్వటం సరికాదు. ధాన్యం కొనుగోళ్ల వివరాలు పరిశీలిస్తే.. చంద్రబాబు ఐదేళ్లలో రబీకి 74,69,981 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. పైగా కోట్లాది రూపాయలు బాకీ పెట్టారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు బకాయి పెట్టిన ఎరియర్స్ కూడా వైయస్ జగన్ ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో (రబీ సీజన్) రూ.24,488 కోట్లు వెచ్చించి 1,31,83,454 మెట్రిక్ టన్నులను ప్రభుత్వం సేకరించింది. ఎక్కడ చంద్రబాబు హయాంలో సేకరించిన 74,69,981 మెట్రిక్ టన్నులు.. ఎక్కడ వైయస్ జగన్ ప్రభుత్వం సేకరించిన 1,31,83,454 మెట్రిక్ టన్నులు. ఈ ప్రభుత్వం గతంలో కన్నా 50 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించింది. చంద్రబాబు హయాంలో ధాన్యం కొనుగోలుకు రూ.11 వేల కోట్లు ఖర్చు పెడితే వైయస్ జగన్ ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేసింది. అన్ని రకాలుగా రైతులకు మేలు చేశామని ఈ గణాంకాలే చెబుతున్నాయి.
బాబు హయాంలో దళారుల అవతారం ఎత్తిన టీడీపీ నాయకులు
గతంలో టీడీపీ నాయకులు దళారుల అవతారం ఎత్తి రైతుల దగ్గర తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు ఇష్టమొచ్చిన రేట్లకు అమ్మారు. కానీ వైయస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థ తెచ్చింది. ఈ-క్రాప్ సిస్టమ్ అమలు చేస్తోంది. ఏ ఎకరంలో, ఏ సర్వే నెంబర్లో ఏ పంటను పండిస్తున్నారో ఈ-క్రాప్‌లో నమోదు చేసి ఆర్బీకేల ద్వారా పంటను కొనుగోలు చేస్తున్నారు. రైతుకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకే కొనుగోలు చేస్తోంది. ఏ రైతు నుంచి పంట వస్తోందో మిల్లర్లకు కూడా తెలియదు. ప్రభుత్వమే పారదర్శకంగా రైతులకు ఎంఎస్పీ ధరను అందజేస్తోంది. వైయస్ జగన్ ప్రభుత్వంలో దళారీలకు చోటు లేదు. పాదర్శకంగా ఉండటం కోసమే ఈ-క్రాప్, ఆర్బీకే వ్యవస్థను తీసుకువచ్చారు.
రంగుమారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు
ఏనాడైనా చంద్రబాబు హయాంలో రంగుమారిన ధాన్యాన్ని, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేశారా? కానీ, ఈ ప్రభుత్వం రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో సీఎం వైయస్ జగన్ సంస్కరణలు తెచ్చారు. మిలుల్లో డ్రైయర్లు పెట్టాలని.. ఆదేశాలు జారీ చేశారు. 17% మించి తేమ శాతం ఉండకూడదని నిబంధన ఉన్నా దాన్ని సడలించారు. 25% వరకు కూడా ఒక్కో శాతానికి కేవలం కేజీ చొప్పన తగ్గిస్తూ కొనుగోలు జరుపుతున్నారు. నూక శాతం కూడా గతంలో కంటే 25% నుంచి 30%కు సడలింపులు ఇవ్వటం జరిగింది. రైతులకు మేలు చేసింది దివంగత వైయస్ఆర్ ఆ తర్వాత సీఎం వైయస్ జగన్ మాత్రమే.
రైతుపక్షపాతి జగన్
గతంలో చంద్రబాబు 650 వాగ్దానాలు ఇచ్చారు. రైతుల అప్పులను బేషరుతుగా మాఫీ చేస్తానని చెప్పారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు నుంచి విడిపించి మహిళల చేతుల్లో పెడతామన్నారు. రైతులను గాలికి వదిలేయటంలో వడ్డీలకు చక్రవడ్డీలు కట్టి నష్టపోయారు. కానీ, ఇప్పుడు వైయస్ జగన్ నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఆర్బీకేలను ఏర్పాటు చేసి రైతులకు భరోసా కల్పించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని వేళలా తోడ్పాటు అందించారు. 11వేల రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేసి అందులో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఒకే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు టీడీపీ నాయకుల పంటలు పాడవకపోయినా పంట నష్టం రాసేవారు. అర్హులకు న్యాయం జరిగేది కాదు. ఇప్పుడు ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉండటంతో వర్షాలు తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ చేస్తారు.
చేతల్లో రైతులకు మేలు చేస్తున్నారు
ప్రభుత్వ పాలసీలు, నిర్ణయాల వల్ల మంచి పేరు వస్తోందని చంద్రబాబు కడుపుమంట. గతంలో చంద్రబాబులా ఏమీ చేయకుండా పబ్లిసిటీ చేయటం లేదు. ఫ్లెక్సీలు వేయటం లేదు. టీవీల్లో, పేపర్లలో ప్రకటనలు ఇవ్వట్లేదు. రైతులకు మేలు చేయటానికి ప్రభుత్వం తోడుగా ఉండటంతో చంద్రబాబుకు మంట. రైతులంతా వైయస్ జగన్ కి జేజేలు పలుకుతున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి 4,715 ఎఫ్టీఓలకు రూ.64.33 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. 9,988 ఎఫ్టీఓలకు రూ.115.69 కోట్ల రైతులు ఇవ్వనున్నారు. రైతులను ఆందోళనకు గురి చేయాలని చంద్రబాబు ప్రయత్నించటం మంచి పద్ధతి కాదు. ఇలాగే వ్యవహరిస్తే మరోసారి గట్టిగా ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారు.
చిట్‌ఫండ్ నిబంధల ఉల్లంఘనపై సీఐడీ అరెస్టులు చేసింది
ఎమ్మెల్సీగా పనిచేసిన ఆదిరెడ్డి బాధ్యతతో వ్యవహరించకుండా చిట్‌ఫండ్ వ్యాపారంలో ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించారు. దీంతో ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను చిట్‌ఫండ్ వ్యాపారం నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ ఎంక్వైరీలో సాక్ష్యాధారాల ప్రకారం అరెస్టు చేసింది. కేవలం రాజకీయ ఎజెండాతో తప్పు చేసిన టీడీపీ నాయకుల్ని చంద్రబాబు వెనకేసుకు వస్తున్నారు. తద్వారా ప్రజల ఆలోచల్ని దృష్టి మళ్లించటానికి చంద్రబాబు ప్రయత్నించారు.