– జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
మాచర్లలో చోటు చేసుకున్న దాడుల్ని, అక్కడి పరిణామాలను ఖండిస్తున్నాం.. ఇది అప్రజాస్వామికం.. దీన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలి. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణం.
వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోంది. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదు. పోలీసులు ఇలాంటి ఘటనలను అడ్డుకోవాల్సిన ఆవసరం ఉంది.
రైతు భరోసా యాత్రపై…
సత్తెనపల్లిలో రేపటి రైతు భరోసా సభ మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభించనున్నాం. రైతుల్లో ఒక భరోసా నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పోలీసులు కూడా సహకరించాలని కోరుతున్నాం.గుంటూరు జిల్లాలో ఊహించిన దానికంటే కౌలు రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయి. సుమారు 280 మందికి పైగా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయాల్సి ఉంది. పల్నాడు ప్రాంతంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టే ఆ ప్రాంతంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం. అప్పుడే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. జీపుల్లో వెళ్లొద్దు. బస్సుల్లో వెళ్లొద్దు అంటూ ఆంక్షలు పెడుతున్నారు.లబ్దిదారుల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మొదలు పెట్టారు… జనసేన నుంచి రూ. లక్ష తీసుకొంటే ప్రభుత్వం ఇచ్చే ఏడు లక్షలు పోతాయి అని ప్రచారం చేస్తున్నారు.అన్ని జిల్లాల మాదిరి ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేసే కార్యక్రమాలు మొదలు పెట్టారు. గ్రామాల్లో రైతుల కుటుంబాలకు బెదిరింపులు కూడా మొదలైనట్టు తెలుస్తోంది.
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం విఫలమయ్యింది. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.రైతుల పక్షాన మా డిమాండ్లు అన్నీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సత్తెనపల్లి వేదిక నుంచి ప్రభుత్వం ముందు పెడతారు.