విశాఖపట్నం జిల్లా ప్రశాంతతకు మారుపేరు. కానీ, నేడు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అక్రమ భూకబ్జాలు, హత్యలతో క్రైమ్ సిటీగా మారిపోయింది. విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తున్న బీసీ-యాదవ కులానికి చెందిన బంగార్రాజు దారుణ హత్యకు గురయ్యారు.
ఏనుగులపాలెంలో మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైంది. బంగార్రాజు మృతదేహం లభ్యమై నాలుగైదు రోజులైనప్పటికీ ఇంకా పోస్ట్మార్టం నిర్వహించకపోవడం విచారకరం. బంగార్రాజు భార్య శ్రీమతి నందిని కనీసం ఓదార్చలేని స్థితిలో ఉంది.
బంగార్రాజు ముగ్గురు పిల్లలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం విశాఖపట్నం శాంతిభద్రతల సమస్య మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. బంగార్రాజు హత్యలో అధికార వైఎస్సార్సీపీకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి హత్య కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను.