జగన్ సర్కార్ అవినీతిపై చార్జిషీట్ వేయండి

– వైసీపీ సర్కారు అవినీతిపై గ్రామ, మండల,జిల్లా రాష్ట్ర స్థాయిలో చార్జిషీట్ తయారుచేయండి
– ఎక్కడ సమస్యలున్నాయో గుర్తించండి
– ప్రజలతో సంతకం తీసుకోవాలని నేతలకు మోదీ సూచన
– కేంద్ర పథకాలు జనంలోకి ఎందుకు తీసుకువెళ్లడం లేదన్న మోదీ
– సోము వీర్రాజును బూత్, మండల కమిటీ వివరాలు అడిగిన ప్రధాని మోదీ
– పుస్తకం చూసి చెప్పబోయిన సోముపై మోదీ అసహనం
– దానితో పార్టీ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్ దిద్దుబాటు
– సామాజిక కార్యక్రమాలతో జనంలోకి వెళ్లండని మోదీ సూచన
– అంగన్‌వాడీ సమస్యలపై దృష్టి సారించాలన్న ప్రధాని మోదీ
– తాను గుజరాత్‌లో ఏం చేశానో వివరించిన మోదీ
– ఏపీలోనూ దానినే అమలు చేయాలని నేతలకు సూచన
-యువత, మహిళ, రైతు సమస్యలపై దృష్టి పెట్టండి
– విశాఖలో భూకబ్జాలపై ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు
– వైసీపీ నేతలు భూములు స్వాహా చేస్తున్నారని సీఎం రమేష్ ఫిర్యాదు
– ఒక వ్యూహం ప్రకారం భూకబ్జాలకు పాల్పడుతున్నారన్న సీఎం రమేష్
– సీఎంఓ, విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు నడచుకుంటున్నారని సీఎం రమేష్ వివరణ
– ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న ఎమ్మెల్సీ మాధవ్
– వైసీపీ నేతలు విశాఖ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదు
– టీడీపీ-వైసీపీ పాలనను విశ్లేషించిన ఎమ్మెల్సీ మాధవ్
– కేంద్రప్రభుత్వ సంస్థల పరిశీలన వివరాలు వెల్లడించిన ఎంపీ జీవీఎల్
– జగన్ సర్కారుపై ప్రజావ్యతిరేకతను వివరించిన సీనియర్లు
– గంటన్నర సేపు కోర్ కమిటీతో మోదీ భేటీ
– చర్చకు రాని పొత్తు అంశాలు
– పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

తమ్ముడు తమ్ముడే. పేకాట పేకాటనే.. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి.. ఈ తెలుగు సామెతలను ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేసి చూపించారు. తన విశాఖ పర్యటనలో స్వాగతం చెప్పిన సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిని భుజం తట్టి, యోగక్షేమాలడిగిన అదే నరేంద్రమోదీ.. ఆ తర్వాత తన పార్టీ కోర్ కమిటీ నేతలతో, ‘వైసీపీ సంగతి చూడమని’ ఆదేశించారు. ఆ ప్రకారంగా.. ప్రధాని మోదీ విశాఖ పర్యటన, ఏపీలో ‘వైసీపీ సర్కారు అవినీతిపై చార్జిషీట్’ ఆదేశాలకు దారితీసింది.

విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీకి, రాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులంతా ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం పలికారు. ఆ ఆనందంలో.. మోదీ తన భుజం తట్టారంటూ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సగర్వంగా ట్వీట్ కూడా చేశారు. మోదీ కూడా జగన్- విజయసాయిరెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. నిజానికి మోదీ పర్యటనకు బీజేపీ క ంటే, వైసీపీనే ఘన స్వాగత ఏర్పాట్లు చేసింది. సీఎం పర్యటన మాదిరి హంగామా చేసింది.

అయితే..ఆ తర్వాత వైసీపీ నాయకత్వం ఆనందం, ఆవిరయ్యేందుకు గంట సేపు కూడా పట్టలేదు. ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిన మోదీ, నేరుగా ఏపీ బీజేపీ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్, రాష్ట్ర పార్టీ కో ఇన్చార్జి సునీల్ దియోధర్, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధ్వీరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

దాదాపు గంటన్నర సేపు జరిగిన కోర్ కమిటీలో.. ప్రధాని మోదీ ఏపీకి సంబంధించిన రాజకీయ, పార్టీ సంస్థాగత అంశాలపై వాకబు చేసేందుకే సమయం కేటాయించారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తొలుత కోర్ కమిటీ సభ్యుల వివరాలు మోదీ అడిగి తెలుసుకున్నారు. వారు కూడా తమ వివరాలు వెల్లడించారు. ఆ తర్వాత ఏపీలో పార్టీ నిర్మాణ అంశాలపై ఆరా తీశారు.

రాష్ట్రంలో ఎన్ని మండలాలు, ఎన్ని బూత్ కమిటీలున్నాయని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ప్రధాని మోదీ ప్రశ్నించారు. పార్టీపరంగా ఇప్పటివరకూ ఏం చేశారని ఆరా తీశారు. అందుకు సోము.. తన హయాంలో ఏం చేశామో చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే దానిని కట్ చేసిన మోదీ.. ఇవన్నీ కాదు. మీరు ఎన్ని మండల, బూత్ కమిటీలు పూర్తి చేశారు? అని ప్రశ్నించారు.

దానితో సోము తన చేతిలోని పుస్తకం తెరిచే ప్రయత్నం చేశారు. ఎన్ని కమిటీలు పూర్తి చేశారో మీకు తెలియదా? అని మోదీ ప్రశ్నించడంతో, జోక్యం చేసుకున్న రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్.. రాష్ట్రంలోని మండలాలు, బూత్‌కమిటీలు వేసిన వివరాలు వినిపించారు.

ఈలోగా చర్చ జగన్ పరిపాలనపై వైపు మళ్లింది. జగన్ పాలనపై ప్రజాభిప్రాయాన్ని మోదీ అడిగారు. దానికి దాదాపు కోర్ కమిటీ సభ్యులంతా ..జగన్ పాలనపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత ఉందని, ముక్య కంఠంతో ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని రంగాల్లో అవినీతి పెరిగిందని, అవినీతిని జగన్ కేంద్రీకృతం చేశారని ఫిర్యాదు చేశారు. మద్యం, ఇసుకను జిల్లాల వారీగా పార్టీ నేతలకు అప్పగించారని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రధానంగా.. ఎంపీ సీఎం రమేష్ , విశాఖలో జరుగుతున్న భూ కంభకోణాలపై ప్రధానికి ఫిర్యాదు చేశారు. విశాఖ భూములను ఏవిధంగా కబ్జా చేస్తున్నారో ఆయన పూసగుచ్చినట్లు వివరించడంతో ప్రధాని విస్తుపోయారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో, సీఎంఓ కనుసన్నలలో విశాఖ భూములు కబ్జా చేస్తున్నారని ప్రధానికి వివరించారు. వారికి ఐఏఎస్, రెవిన్యూ అధికారులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

చివరకు కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న అధికారుల భూములు కూడా కబ్జా చేస్తున్నారని, వారి స్థలాల్లో అడ్డుగోడలు నిర్మిస్తున్నారని వివరించారు. ప్రశాంతతను కోరుకునే విశాఖ ప్రజలు, వైసీపీ నేతల భూకబ్జాలతో హడలిపోతున్నారని, సీఎం రమేష్, ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. వాటిపై విశాఖ బీజేపీ నేతలు పోరాటం కూడా చేస్తున్నారని వివరించారు. విశాఖ జిల్లా బీజేపీ నేతలు భూకబ్జాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలకు ప్రజాస్పందన బాగుందని వివరించారు.

విశాఖ జిల్లా ఎమ్మెల్సీ మాధవ్ కూడా, వైసీపీ నేతల భూకబ్జాలు దారుణంగా ఉన్నాయని ప్రధానికి ఫిర్యాదు చేశారు. గతంలోటీడీపీ-ఇప్పటి వైసీపీ పాలన ఎలా ఉందో వివరించారు. వైసీపీ పాలనపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉందని మాధవ్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా సామాన్య, మధ్య తరగతి, ఉద్యోగవర్గాలు జగన్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నాయని ప్రధానికి వివరించారు.

మరికొందరు సీనియర్లు వైసీపీ నేతలు మద్యం, ఇసుక వ్యాపారాల్లో ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నారో ప్రధానికి వివరించారు. మద్యం వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం, డిజిటల్ చెల్లింపుల్లో కాకుండా, నగదు పద్ధతిలో తీసుకుంటున్న వైనాన్ని వివరించారు. దానితో ప్రధాని విస్మయం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న బీజేపీ విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా, జగన్ తీసుకున్న మూడురాజధానుల నిర్ణయంపై అన్ని ప్రాంతాలూ వ్యతిరేకిస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

కేంద్ర పథకాలకు జగన్ తనపేరు, తన తండ్రి పేరు తగిలించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను, జగన్ తన సొంత పథకాలకు వాడుకుంటున్నారని మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. తాజా పర్యటనలో ప్రధాని మోదీ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారంతో, బీజేపీని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర చేశారంటూ ఆ వివరాలు వెల్లడించారు.

ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. తాను ఇటీవల ఎయిమ్స్, ఐఐఎం వంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లో, చేసిన తనిఖీల గురించి మోదీకి వివరించారు. రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న నిధుల గురించి తాను ఎప్పటికప్పుడు వివరిస్తున్నానని ప్రధానికి చెప్పారు.

దానికి స్పందించిన మోదీ.. జగన్ ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ తయారుచేయాలని ఆదేశించారు. మోదీ ఆదేశాలతో పార్టీలు విస్మయం చెందారు. తాము వింటున్నది నిజమా? కలనా అని షాక్ తిన్నారు. జగన్ సర్కారు అవినీతిపై గ్రామ-మండల-నియోజకవర్గ-జిల్లా-రాష్ట్ర స్థాయిలో వైసీపీ సర్కారు అవినీతిపై చార్జిషీట్ తయారుచే యాలని, పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మోదీ ఆదేశించారు. అన్ని స్థాయిల్లో సమస్యలను గుర్తించి, ఆయా చార్జిషీట్‌కు సంబంధించిన పత్రాలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు.

పార్టీ విస్తరణకు సంబంధించి, ఎవరి ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధుల గురించి, వాటిని పక్కదారిపట్టిస్తున్న జగన్ విధానం క్షేత్రస్థాయిలో ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు.

కాగా పార్టీ కార్యకర్తలు సామాజిక కార్యక్రమాలతో, జనంలోకి వెళ్లాలని మోదీ సూచించారు. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మోర్చాలను ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రధాని ప్రశ్నించారు. మహిళా మోర్చాతో అంగన్‌వాడీ అంశాలపై పనిచే యించాలని, యువమోర్చాతో యువత-నిరుద్యోగ అంశాలపై పనిచేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ప్రశ్నించాలని ఆదేశించారు. ప్రధానంగా రైతు-యువత-మహిళా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా మోదీ..గుజరాత్‌లో తన అనుభవాలు కోర్ కమిటీ సభ్యులతో పంచుకున్నారు. సామాజిక కార్యక్రమాలతోనే తాము గుజరాత్ ప్రజలకు దగ్గరయి, అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను గుర్తించి పోరాడటమే కాకుండా, వాటిలో ప్రజలను కూడా భాగస్వాములను చేశామని వివరించారు. జగన్ సర్కారుపై వేసే చార్జిషీట్‌లో అన్ని అంశాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. అయితే.. ఈ భేటీలో జనసేన- టీడీపీతో పొత్తు వంటి రాజకీయ అంశాలేవీ చర్చకు రానట్లు తెలుస్తోంది. మోదీ కేవలం, పార్టీ సంస్థాగత నిర్మాణానికే పరిమితమయినట్లు సమాచారం.

Leave a Reply