Suryaa.co.in

Andhra Pradesh

పేకాటకు అడ్డాగా చిలకలూరిపేట

మంత్రి రజిని అండదండలు
వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా
ప్రత్తిపాటి పుల్లారావు

రాష్ట్రంలో వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా నడుస్తోందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. మంత్రి రజిని అండదండలతో ఆమె కుటుంబసభ్యులు జూదం మాఫియాను పోషిస్తున్నారని ప్రత్తిపాటి ధ్వజమెత్తారు.

జూదం లేని రాష్ట్రంగా చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రగల్బాలు పలికారని… జగన్ చెప్పే మాటలు మూటలుగానే మిగిలిపోతున్నాయని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలకు పేకాట కేంద్రాలు కాసుల కురిపిస్తున్నాయని అన్నారు.

ఒలింపిక్స్‌లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందని, 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉందని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు. సీనియర్ సిటిజన్స్ క్లబ్‌లను మాత్రం మూసేసి.. అనధికారికంగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నిర్వహిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చిలకలూరిపేటను పేకాటకు అడ్డాగా మార్చారని.. అపార్ట్‌మెంట్లలో, బజార్లలో పేకాట నడుస్తోందని ప్రత్తిపాటి అన్నారు.

మంత్రి విడదల రజిని సహకారంతోనే యథేచ్ఛగా పేకాట నిర్వహిస్తున్నారని… మూడు పువ్వులు… ఆరు కాయలుగా కోతముక్కను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. చిలకలూరిపేటలో జూదం ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని… పేకాట క్లబ్‌ల ద్వారా మంత్రి రజిని కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని తెలిపారు. అనధికారికంగా పేకాట క్లబ్‌లోనే మద్యం సహా అన్నీ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. కంటిచూపు మేరలో ఉన్న చిలకలూరిపేటలో జరిగేది సీఎం జగన్‌కు కనిపించట్లేదా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు.

సీనియర్ సిటిజన్స్ ఆడుకునే క్లబ్‌లు మూసేసి అనధికారికంగా పేకాట క్లబ్‌లు తెరిచారని.. వైకాపా నేతల జేబులు నింపుకునే దురుద్దేశం స్పష్టంగా కనబడుతోందని ప్రత్తిపాటి చెప్పారు. సీఎం జగన్, మంత్రి రజిని పుణ్యాన రాష్ట్రంలో ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని.. ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో జరుగుతున్న ఈ తతంగం ఎస్ఈబీ, పోలీస్‌శాఖకు కనిపించట్లేదా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు.

ఎవరికి అందేవి వారికి అందుతున్నాయని.. రూ.కోట్లలో చేతులు మారుతున్నాయని అన్నారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఎస్సీ కులానికి చెందిన కృష్ణయ్య చనిపోతే ఏం చేస్తున్నారని? .. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఎస్సీలకు రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. జూదాన్ని నియంత్రించి, నిర్వహకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, మాటలు కాకుండా చేతల్లో చూపించాలని సీఎం జగన్‌ను డిమాండ్ చేస్తున్నామని ప్రత్తిపాటి తెలిపారు.

 

LEAVE A RESPONSE