Suryaa.co.in

Andhra Pradesh

డిఎస్సీ-2024 షెడ్యూల్ లో మార్పులు

• మార్చి 25 వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లు
• మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు
• 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో నిర్వహణ
• విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

విజయవాడ,12 మార్చి 2024: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే.

ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్స్ లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు.

సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE