Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులంటే లెక్క లేదా?

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులంటే లెక్క లేదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. విశాఖను పరిపాలన రాజధానిగా డిసెంబర్ నుంచి పాలన ప్రారంభిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం విచారకరం. ఆ ప్రకటన కూడా విచార వదనంతో ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండగా సీఎం జగన్ బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్న మొదటి రాజకీయ నేతను నేనేనని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మాట మార్చి తన నివాసాన్ని విశాఖకు మార్చేందుకు సిద్ధమవుతున్నారు.

జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత నివాసం ఇష్టం వచ్చినట్లు ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చుగాని, 5 కోట్ల ఆంధ్రుల రాజధానిపై ఏకపక్ష నిర్ణయం తగదు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాత్రం జగన్ కే దక్కుతుంది. విశాఖ నుండి పరిపాలన అనే జగన్మోహన్ రెడ్డి ప్రకటన కోర్టు ధిక్కారమే. బాధ్యతాయుత స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును గౌరవించి, తీర్పు వచ్చేవరకు వేచి ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నాం.

LEAVE A RESPONSE