( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే సీఎం చంద్రబాబునాయుడు.. ఆదివాసీ దినోత్సవం రోజున రొటీన్‌కు భిన్నంగా కనిపించారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారుల సమీక్షలోగానీ, విపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల సమావేశాల్లోగానీ బాబు సీరియస్‌గా ఉండటం రివాజు. ఆయన నవ్వుతూ కనిపించే సందర్భాలు బహు అరుదు.
ఒక అంశంపై మాట్లాడితే ఇక దాని లోతుల్లోకి వెళ్లి, ఇతరులు చెప్పేది వినడం, నచ్చితే అందులోని పాయింట్లు నోట్ చేసుకోవడం ఆయనకున్న ఒక అలవాటు. మళ్లీ తాను తెలుసుకున్న దాని మరోక సమావేశంలో ప్రస్తావించి, ‘ఆవిధంగా ముందుకువెళ్లాల’ని సూచిస్తుంటారు. అలాంటివి ఇంకెక్కడయినా ఇంటే స్టడీ చేయాలని చెబుతుంటారు.
పని.. పని.. పని. ఇదే చంద్రబాబులో చాలామంది చూసేది. ఇటీవలి కాలంలో పార్టీ ఆఫీసుకు వ చ్చి, బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న సమయంలో.. దాదాపు మూడు గంటలు వారి మధ్యనే గడుపుతున్నారు. ఆ మూడు గంటల్లోనూ ఆయన కూర్చోకుండా.. అలుపులేకుండా నిలబడే వారి అర్జీలు స్వీకరించడం, చెప్పింది వినడం, ముఖ్యమైనవయితే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేసే దృశ్యాలు చూస్తున్నాం. అదే మంత్రులు-పార్టీనేతలు కూర్చునే అర్జీలు తీసుకుంటున్నారు. బాబు ఏది చేసినా ఒక ఉద్యోగం మాదిరిగా చేస్తుంటారంతే. ఏడుపదులు దాటిన చం
ద్రబాబు స్టామినా అదీ! అందుకే ఆయనను అధికారులు-పార్టీ నేతలు పనిరాక్షసుడంటారు.
అలాంటి చంద్రబాబు, గిరిజన దినోత్సవం రోజున రొటీన్‌కు భిన్నంగా కనిపించారు. వారితో కలసి సరదాగా ధింప్సా నృత్యం చేశారు. వారు పెట్టిన సంప్రదాయ కిరీటం ధరించారు. సహజంగా ఇవి బాబు శైలికి విరుద్ధం. ఎందుకంటే ఆయనెప్పుడూ సీరియస్సే కాబట్టి!
వారు తయారుచేసిన ఉత్పత్తుల స్టాళ్లను ఒక్కటి కూడా వదలకుండా పరిశీలించారు. ఆ సందర్భంగా గిరిజనుల కష్టం తాలూకు శ్రమ, అందుకు వారికి పట్టిన సమయాన్ని వారిని అడిగితెలుసుకున్నారు. మొత్తంగా గిరిజన దినోత్సవం మరో చంద్రబాబును ఆవిష్కరించింది.