Suryaa.co.in

Andhra Pradesh

సిఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద కష్టాలు తెలియవు

-పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగిఉంటే జగన్ రెడ్డి కాలికి బురద అంటకుండా హెలికాప్టర్ లో తిరుగుతున్నారు
-వరద పై ప్రభుత్వ సన్నద్ధతా లేదు…బాధితులకు సాయమూ లేదు!
-ఓ నాలుగు రోజుల పాటు ప్రజలకు భోజనం, నీళ్లు ఇవ్వలేరా?
-పోలవరం కాఫర్ డ్యాం ఎత్తు పై ఇప్పుడు కొత్త డ్రామాలు…మూడేళ్లు ఏం చేశారు?
-వరద బాధితులకు అండగా నిలవాలని టిడిపి శ్రేణులకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు
-ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా సాయం అందించేందుకు ఏర్పాట్లు
-గురు, శుక్ర వారాల్లో వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు రెండు రోజుల పర్యటన

అమరావతి:- గోదావరి వరదలతో వందల గ్రామాలు ప్రజలు అల్లాడిపోతుంటే…ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 6 జిల్లాలలో 550కిపైగా గ్రామాల్లో గోదావరి వరదలు తీవ్ర ప్రభావం చూపాయని…అయితే ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందలేదని చంద్రబాబు ఆరోపించారు. సిఎం గాల్లో హెలికాఫ్టర్ వేసుకుని తిరిగితే ప్రజల కష్టాలు తెలియవని చంద్రబాబు దుయ్యబట్టారు.

కాలికి బురద అంటకుండా వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తే వాస్తవాలు ఎలా తెలుస్తాయని…ప్రజల బాధలు ఎలా అర్థం అవుతాయని చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. విపత్తుల సమయంలో ఆయా ప్రాంతాల్లో మంత్రులు గాని, ఇతర ప్రభుత్వ పెద్దలు గాని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండాలని…అయితే ఈ ప్రభుత్వంలో అదేమీ లేదని చంద్రబాబు అన్నారు.

జగన్ వరదలపై నాన్ సీరియస్ గా ఉండడం వల్లనే…క్యాబినెట్, ఇతర యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తుందని అన్నారు. వరదల విషయంలో ప్రతి నిముషం కీలకమేనని…ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం బాధాకరం అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో వరదల ప్రభావం, నేతలు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు బాగోగులు, ప్రజల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

వరదలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చెయ్యడం నుంచి…వారిని తరలించి పునరావాసం కల్పించడం వరకు ప్రతి అంశంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని నేతలు వివరించారు. చంద్రబాబు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో గోదావరి జిల్లాలకు చెందిన పలువురు బాధితులు స్వయంగా చంద్రబాబుతో మాట్లాడి తమ బాధలు చెప్పుకున్నారు. ఒక్క ప్యాకెట్ భోజనం కోసం కూడా నానా యాతన పడుతున్నామని…ఈ స్థాయి ఇబ్బందులు ఎప్పుడూ లేవని విలపిస్తూ చెప్పారు. పోలవరం ముంపు మండలాల్లో దారుణ పరిస్థితిపై అక్కడినేతలు వివరించారు. టీడీపీ హయాంలో నిర్మాణాలు మొదలు పెట్టిన పోలవరం పునరావాస కాలనీలు ఈ మూడేళ్లలో పూర్తి చేసి ఉంటే వేల మందికి ఇప్పుడు ఈ కష్టాలు తప్పేవని బాధితులు వివరించారు.

పోలవరం పునారావాస కాలనీల్లో పూర్తి స్థాయి వసతులు కల్పించినా…ప్రజలు వాటికి వెళ్లే వాళ్లని…కానీ ప్రభుత్వం ఆమాత్రం పని కూడా చెయ్యలేకపోయిందని బాధితులు చంద్రబాబుకు తెలిపారు. ప్రభుత్వం ఇప్పుడు ఒక్క రోజులో కాఫర్ డ్యాం ఎత్తు పెంచుతామని కొత్త డ్రామా మొదలు పెట్టిందని….మరి ఈ మూడేళ్లు ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం గొప్పగా చెప్పే వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ వరద సమాచారం కూడా ఇవ్వలేకపోవడం, కనీస సాయం చెయ్యకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని చంద్రబాబు అన్నారు. ఆర్టిజిఎస్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వరదలు, వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే అవకాశం ఉందని..అయితే ఆ వ్యవస్థను కూడా జగన్ నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

ప్రజలు బాధల్లో ఉన్నారని…..టిడిపి శ్రేణులు, నేతలు చేతనైన సాయం చెయ్యాలని సూచించారు. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న నేతలను చంద్రబాబు అభినందించారు. ప్రభుత్వం ఎలాగూ ప్రజలను వరదలకు వదిలేసిందని…మనం వారికి అండగా నిలుద్దాం అని పార్టీ క్యాడర్ కు పిలుపు నిచ్చారు. మరోవైపు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి కూడా సాయం అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారని….పార్టీ నేతలతో కలిసి ప్రజలకు సాయం అందిస్తారని చంద్రబాబు తెలిపారు. గోదావరి వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తానే స్వయంగా గురు, శుక్రవారాల్లో పలు ముంపు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.

LEAVE A RESPONSE