లడ్డూ కల్తీ విచారణ అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు “మాస్టర్ స్ట్రోక్ ” వదిలారు .
తన నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ చేపట్టిన దర్యాప్తు ను ఓ రెండు రోజులు నిలుపుదల చేశారు .
ఇది పూర్తిగా నిలిచిపోతుందా, లేక తిరిగి దర్యాప్తు కొనసాగిస్తుందా అనేది మరో రెండు రోజుల్లో ….; అంటే గురువారం తెలియవచ్చు . లేదా మరి కొద్ది రోజుల అనంతరం టెలియవచ్చు .
గురువారం నాడు సుప్రీం కోర్టు ఈ అంశం ఆలకిస్తుంది . అది ఏమి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కదా!
అందుకే , రాష్ట్ర ప్రభుత్వం పై న్యాయమూర్తులు మళ్ళీ ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి అవకాశం లేకుండా …సిట్ దర్యాప్తును నిలుపుదల చేశారు .
” మేము సొంతం గా దర్యాప్తు చేయడం లేదు యువరానర్ . తమరు ఏది చెబితే అదే. అందుకు వీలుగా మేము సిట్ దర్యాప్తు ఆపేశాం. దర్యాప్తు జరగాలనేదే మా ఉద్దేశం తప్ప , అది ఎలా జరిగినా అభ్యంతరం లేదు యువరానర్….” అంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీం కోర్టు లో తెల్ల జండా ఎగరేస్తారని ఒక అంచనా .
దానితో , న్యాయమూర్తుల మనసులు కొంత మెత్తబడి , ” లేదు లేదు . సిట్ ను వేశారు కదా ! దాని తోనే దర్యాప్తు చేయించండి . కాకపోతే నెల రోజుల్లో దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో మాకు అందచేయండి ” అని అంటారేమో అనేది కొందరు న్యాయవాదుల అంచనా గా ఉంది. అప్పుడు , సిట్ విశ్వసనీయత అనూహ్యం గా పెరుగుతుంది . ఎవరూ పేరు పెట్టడం కుదరదు .
ఒకవేళ , సీబీఐ కి వెళ్ళాలి అని సుప్రీం కోర్టు భావించినప్పటికీ ; రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు.
ఆవు నెయ్యి …కిలో 319 రూపాయలు ఇస్తున్నారు అంటేనే అది నెయ్యి కాదు అని అర్థం . ఆవు నెయ్యి కానే కాదు . ఆ ధరకు ఎప్పటి నుంచి ఇస్తుంటే;అప్పటి నుంచి అది ఆవు నెయ్యి కాదు అనేదే అర్థం. చూపులకు మాత్రమే అది నెయ్యి . నిజానికి కల్తీ నూనె ఏదో నెయ్యి అని సరఫరా చేస్తున్నారని ఎవరైనా భావించే అవకాశం లేకపోలేదు . ఇక దానిని కల్తీ చేసే అవకాశం ఉండకపోవచ్చు ..
అయితే , శంకులో నుంచి పోస్తే గానీ , తీర్థం కాదు కదా ! అందుకే ఓ ‘ దర్యాప్తు ‘ . ఆ పని తిరుమల కొండపై ఉన్న డీ ఎస్ పీ అయినా చేయగలరు . ఒక వారం పది రోజుల్లో ….’ విషయం ‘ ఏమిటో తేల్చేయ గలరు . కానీ , ‘ బిల్డ్ అప్ ‘ కోసం ఒక ఐ జీ , ఒక డీ ఐ జీ , ఒక ఎస్ పీ , ఒక అదనపు ఎస్ పీ , సీ ఐ ల తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీాం ( SIT) ను ఏర్పాటు చేశారు.
నిజానికి , టీటీడీ ఈ ఓ శ్యామల రావు స్థాయిలో ” విచారించి ” కేసులు పెట్టాల్సిన వారిపై కేసులు పెట్టేసి ,తిరుపతి ప్రసాదాలు యథా విధిగా నడిపిస్తే …దొరకాల్సిన దొంగలు దొరికేసేవారు . ఇప్పుడు సిట్ దర్యాప్తు లో అయినా ,రేపు ఇంకో దర్యాఫ్తు లో అయినా ; దొంగలు ఉంటే….దొరికి తీరుతారు . ఎందుకు అంటే ….అక్కడ ఉన్నది డాక్యుమెంట్లు. వేరే సాక్షులు అవసరం పెద్దగా అవసరం లేదు . డాకుమెంట్లే మాట్లాడతాయి.
*ఈ 319 రూపాయల నెయ్యి ఎప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు ?
*ఈ టెండర్ తో పాటు ఎవరెవరు టెండర్లు వేశారు ?
*ఈ సరఫరా దారులను ఎవరు, ఏ ప్రాతిపదికన సరఫరా చేశారు ?
*ఈ సరఫరా దారులకు సబ్ కాంట్రాక్టర్లు ఉన్నారా?
*వారు కిలో కి ఎంత ఛార్జ్ చేశారు ?
*మెయిన్ సరఫరాదారులకు కిలో కి ఎంత మిగిలింది ?
*వీళ్ళకు ముందు ఎవరు, ఎంత ధరకు , ఎంత కాలం ఆవు నెయ్యిని సరఫరా చేశారు ?
*వారిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు మార్చారు ?
*మార్చడానికి కారణాలు ఏమిటి !
*రివర్స్ టెండరింగ్ ఒక్క నెయ్యి సరఫరా దారులకేనా ? లేక ఇంజనీరింగ్ పనులకు కూడా వర్తింప చేశారా ?
*టీటీడీ లో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేయమని టీటీడీ బోర్డు కు ఎవరు చెప్పారు ?
*ఈ రివర్స్ టెండరింగ్ తో స్వామి వారి ధనం ఎంత మిగిల్చారు ?
*నెయ్యి నాణ్యత పరీక్షకు కొండ మీద ఉన్న వసతులు ఏమిటి ?
*నాణ్యత ధ్రువీకరణ కోసం ,నమూనాలను గుజరాత్ లోని డిబిబిసి కి పంపించడం ఇదే మొదటి సారా ? గతం లో కూడా పంపారా ?
*ఇప్పుడు కిలో 319 రూపాయలకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టర్ గతం లో కూడా నెయ్యి సరఫరా చేశారా ? లేక మొదటి సారిగా సప్లై చేస్తున్నారా?
*ఈ దిండిగల్ సరఫరా దారుడు ఎంతకాలం గా నేతి వ్యాపారం లో వున్నాడు ?
*స్వామి వారికి గాకుండా , ఇంకా ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు , ఏ ధరకు ?
ఇలాంటి సవాలక్ష ప్రశ్నలకు సమాధానాలు అన్నీ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. అవి దాచేస్తే దాగవు . చించేస్తే చినిగిపోవు . పైపెచ్చు అక్కడ ఉన్నది ధర్మారెడ్డి కాదు . జే.శ్యామల రావు .
అందువల్ల ….ఆ కాగితాలు ముందేసుకుని కూర్చుంటే ….; సిట్ అయినా , సీబీఐ అయినా , కొండమీద ఉద్యోగం చేసే డీ ఎస్పీ అయినా ….దొంగలను వదిలేయడం కుదరదు .
అందుకే , నిర్ణయాన్ని సుప్రీం కోర్టు కే వదిలేయాలని చంద్రబాబు అనుకుని ఉంటారు.
అయితే , తాను నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను చంద్రబాబే ‘ లెట్ డౌన్ ‘ చేశారని భావించేవారు కూడా లేక పోలేదు. తిరుపతి లడ్డూ కల్తీ పై సిట్ ను వేసి , ఇప్పుడు వెనకడుగు వేయడంతో , ఆయనలో “ఆత్మ విశ్వాసం” లోపించిందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు . తాను తీసుకున్న నిర్ణయం సరియైనదే అన్న భావన చంద్రబాబు లో లోపించిందా అన్న సందేహాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి . నిజానికి , మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ముందేసుకు కూర్చుని , 24 గంటలూ చిత్రిక పట్టి , ఒక ప్రాథమిక నివేదిక ను రూపొందించి 3 వ తేదీన ఒక సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టు కు సమర్పించి , ‘ ఇదీ మా సిట్ చేసిన దర్యాప్తు…’ అని చెప్పి ఉంటే; రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబులిటీ కి వన్నె వచ్చి ఉండేదని ఒక రిటైర్డ్ అదనపు డీజీపీ అన్నారు .
ఒకటి మాత్రం ఖాయం . ఎవరు దర్యాప్తు చేసినా , “విషయం ” బయట పడి పోతుంది . సీబీఐ అయితే ఒక్కటే చిక్కు . ” దర్యాప్తు ” ఓ పది , పన్నెండేళ్ళు సాగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి . మూడు నెలల్లో దోషులు అరెస్టు కావాలి . లేకపోతే , ఇది కూడా మరో వివేకానంద రెడ్డి మర్డర్ కేస్ అవుతుంది .