• భాస్కర్‌రెడ్డి ఆస్తులపై ఐటీ అధికారులు విచారణ చేపట్టాలి
• టీడీపీ నేతల డిమాండ్
రాష్ట్రంలోని అత్యంత భూబకాసురుల జాబితాలో వినిపించే పేర్లలో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సీఎం జగన్ కుటుంబ సభ్యుడిని అని చెప్పుకుంటూ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా చెరబడుతున్న చెవిరెడ్డికి లోకేష్‌ను విమర్శించే స్థాయిలేదని తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వ్యాఖ్యానించారు. అటువంటి వ్యక్తి లోకేష్ పాదయాత్రపై విమర్శలు చేయడం వింతగా ఉందన్నారు. నియోజకవర్గంలో చెవిరెడ్డి, కుటుంబ సభ్యుల భూకభ్జాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. మంగళవారం యువగళం పాదయాత్ర క్యాంప్‌సైట్ నుంచి టీడీపీ నేతలతో కలిసి మీడియా మాట్లాడుతూ… అక్రమార్జన ద్వారా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే రూ.22 కోట్లు ఖర్చు చేసి పండుగ కానుకల పేరుతో ఇంటింటికి బట్టలు పంపిణీ చేస్తే ఐటీ అధికారులు ఎందుకు ఆయనపై విచారణ చేపట్టడంలేదో అర్థం కావడం లేదన్నారు.
చెవిరెడ్డి అక్రమాలపై ఐటీ అధికారులు విచారణ చేపట్టాలని రవినాయుడు డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలకు మేలు చేయకపోగా రాష్ట్రంలో ఉన్న ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రజలకు స్వీట్లు, లద్డులు ఇచ్చి మోసం చేయాలని చూస్తున్నారని, ఇటువంటి ఆటలు ఇకపై సాగవన్నారు. చంద్రగిరిలో ఇంత వరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకపోగా మట్టి, ఇసుక, నీరు ఇలా అన్నింటిని దోచుకుంటున్న వ్యక్తులు మాపై విమర్శలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
చెవిరెడ్డి అవినీతి చర్చించాలంటే మహాభారతంలోని 18 పర్వాలు సరిపోవు : ఈశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుల్లో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఒకరని, చంద్రగిరిలో ఆయన చేయని అవినీతి లేదని తిరుపతి మండల పార్టీ అధ్యక్షులు ఈశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి ఆయన కుటుంబ సభ్యుల భూకభ్జాల గురించి చర్చించాలంటే మహాభారతంలోని 18 పర్వాలు కూడా సరిపోవన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చెవిరెడ్డికి భయం పట్టుకుందని, కాబట్టే పాదయాత్రపై అవాకులు, చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు.
చంద్రగిరిలో చెవిరెడ్డి అక్రమాలు, అవినీతిపై చర్చించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని, తమతో బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఇటీవల చంద్రగిరిలోని సత్రానికి చెందిన ఒక ఎకరా 10 సెంట్ల భూమిని చెవిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు అక్రమించుకుని దొంగచాటుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నది వాస్తవం కాదా?. సత్రం భూమి విషయంలో టీడీపీ నేతలు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా చిత్తూరు జిల్లాలో అనేక అవినీతి భూకబ్జాలకు పాల్పడిన చెవిరెడ్డికి లోకేష్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కానుకల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న చెవిరెడ్డి
అతితక్కువ కాలంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వేల కోట్లు దోచుకున్న వ్యక్తిగా చరిత్రకు ఎక్కారని, ఆయన ఎమ్మెల్యే కాక ముందు ఉన్న ఆస్తి ఎంత? ఇప్పటి ఆస్తి ఎంత? అనే విషయాలపై మాతో చర్చకు రావాలని టీడీపీ నేత సవాల్ విసిరారు. 77/8, 779/2, 779/3 సర్వే నెంబర్లలోని 15 ఎకరాల 32 సెంట్ల భూమిని గోశాల పేరుతో అక్రమించారు. తాను చేస్తున్న అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి పండుగ పేరుతో ప్రజలకు కానుకలు పంపిణీ చేస్తూ… ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని అన్నారు. జిల్లాలో గోశాలలు ఏర్పాటు చేస్తామంటూ దోచుకున్న మఠం భూముల తాలుకు వివరాలు మా వద్ద ఉన్నాయని, వాటిపై చర్చకు రావాలన్నారు. చెవిరెడ్డి అక్రమాలపై ప్రశ్నించిన నారా లోకేష్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.