• రైతు సమస్యపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలకు దిగజారడం వైసీపీ నైజం
• ప్రజలు పవన్ కళ్యాణ్ కి దగ్గర అవుతున్నారన్న భయం ప్రభుత్వానికి పట్టుకుంది
• రైతు ఆత్మహత్యల జాబితా మీరు పట్టుకురండి… మేం సాయం అందిస్తాం
• ప్రజల డబ్బును వైసీపీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు
• జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
‘రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లకు చెబుతున్నాం – రాసలీలల స్క్రిప్ట్ రెడీ గా ఉంది.. ఇది మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు.. మీరు ఓకే అంటే మంచి రాసలీలల స్క్రిప్ట్ తో సినిమా తీద్దాం. ఐతే ఒకటే చిక్కు. పాపం నిర్మాతలకు మీ ఆడియో లీక్ లిస్ట్ లో ఉన్నవాళ్లందరిని హీరోయిన్లుగా పెడితే తడిసి మోపెడు అవుతుంది అని భయం. మంత్రులుగా ఉన్నప్పుడు సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే మేము కూడా మీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నాం. మీలాంటి వారికీ మంత్రి పదవి ఇవ్వడమే ఎక్కువ. ఎన్నో లెక్కలు వేసి సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. మీలాంటి వారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు కూడా రానివ్వరు గుర్తు పెట్టుకోండి’ అంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి స్పష్టం చేశారు.
అనంతపురంలో ఆయన సోమవారం మాట్లాడుతూ “రైతు సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు పోరాడుతూ ఉంటే సమాధానం కరువై ఇస్టానుసారం మాట్లాడటం సరికాదు. రైతు భరోసా యాత్ర విజయవంతం అవుతుంటే ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి మానవత్వం ఉండాలి. తన సొంత డబ్బు ఐదు కోట్ల రూపాయలను రైతుల కోసం వెచ్చించిన పవన్ కళ్యాణ్ గురించి రైతుల్లో వస్తున్న మంచి ఆలోచనను దారి మళ్లించడానికి మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారు. చేతనైతే సాయం చేయండి.. అంతేగాని ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలొద్దు. గత మూడేళ్ల కాలంలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి దగ్గరికి వెళ్ళని మనస్తత్వం మీది. రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత మీకు లేదు.
• ప్రజల దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్
ప్రజలు కష్టాల్లో ఉంటే కదిలిపోయే గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ కి సొంతం. ఆయన ప్రజలకు దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ ని ఎవరో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారి సహాయం తీసుకుంటున్న రైతు కుటుంబాల్లోని పిల్లల చదువు బాధ్యతను జనసేన పార్టీ తీసుకుంటుంది. చివరి వరకు వారికి తోడు ఉంటాం. మీ దగ్గర సమాధానం లేక సమస్యను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు అని అర్థం చేసుకొని విష ప్రచారాలు మొదలుపెట్టారు. కచ్చితంగా రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి దగ్గర అవుతున్నారని మీకు అర్థమైంది. అందుకే వ్యక్తిగత విమర్శలతో సమస్యను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
• పొత్తుకు, మద్దతుకు తేడా తెలీదా?
మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పొత్తుకు, మద్దతుకు తేడా తెలియకపోవడం విచారకరం. 2014లో టీడీపీకి కేవలం జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది. అనంతరం 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన తప్పులను బహిరంగంగా ప్రశ్నించాం. పొత్తులకు, మద్దతుకు తేడా తెలియని మంత్రులు ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. మీ నాయకుడులాగా మా నాయకుడు జైలుకు వెళ్ళలేదు. అక్రమం, అన్యాయం చేసి జైలు గడప తొక్కలేదు అది అర్ధం చేసుకోండి.
• అప్పుడు బూతుల మంత్రులు, ఇప్పుడు అయోమయం మంత్రులు
గతంలో ఏ కార్యక్రమం చేసినా బూతులతో రెచ్చిపోయే మంత్రులు ఉంటే, ఇప్పుడు అయోమయం మంత్రులు ఉన్నారు. ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలితే గతంలో బూతుల మంత్రికి గొడ్ల చావడిలో పడుకునే గతి పట్టింది. ఆ గతే మీకు పడుతుంది. ప్రతి విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు.. గమనిస్తున్నారు. మీ అసత్య ప్రచారాలను, అసత్య హామీలను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ భయమే మీకు పట్టుకుంది. అందుకే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
గ్రామ సచివాలయాలు గతంలోనూ ఉన్నాయి. దానికి సెక్రెటరీ, ప్రత్యేక సిబ్బంది ఉండేవారు. తమిళనాడు ప్రభుత్వం గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ ను ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదర్శంగా తీసుకుందని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు. తమిళనాడులో వారిది ప్రజా సేవ.. ఇక్కడ మీది పార్టీ సేవ. రాజ్యాంగ విరుద్ధంగా వాలంటీర్లను నియమించుకొని పార్టీ కార్యక్రమాలను చేయించుకుంటున్నారు. ప్రజల సొమ్మును వారికి వేతనాలు ఇస్తూ పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ చర్య. డూప్లికేట్ రత్నాలు పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. ఒక్కొక్క రత్నం మాయం అవుతుంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. ధరలు పెంచేసి, ప్రజల బతుకులతో ఆటలు ఆడుతున్నారు. ఇదే పెద్ద గొప్ప విషయం అని ప్రచారం చేసుకుంటున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఏడు మంది రైతు కుటుంబాలకు సాయం అందించాలని మంత్రి అమర్నాధ్ చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 42 మంది ఆత్మహత్య చేసుకుంటే మీరు కేవలం ఏడు మందికి మాత్రమే సాయం అందించామని చెప్పారు. అంటే మిగిలిన వారిని విస్మరించారు అనే కదా..? రైతు భరోసా సాయం విషయంలోనూ మీరు కులం ఆధారంగా వారికి డబ్బులు పంపిణీ చేయడం సిగ్గు చేటు. మీకు అనుకూలంగా లేని వారికి నిబంధనలు పేరు చెప్పి సాయం అందకుండా చేస్తున్నారు” అన్నారు.