– తాజాగా 20,472 కేసులు
-రంగంలోకి ఆర్మీ
– లాక్‌డౌన్ సహా అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు
ప్రపంచంపై తాను సంధించిన కరోనా వైరస్ ఇప్పుడు చైనాకే రివర్స్ అయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం తగ్గిపోగా, చైనాను మాత్రం ఇంకా వెన్నాడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు చైనా సర్కారుకు చెమటలు పట్టిస్తున్నాయి.
కరోనా పుట్టినిల్లు చైనాని గత కొన్ని రోజులుగా ఈ మహమ్మారి హడలెత్తిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఒక్కరోజే సుమారు 20 వేల కరోనా కేసులను వెలుగు చూసినట్లు బుధవారం ఒక నివేదిక వెల్లడైంది.
జీరో కోవిడ్ విధానం దారుణంగా విఫలమై చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అతి పెద్ద నగరమైన షాంఘైలో ఒమిక్రాన్ మ్యుటెంట్‌కి సంబంధించిన కేసులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ సహా అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. పరిస్థితి చేజారిపోనివ్వకుండా ఆర్మీని సైతం రంగంలోకి దించారు.
ఈ మహానగరంలో దశల వారీగా లాక్‌డౌన్‌లు విధించకుంటూ పోతుండటంతో నిర్బంధంలో ఉన్న ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాజాగా బుధవారం షాంఘై మొత్తం జనాభాకి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా.. సుమారు 20,472 కేసులు నమోదైయ్యాయని, కొత్తగా ఎటువంటి మరణాలు సంభవించలేదని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఒక్క షాంఘై నగరంలోనే దాదాపు 80% మేర కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.