Suryaa.co.in

Andhra Pradesh

శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్

– రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, డిసెంబర్ 24: శాంతి, సంతోషానికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని, ఈ పండుగను క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్రీస్తు జన్మించి నేటికి 2 వేల ఏళ్ళు దాటినా కరుణామయుడుగా, దయామయుడుగా ఆయన క్రైస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారన్నారు. 2 వేల ఏళ్ళ కిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే ఆగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కించేందుకు నిర్ణయించారన్నారు. ఈ లెక్కలను సులభంగా సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వారు డిసెంబర్ 25 వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడన్నారు . అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ కు పెళ్ళి కుదిరిందని చెప్పారు. ఒక రోజున మేరీకి దేవదూత గాబ్రియేల్ కలలో కనబడి నీవు కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తావని, అతనికి ఏసు అని పేరు పెట్టాలని, అతడు దేవుని కుమారుడని చెప్పాడన్నారు.

దేవదూత చెప్పిన విధంగానే మేరీ గర్భం దాల్చిందని, ఈ విషయం తెలిసిన జోసెఫ్ ఆమెను వివాహం చేసుకునేందుకు నిరాకరించడంతో అతని కలలోకి కూడా దేవదూత వచ్చి మేరీని విడిచిపెట్టొద్దని, దేవుని వరం వల్ల మేరీ గర్భవతి అయిందని, ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడని చెప్పడంతో జోసఫ్ దైవజ్ఞను అనుసరించి మేరీని ప్రేమతో ఆదరించాడన్నారు. రాజాజ్ఞననుసరించి జోసెఫ్, మేరీలు తమ స్వగ్రామమైన బెత్లహేంకు బయలుదేరారని, అక్కడ వారికి పశువుల పాకలో ఆశ్రయం దొరికిందన్నారు. అక్కడే మేరీ ఏసుకు జన్మనిచ్చిందని, ఆ సమయంలో దేవదూత వచ్చి పశువుల పాకలో లోక రక్షకుడు పుట్టాడని, ఆయనే మీ అందరికీ ప్రభువని గొర్రెల కాపరులతో చెప్పడం జరిగిందన్నారు. వారంతా వచ్చి క్రీస్తును చూసి దేవదూత చెప్పిన విషయాన్ని అందరికీ తెలియజేశారన్నారు. 2 వేల సంవత్సరాల కిందట డిసెంబర్ 24 వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తర్వాత క్రీస్తు జన్మించాడని, ఆ రోజునే క్రిస్మస్ గా జరుపుకుంటూ వస్తున్నారన్నారు.

క్రిస్మస్ కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుందని, క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చిలను అందంగా అలంకరిస్తారన్నారు. వెదురుబద్దలు, రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటిపై వేలాడదీస్తారని, క్రిస్మస్ ట్రీని కూడా ఏర్పాటు చేసుకుంటారన్నారు. క్రిస్మస్ ముందురోజు రాత్రి శాంతాక్లాజ్ ఆకాశం నుండి ధృవపు జింకలు లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తారని నమ్ముతుంటారన్నారు. ఇందు కోసం పిల్లలు తమ మేజోళ్ళను ఉంచుతారని, అలా ఉంచితే శాంతాక్లాజ్ వాటిలో బహుమతులు వేసి వెళ్తాడని నమ్మకమన్నారు. క్రిస్మస్ పండుగ ప్రేమాభిమానాలు, సుఖసంతోషాలను తెస్తుందన్నారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపంలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలన్నారు. క్రీస్తు దయ, కృపతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తున్న సీఎం జగన్మోహనరెడ్డికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE